Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంధ్ర మహావిష్ణువు చారిత్రిక గాధ—సత్యప్రభ 3 : బాపు బొమ్మలతో సహా



5  ప్రకరణం.

గజవీరుని జాబు విన్నప్పుడు  సుచంద్రుని  అంతఃకరణలో  తాను  రాజకార్యాలలో  తగినంత శ్రధ్ధ  తీసుకొనక పోవడం నిజమే అని తోచింది.. మహామంత్రి చర్యను  గురించి కూడ అనుమానం కలిగింది. అతడు లంచగొండియే కానప్పుడు , అతనికి అంత గొప్ప సంపద పట్టడానికి  హేతువేమిటని  మహారాజు మనసులో శంక పుట్టింది. శివంకర సంఘం వారు మహామంత్రి  విరోధులే గాని రాజ విరోధులు కారని  అతనికి  స్ఫురించింది. మహామంత్రి  రాష్ట్రీయులు  తండ్రి  కొడుకు లిద్దరున్నూ చేరి  పట్టుబట్టి  శివంకర సంఘాన్ని  విప్లవ సంఘంగా  ప్రకటింప చేసినది  అన్యాయమేనేమో  అని ఆ ప్రభువు తటపటాయించాడు .శాంతిసేన  జాబు  ప్రభువును  మరింత కల్లోల పరచింది. చంద్రప్రభ  మోసమే చేసినట్లయితే  వీరేశ్వరుని పదభ్రష్టుని  చేసి, శాంతిసేనకు సింహాసనాన్ని ఇచ్చి  వేయాలని  అతనికి తత్కాలం ఒక భావం పుట్టింది.
పార్థివుని  ముఖచ్ఛాయలో నుండి  సచివుడు  లోపలి  భావాన్ని పసి గట్టాడు. సుమారు  ఇరవై రెండు సంవత్సరాలు  నిరంకుశంగా రాజకులంలో  విజృంభిస్తున్న  మహామంత్రి  పతాకను  ఆ దినం దింపి వేయ వచ్చునని  అతడు  ఆశించాడు.  రాజుగారి  ముఖం  తనకి అనుకూలంగా  లేదని  మహామంత్రి కనిపెట్టక పోలేదు. మంత్రాలోచనకు  మరి  రెండు రోజులు  వాయిదా  వేయాలను కొన్నాడు. వాయిదా  పడితే  అంతః పురం  లోని  తన  సమ్మోహనాస్త్రం  రాజాంతః కరణాన్ని మార్చి వేయ గలదని  అతని  ఆశ !
సచివుడు  లేఖా  పఠనాన్ని ముగించి, ఆసనంపై  కూర్చొన్నాడు. కొన్ని క్షణాలు  ఆ రంగ స్థలం నిశ్శబ్దంగా ఉండింది. మహారాజే ప్రసంగ ద్వారాన్ని తెరచాడు.
చిన్న మామయ్యా ! నిశంభు నాగుని  జాబుకు  ప్రత్యుత్తరం  ఏ విధంగా  ఇవ్వాలి ?”
ఈ విషయాన్ని సంపూర్ణ  మంత్రి సదస్సులో చర్చిస్తే  బాగుంతుందని నా  మతం. మనం  విప్లవ సంఘాన్ని సులభంగా అణచి వేయగలమా లేదా, అన్న విషయంలో  రాష్ట్రియునితోనూ, సేనాపతి తోనూ చర్చింప వలసి ఉంది. నిశంభునికి  పర రాజుల  మద్దత్తు  కలదేమో  అనే సంగతిని  ఆలోచించడానికి  దూతసామంతుని  సహాయం అవసరం. అలాగే పన్నులు  తగ్గించడానికి అవకాశం  కలదా అనే సమస్య  మహాసమాహర్త  తేల్చవలసి ఉంది.అన్నాడు మహామంత్రి.
విప్లవ సంఘాన్ని  ఆణచడానికి  మనలో  సామర్థ్యం  ఉన్నప్పుడు నిశంభునితో  సంధి చేసుకోకూదదనేనా మీ భావం ?” అని ప్రశ్నించాడు మహారాజు.
మహాప్రభో ! అది  రాజనీతి ! సాధ్య శతృవుతో  సంధి  అకార  లేదని నీతివేత్తలు అంటారు. నిశంభుడు  ధర్మాన్ని అనుసరించి  చిత్రకూట రాజ్యాన్ని తనకి ఈయమని కోరలేదు.వాడు కోరేది న్యాయం కాదు. తన  క్రౌర్యంచే  రాష్ట్రాన్ని  గాసిపెట్టి, భయాన్ని  పుట్టించి ఇప్పుడు వాడు తన  క్రూర చర్యలని ఆపడానికి  ప్రతిఫలంగా రెండు ప్రాంతాల్ని కోరుతున్నాడు ! వాని క్రూర చర్యలని  ఆపడానికి మనకి  శక్తి  ఉన్నప్పుడు  వానికి మనం ఎందుకు లొంగాలి ?”
వాని క్రూర చర్యలని ఆపే  శక్తి మనకి ఉందా, లేదా  మీ  అభిప్రాయం ఏమిటి ?”
ఉందనే నా అభిప్రాయం ! అయినా రాష్ట్రీయ, సేనాపతులని కూడా  ఈ విషయంలో  సంప్రదించడం  బాగుంటుందని నా మతం.
అన్ని విషయాలపై చర్చ వాయిదా వేయించేందుకే  మహామంత్రి  ఇలాంటీ ధోరణీ అవలంబించినాడు. ప్రథమ విషయం తక్షణమే ఆలోచించడంలో అతని కెలాంటి ప్రతిబంధకం లేదు. కాని మొదటి దానికి వాయిదా పడితేనే గాని తక్కిన రెండు విషయాలు వాయిదా వేయించడానికి హేతువు దొరకదు. ఊ గుట్టు మహారాజు కనిపెట్టక పోయినా సచివుడు తెలుసుకొన్నాడు.ఆ సమయం తప్పితే రాజుగారి వేడిని చతురు రాలైన రాణి చల్లార్చి వేస్తుందని  సచివుడు తలంచాడు. ఆ పుణ్య కాలాన్ని వృథాగా పోనివ్వ కూడదని  కూడా తలంచాడు. మాట్లాడడానికి తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.
ఇంతలో రాజు సచివుని ముఖాన్ని చూసాడు. ఆ చూపు నీవు మాట్లాడు అన్నట్లు  సూటిగా కనిపించింది. పిమ్మట  సచివుడు , మహమంత్రి  సూచనని  నిర్మొహమాటంగా ఈ విధంగా ఖండించాడు.
మహాప్రభో ! నా శాఖలో ఇతరుల జోక్యాన్ని నేను సహింప జాలను.మన రక్షిదళం శక్తి  లేనిదని చెప్పడానికి రాష్ట్రియినికి అధికారం లేదు. చోరులను పట్టడాం అతని పని గాని, చేతకాదని  చెప్పడం అతని పని కాదు.అతనికి చేత కానప్పుడు మర్యాదగా పనిని విడిచి  పెట్టాలి. రాష్ట్రియుడింకా పనిలో ఉన్నందున తన రక్షక దళం విప్లవ సంఘాన్ని అణచి వేయగలదని నమ్మకమున్నట్లే అని మనం  ఎంచ వచ్చును. సేనాపతి కూడా రాజాఙ్ఞని అనుసరించి పోరవలసిన  వాడే గాని, నాకు చేత కాదని యుధ్ధాన్ని తప్పించుకొను అధికారం అతనికిలేదు. దూత సామంతునికి , పర రాజుల మద్దత్తు నిశణ్భునికి ఉందని తెలిసి ఉంటే అతను ఇదివరలోనే  శ్రీవారి ఎదుట మనవి చేసి ఉండేవాడు. ఇప్పుడు క్రొత్తగా అతని అడగ వలసిన  ప్రమేయం లేదు. సంధిమ్ అవసావసరాలని చర్చించే అధికారం ఇద్దరికే  ఉంది. పర రాజులతో సంధి  సూత్రాలని ఆలచించాల్సి ఉన్నప్పుడు దూత సామంతుడును , దేశీయ విప్లవకారులతో సంధి సూత్రాలని ఆలోచించ వలసి ఉన్నప్పుడు  సచివుడున్నూ  రాజకులంలో  అధికారులై  ఉన్నారు. దీనిలో మహాసమాహర్త గాని మరి ఏ ఇతర శాఖా మంత్రి గాని,జోక్యం చేసుకోవడం రాజకుల సాంప్రదాయానికి విరుధ్ధం. ఇప్పటి  ఆలోచనలో  శాఖాంతర  సంబధ్ధ విషయాలు  అంగభూతంగా  చర్చకు వచ్చేటప్పుడు  సర్వ శాఖాధికారి  మహామంత్రి ఉండనే  ఉన్నారు. కాబట్టి ఈ విషయం ఈ రాజకులం లోనే  చర్చింపబడ వలెను.పూర్ణమంత్రి సదస్సు కూర్చనవసరం లేదు.
ఇంత  గొప్ప సమస్యని మనం ఇద్దరం  మాత్రమే  భాద్యత వహించి చర్చించుట  అంత మంచిది కాదు.అని
చెప్పాడు మహామంత్రి..
రాజుగారికి  ఇంకా  తన మహమంత్రి  తత్త్వం  బోధపడ  లేదు. వాస్తవంగా క్లిష్ట సమస్య కాబట్టి  మహామంత్రి పూర్ణమంత్రి  సదస్సును సూచిస్తున్నాడని తలంచాడు.  సచివుని వాదం కూడ  అతనికి యుక్తి యుక్తంగా తోచింది. కాబట్టి ఇద్దరినీ గౌరవిస్తూ  నరపతి ఇలా అన్నాడు !
యథావిధిగా  ఈ చర్చ జరిగి పోనీండి. కొసకి మన తీర్మానం అమల్లో  పెట్టే సమయంలో  నా  కేమైనా సంశయం  కలిగినప్పుడు, నా అసాధారణ  అధికారాన్ని  ఉపయోగించి  పునరాలోచనకి సంపూర్ణ  మంత్రి సదస్సుని  సమావేశం చేస్తాను.
ఈ సూచన మహామంత్రికి ప్రియంగా ఉంటుందని  మహారాజు  తలంచాడు. మహామంత్రి  రాజుగారి  సూచనకు బదులేమిన్నీ  చెప్పలేక  పోయాడు. తాను  పరాజితుని వలె  మానసికంగా క్రుంగి  పోయాడు.సచివుడు సంతోషించాడు. ఆలోచనా  కండ ఆరంభ మయింది. శాఖామంత్రి  ముందుగా మాట్లాడాడు.
మహాప్రభో ! అట్లే కానీయండి. నిశంభు నాగుడు  పంపిన  మూడు షరతులలో  ఒకటి కూడా మనకు ఆచరణ సాధ్యం కాదు. చిత్రకూట రాష్ట్రాన్ని  మీ నాన్నగారు బాబయ్య గారికి  ఇచ్చారు. వారి వారసుడు  ఇప్పుడు దానిని అనుభవిస్తున్నాడు. అతని వారసత్వం సరైనదేనా , వంచనా లబ్ఢమా  అనే విషయం ఈ సమస్యలో  ముఖ్యమయినది  కానేరదు. ఎట్లయినా  మేఘస్వామి భట్టారకుల వారి  వారసులు  అనుభవించ  వలసినదే , ఆ రాష్ట్రం ! దానిని  ఇంకొకరికి ఇచ్చివేయటం దత్తాపహార మవుతుంది. పార్వతీయ  ప్రాంతం  శ్రీవారి జయచిహ్నం. అనేకాంధ్ర వీరుల రక్తానికి ప్రతిఫలంగా  వచ్చింది ఆ ప్రాంతం. నిశంభుని  మాటపై పన్నులు  తగ్గించడం  మనకి  కీర్తికరం  కాదు. ఆ క్రూరుడైన  దొంగ  మహారాజ  సుచంద్రుల  వారి ప్రభుత్వంచే  బాధపడే  ప్రజలను  ఉధ్ధరించానని తాను డాబులు  కొట్టుకొనడాని కిన్నీమన ప్రభుత్వ కోశాన్ని దుర్బలం చేయడాని కిన్నీ  వేసిన ఎత్తుగడ  ఇది !
మహామంత్రికి కూడా నిశంభునితో  సంధి ఇష్టం లేదు. తాను రూపచంద్రుని సమర్థించిన , అంతటితో    విషయం  ముగిసి, ఇతర  విషయాల  చర్చకి  తావిస్తుంది ! అది అతనికి ఇష్టం లేదు. ప్రథమ విషయ  విచారణలో కాలాన్ని పొడిగించి  చాల రాత్రి  అయిందను  మిషచే అనంతర  విచారణకు వాయిదా  వేయించాలని  అతడు మరొక  ఉపాయాన్ని  ఆలోచించి  సచివుని సూచనకు అడ్డుపెట్టి  ఇలా అన్నాడు.!
నిశంభుడు పంపిన షరతులు మనకు అంగీకారం కాకపోవచ్చును.అయినప్పటి కిన్నీ,వారి సంధి సూచనలను మనం పూర్తిగా  తిరస్కరించడం  మంచిది కాదు. వేరు సంధి  షరతుల్ని  మనము వానికి  పంపాలి. అవి ఏ విధంగా ఉండాలో  మనం  ఇప్పుడు  ఆలోచించాలి.
సుమారు కోటి కార్షాపణములు (రూపాయలు) తక్కువ  లేకుండా  సర్కారు వారి సొత్తుని నిశంభుడు అపహరించాడు. వాడు అపహరించిన  ప్రజల సొమ్ము దానికి ద్విగుణంగా ఉంటుంది. నూరు మందికి తక్కువ లేకుండా మన రక్షక భటులు  వాని అనుచరుల చేత చంపబడ్డారు. సామాన్య ప్రజలలో కూడ ఎన్నో హత్యలు  వానిచే  కావింపబడ్డాయి. ఈ తప్పులకి వాడు, వాని అనుచరులు  దారుణమైన రాజదండనం  పొందతగి  ఉన్నారు. తాను ఇక మీద తన దుశ్చర్యలకి  స్వస్తి చెప్తానని  వాడు అంగీకరించి నప్పుడు అతని సంఘాన్ని క్షమించడమే మనం వానికి సూచించే సంధి షరతుగా ఉండాలి.
ఈ సూచన అయ్యా, నీతో మాకు సంధి పొసగదు అని చెప్పడానికి పర్యాయ  పదం !అని నవ్వాడు మహామంత్రి.
అయితే  మీ ఉద్దేశమేమి ?” అని ప్రశ్నించాడు మహారాజు.
మన రాజ్యంలో నాగుల సంఖ్య మిక్కుటంగా ఉంది. వారికి ఇంకా కాకుల, మంథనాధ వంశాలపై  భక్తి అంతరించ లేదు.
నేను అడిగితే మీరు సూచించే సంధి షరతు,” అని చటుక్కున మహామంత్రి కాల విలంబన సూత్రానికి అడ్డుకర్ర వేసాడు మహారాజు.
దొరికి పోయిన దొంగవలె  మహామంత్రి  ఇలా అన్నాడు.
ఏదైనా ఒక సంస్థానాన్ని సృష్టించి నిశంభునికిచ్చి, వానిని సామంతునిగా స్థాపించిన మనకంత నష్టం ఉండదను కొంటాను.
ఇద్దరొక సంస్థానంతో తృప్తిని ఎట్లు పొందగలరు ?” ఎదురు ప్రశ్న వేసాడు రూపచంద్రుడు.
వారిద్దరూ భార్యాభర్తలై ఉంటారని నా ఊహ !
రాష్ట్ర మధ్యంలో వారికి సంస్థానాన్ని ఇవ్వడం చాలా అపాయకరం. అక్కడ నాగుల సంఖ్య అధికంగా ఉంది. అతడు సమయం చూసుకొని పునర్విప్లవాన్ని లేవతీయడానికి  అవకాశాలుంటాయి. పార్వతీయ ప్రాంతాన్ని ఒక మహా మండలంగా ఏర్పరిచి వారికి సామంత రాజ్యంగా ఇచ్చిన  బాగుంటుంది. ఇదే నా అభిమతమైన సూచన. పార్వతీయ ప్రాంతంలో నాగుల సంఖ్య చాలా స్వల్పం.అని చెప్పాడు సచివుడు.
పార్వతీయ  ప్రాంతంలో భర్తృదారిక  రథినీ కుమారిని  మహామండలేశ్వరిగా  అభిషేకించిన  బాగుండునని  మేము  ఇది వరలో తలంచుతున్నాము. వివాహానంతరం ఆమె ఒక  మహామండలేశ్వరిగా ఉండడం వాంఛనీయం,” అన్నాడు  మహామంత్రి.
ఆ అడవులకి కుమారిని  పంపడం నాకిష్టం లేదు,” అన్నాడు రాజు.
సర్కారు వారి  జయచిహ్నమైన  పార్వతీయ  ప్రాంతాన్ని ఇతరులకి  స్వాధీన పరచడం యుక్తం కాదని  ముందు చెప్పిన సచివ  మహాశయుడు  ఇప్పుడు దానిని విడిచి  పెట్ట  వచ్చునని చెప్పడం అబ్బురంగ ఉంది,” అన్నాడు మహామంత్రి.
స్వతంత్రంగా  ఇవ్వకూడదనే నే నన్నాను. సామంత రాజ్యంగా ఇచ్చినప్పుడు మన అధికారం ఉండనే ఉంటుంది.
సచివుడు చెప్పిన  సూచన బాగానే ఉంది. ఇరావతీ నిశంభు లిద్దరూ సంధికి అంగికరించే పక్షంలో  వారికి సామంత  రాజ్యంగా  పార్వతీయ మహా మండలాన్ని  ఇచ్చివేయ వచ్చును. దంపతులై కలిసి  రాజ్యం చేసుకోవడమో , లేక  రెండు మండలాలుగా  విభజించు కొనడమో  వారి ఇష్టం ! అని మహమంత్రిని చూసి, “ ఈ సంగతిని  రేపు ప్రాతఃకాలమందు యోగీశ్వరి  ధవళాక్షికి  ప్రభుత్వ పరంగా  మీరు తెలియ  పరచండి.దీనికి పునరాలోచన  అవసరం లేదు,” అని ప్రథమ  విషయ ఆలోచన  ఘట్టానికి  పరిసమాప్తి  చేసాడు మహారాజు.
ఆఙ్ఞ ప్రకారం అలాగే  చేస్తానుఅని  హీన స్వరంతో  చెప్పాడు  మహామంత్రి.
కౄరుడైన  నిశంభునితో  సంధి  నాకు ఇష్టం లేనప్పటికీ  జటాముని  సంధిని ఆశించుట వల్లనూ, చిన్న  మామయ్య కొసకి  సంధికి  సలహా  ఇచ్చినందు వల్లనూ  నే నొక  విధమైన సంధి మార్గానికి వచ్చాను.
కడపటి మాటలు మహామంత్రికి  పోయిన  ప్రాణానికి జీవం పోసినట్లు  అయింది. కాని ఉత్తర  విషయాల  పట్ల చర్చ  ఎట్లు  ముగుస్తుందో  అని అతడు ఆందోళన చెందాడు.
====================
6  ప్రకరణం.
మంతనపు ద్వితీయ ఘట్టం ప్రారంభ మయింది. కొన్ని క్షణాల వరకు  రాజకులం  నిశ్శబ్దాన్ని వహించింది. అనంతరం  మహారాజు  నిశాత  దృష్టితో  మహామంత్రిని  చూసి ఇలా  అన్నాడు.
చిన్న మామయ్యా ! శివంకర  సంఘ నాయకుని  జాబుని  గమనించారా ?”
గమనించాను, నన్ను  దూషించడమే  ఆ జాబు  ముఖ్యోద్దేశమని తెలుస్తోంది.
దానికి  మనం ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో విచారించండి. శివంకర  సంఘం  ముఖ్యోద్దేశాలేవో కనుక్కోవడం  చాల అవసరం. నేను వారి ప్రతినిథితో మాట్లాడవచ్చునా, కూడదా ? మీ అభిప్రాయం చెప్పండి.
రెండు మూడు క్షణాలు ఆలోచించి మహామంత్రి  ఇలా అన్నాడు.
ఒక షరతుని  వారంగీకరించిన, శ్రీవారు వారి ప్రతినిధితో మాట్లాడ వచ్చును.
ఆ షరతేది ?” అని ప్రశ్నించాడు రాజు.
గజవీరుడు తన సంఘంతో బయటపడి వచ్చి అందరిని క్షమాబిక్ష కోరినచో వారి ప్రతినిథితో శ్రీవారు  మాట్లాడ వచ్చును.
సుచంద్రుడు రూపచంద్రుని చూచాడు. వెంటనే  రూపచంద్రుడు ఇలాగు మాట్లాడాడు.
శివంకర సంఘం నుండి ఎలాంటి వాఙ్ఞూలాన్ని పుచ్చుకోకుండానే రాజకులం ఆ వీర యువకుల సంఘాన్ని విప్లవ సంఘంగా  ప్రకటించింది.
అర్థోక్తిలో  సునందుడు అడ్డుపడి , “రాజకుల చర్యల్ని విమర్శించడానికి సచివునకు అధికారం లేదు.అని ఖండించాడు.
సచివునకు  వ్యక్తిగతంగా  అధికారం లేదు. ఇప్పుడు సచివుడు  రాజకులంలో కూర్చొన్నాడు. అతడు చేయు విమర్శనము రాజకులంచేసినట్లే ఎంచ వలెను. ఒక రాజకులం చేసిన  నిర్ణయాన్ని మరొక రాజకులం  సందర్బానుసారంగా  విమర్శించ వచ్చునన్న  నిబంధన అభ్యనుఙ్ఞను ఇస్తుంది.
ఔను తప్పు లేదు, మీ వాదన సాగనివ్వండిఅన్నాడు మహారాజు.
మహామంత్రి తన స్థితి చెడిపోయిందను కొన్నాడు. తన మాట యిదివరలో రాజకులంలో ఎన్నడూ ఖండింప బడలేదు. ఈ రాత్రి సచివునిచే అది (తన మాట) తెలకపిండి ముక్క కంటె అన్యాయంగా విరిచి వేయబడింది. ఈ భట్టు వానికి కండ్లు నెత్తి మీదికి వచ్చాయి. వీణ్ని నేనే ఉద్యోగంలో వేయించాను. ఛీ! రాజుల్ని నమ్మకూడదు. అనేక సంవత్సరాలు తమ్మాడించన వారిని కూడ పాములు కరవడం కద్దు. రాజులు కూడ అలాంటివారే !అని  లోలోపల ఆ మహామంత్రి  విలపించాడు.
మహాప్రభో! శివంకర సంఘం వాస్తవంగా సక్రమాందోళన సంఘమే కాని విప్లవ సంఘం కాదేమో! దాని స్వరూపాన్ని తెలుసుకోడానికి భట్టారకుల వారు ఏల ప్రయత్నించ రాదు ! తమ నిజస్థితిని వెల్లడించుకోడానికి వారికొక అవకాశం ఏల ఇవ్వకూడదు ? మన ఆంధ్ర దేశంలో వేడి రక్తం గల వేలకొలది యువకులు శివంకర సంఘంలో సభ్యులుగా ఉన్నారని వినికిడి. అపరాధాన్ని న్యాయస్థానంలో నిర్థారించక ముందే ఒక రాజకుల ప్రకటనని ఆధారం చేసుకొని వారి నందరినీ  నిష్కారణముగా వధించ వలసినదేనా? గజవీరుడు వ్రాసినట్లు  వారు దేశానికి, మన కుండినుల ప్రభుత్వానికి భక్తులనే నా తలంపు. శ్రీరామచంద్రుడు ప్రజలు తన కృత్యాన్ని విమర్శించినంత మాత్రాన వారిని విప్లవ కారులుగా ప్రకటించెనా? ప్రత్యుత వారి విమర్శని పాటించి తన ప్రియకాంతను అడవుల పాలు చేసాడు. ప్రభుత్వ విమర్శనం కాని, రాజచర్యా విమర్శనం కాని  రాజద్రోహం కాదని  నా మతం. రాజుని వధించడానికో, లేక పదభ్రష్టుని చేయడానికో యత్నించడమే రాజద్రోహమవుతుంది.
సచివుని ఉపన్యాసాన్ని విని మహారాజు మహామంత్రిని చూచి ఇలా  అన్నాడు, “సచివుని వాదం నాకు నచ్చింది. ఏకాదశీ స్థిరవారం నాడు, సాయంకాల కృత్యాలు తీర్చుకొన్న తరువాత, శివంకర సంఘ ప్రతినిధి మాతో, ఈ విమానం షష్ట భూమికలో సాధారణంగా  విదేశ దూతలతో మాట్లాడు గదిలో కలిసి మాట్లాడవచ్చునని, రేపు కాణ్వ శుకనాసునికి తెలియ పరచండి.
ఆఙ్ఞా ప్రకారం లాగే చేస్తాను.అని సన్నగిల్లిన స్వరంతో మహామంత్రి చెప్పాడు.
ఆ సన్నని స్వరం  సునందుని మనః కష్టాన్ని ఉచ్చస్వరంతో  చాటినట్లయింది. ఆ గదిలో  ఇరవై రెండు సంవత్సరాలు విజృంభించిన రాజకుల  కేసరి  ఈ రాత్రి  ఘోర పరాజయాన్ని  పొంది, పిల్లివలె  ఆసనంలో  క్రుంగి పోయింది.
అనేక  వర్షాలనుండి, సమయానికి వేచి ఉండిన  సచివుడు, ఈ రాత్రి గొయ్యి తీసి పాతి పెట్టేయాలని నిర్ణయించుకొన్నాడు. ఇప్పటికి అందులో సగం  పని పూర్తి  అయింది.
7 వ ప్రకరణం.
మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది.
ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.అని మహారాజు పలికాడు.
ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.అని చెప్పాడు మహామంత్రి.
రెండు కారణాలచే ఈ సమస్య ఈ రాజకులంలో చర్చింప బడాల్సి ఉంది. రాజకులం ఉత్తరువు పొందకుండా రాజకుమారులపై గాని, రాజకుమారికలపై గాని, సామంత రాజులపై గాని, రాజ స్నుషలపై గాని, సామంత రాజ పత్నులపై గాని, దండార్హమైన నేరాన్ని, ఆరోపింఛే అభియోగాన్ని తీసుకొని రావడానికి వీలు లేదని నిబంధన ఉంది. చంద్రప్రభా దేవి సామంత రాజ పత్ని, రాజకులం ఉత్తరువు లేనిదే, మోసానికి ఆమెపై అభియోగం తెచ్చుట సాధ్యం కాదు. ఇది మొదటి కారణం.రెండవ కారణం ఏమిటంటే, అభిషిక్తుడయిన సామంత రాజు సరి అయిన వారసుడు కాడని ఎవరైనా రాజధర్మాసన సన్నిధిలో వ్యాజ్యం తెచ్చుటకు ముందుగా రాజకులం ఉత్తరువు పొంది ఉండాలి.
సచివుని మాటలు విన్న మహారాజు తనలో ఇట్లను కొన్నాడు.! ఇన్నాళ్లు మహామంత్రిగా పని చేసినా చిన్న మామయ్యకి రాజకులంతో సంబంధించిన నిబంధనలు కూడ చక్కగా తెలియవు. ఏదో మోరతోపు కొట్టుకొని పోతున్నాడు.
సచివుడు చెప్పినది వాస్తవమే,” అని ప్రకాశంగా అన్నాడు మహారాజు.
అది వాస్తవమే అయితే — ”
మీరు నిబంధన చూడలేదా ? ఐతే అని అంటున్నారు ?”
ముసలి వాణ్ని మరచి పోయాను.
అయితే మీ వాక్య శేషాన్ని ముగించ వచ్చును.
ఈ సమస్యని విచారించడానికి మహాప్రాడ్వివాక తృతీయమైన రాజకులానికే అధికారముండును. న్యాయ సూత్రాలతో సంబంధించి ఉంది కదా ఈ సమస్య ?”
ఇట్టి సమస్యలను చర్చించునపుడు న్యాయ సూత్రాలతో పని లేదు. ఔచిత్యం మాత్రమే చర్చించ బడుతుంది. అందువలన ఈ సమస్య అంతరంగిక శాఖకే సబంధించింది.అని చెప్పాడు సమయోచితంగా సచివుడు.
నిజమే ! ఇక చర్చని సాగించవచ్చునుఅన్నాడు మహారాజు.
రూప చంద్రుడే మాట్లాడాడు.
వృధ్ధురాలును, పూజ్యురాలును అయిన చంద్రప్రభా దేవిని న్యాయస్థానంలో నిలబెట్టి, విచారించడం అనుచితం. అలా అని విచారించడానికి ఉత్తరువు ఇవ్వనప్పుడు శాంతిసేనా దేవికి అపారమైన నష్టం కలుగు తుంది.. ఆదిలో రాజకులాన అపవిధ్ధ పుత్రుడు, ఔరస పుత్రి కంటే కూడ ముఖ్య వారసుడు అని నిర్ణయింప బడింది. ఆ విషయం తిరుగ విచారించ వలసిన అవసరం ఉండదు. కాని వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుల వారి అపవిధ్ధ పుత్రుడు కానప్పుడు, ఆ రాజకుల తీర్మానం శాంతిసేనా దేవిని బంధింపదు కదా ! అతడు అపవిధ్ధ పుత్రుడు కాడని రుజువు పరుస్తానని భర్తృదారిక వ్రాసి ఉన్నారు.దానికి రాజకులం అవకాశం ఇవ్వనప్పుడు న్యాయ ప్రకారంగా ఆమెకి రావలసిన ఒక గొప్ప మండలం ఆమెకి రానీయకుండా చేయడ మౌతుంది. అంతకంటే ఆమెకి నష్టం ఏముంటుంది ? ఒకరి గౌరవాన్ని రక్షించడానికై మరొకరికి అపారమైన నష్టం కలిగించడమా, లేక ఒకరి న్యాయమైన హక్కుని కాపాడడానికి ఇంకొకరి గౌరవానికి హాని కలుగ జేయడమా అన్న విషయన్నే రాజకులం ఇప్పుడు తీర్మానించ వలసి ఉంది. ఈ రెండింటిలో ఏది మేలు ? ఇదే మనకిప్పుడు చర్చనీయాంశం !
మహారాజు మహామంత్రిని చూసి , “చిన్న మామయ్యా ! మీ అభిప్రాయం ఏమి ?” అని అడిగాడు.
శాంతిసేనా దేవి విన్నపం త్రోసి వేయడం ఏ విధంగా తప్పో నా కింకా బోధపడడం లేదు.
ఆమె విన్నపాన్ని త్రోసివేస్తే ఆమెకి నష్టం ఉందదనా మీ తాత్పర్యం ?”
వీరేశ్వర భట్టారకుడు అపవిధ్ధుడు కాకపోయిన, కృత్రిమ పుత్రుడు కావచ్చును. ద్వాదశవిధ పుత్రులలో ఎవడైనా సరే కుమార్తె కంటె ముఖ్యుడని రాజకులం ముందే నిర్ణయించింది. అలా వుండ శాంతిసేనా దేవికి న్యాయమైన నష్టం కలుగుతుందని మన మెట్లు నిర్ధారణ చేయగలం ?”
మేఘస్వామి భట్టారకుల వారు పిల్లవాడు అపవిధ్ధుడనే ఎంచి, తన భార్యకి పెంచుకోవడానికి అనుఙ్ఞ యిచ్చారు. చెల్లెలి కుమారుని భార్య గుప్తంగా తీసుకొని వచ్చిందని తెలిసినట్లయితే అనుఙ్ఞ నిస్తారా ? అందు వల్ల ఆ పిల్లవాని కృతిమత్వ విషయంలో తండ్రికేమిన్నీ సంబంధం లేదు. ఆ పిల్లవాడు చంద్రప్రభా దేవికి మాత్రమే కృత్రిమ పుత్రుడు కావచ్చు. అంతేకాని మేఘస్వామి భట్టారకుల వారికి కృత్రిమ పుత్రుడు ఎట్లగును ?” అన్నాడు సచివుడు.
కాబట్టే ఇది క్లిష్టమైన న్యాయ సమస్య ! దీన్ని మనం కొన్ని క్షణాలలో నిర్ణయించడం సాధ్యం కాదు. ఆలోచించడానికి వ్యవధి అవసరం,” అన్నాడు మహామంత్రి.
క్లిష్టమైన ఈ న్యాయ సమస్యని ఆలోచించడానికి రాజధర్మాసనం ఉండనే ఉంది. అది దాని పని. పాక్షికంగా నైనా శాంతిసేనా దేవి సింహాసనం పొందే అవకాశం వున్నప్పుడు, ఆ అవకాశాన్ని ఆమెకి మనం ఎందులకు ఇయ్య కూడదు! చంద్రప్రభా దేవి గౌరవ భంగం ఒక్కటే దీనికి అడ్డుగా ఉంది. అందువల్ల ఏ తప్పు మేలా అని మనం ఇప్పుడు నిర్ధారణ చేయాలి.
చిన్న మామయ్యా ! క్లిష్ట సమస్యలను విచారించ వలసిన ఆవశ్యకత లేదు కాబట్టి, మీరు వ్యవధి తీసుకొనక్కర లేదుని నా మతం ! శాంతిసేనా దేవి విన్నపం త్రోసివేయాలా, లేక అంగీకరించాలా ? ఆ విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి.
సునందునికి ఆ రాత్రి పాపరాత్రిగా కనిపించింది.. మహారాజు మనస్సు తనకి అనుకూలంగ లేదు. అయిన అతడు తన ప్రయత్నాన్ని వదలకుండా ఇలా అన్నాడు-
మహాప్రభో ! శాంతిసేనా దేవికి, వీరేశ్వర భట్టారకుల వారికి ఇద్దరికీ నష్టం లేని మార్గాన్ని అన్వేషించడానికే నేను వ్యవధి కోరాను. సచివుడన్నట్లు వృధ్ధురాలును, పూజ్యురాలును అగు చంద్రప్రభా దేవిని న్యాయస్థలానికి ఈడ్చుకొని రావడం గాని, సుమారు ఇరవై రెండేండ్లు శ్రీవారి స్వహస్తాలతో ఇచ్చిన రాజ్యన్ని అనుభవిస్తున్న వీరేశ్వర భట్టారకుల వారిని పదభ్రష్టుని చేయుట గాని నాకు సమ్మతాలు కావు.
మహామంత్రి మాటలకు మిక్కిలి దాక్షిణ్య వంతుడైన మహారాజు లొంగిపోతాడేమోనని సచివుడు భయపడ్డాడు. వానికి ఒక విచిత్ర తత్కాల యుక్తి స్ఫురించింది. దానిని వాడు త్వరగా రాజ సన్నిధానంలో బహిరంగ పరిచాడు !
మహాప్రభో ! చంద్రప్రభా దేవికి గౌరవ హాని లేకుండా విచారణ చేయుటకు ఒక ఉపాయం ఉంది.
మహారాజు మిక్కిలి ఆతురతతో,”అది ఏది ?” అని ప్రశ్నించాడు.
చంద్రప్రభా దేవి చెల్లెలు చంద్రముఖిన్నీ, ఆమె భర్త ధనపతిన్నీ ఇప్పటికీ జీవించి ఉన్నారు. వారు దేవిని తప్పు త్రోవ పట్టునట్లు ప్రోత్సహించి తమ పిల్లవానిని పార వేసి, ఆమెని పెంచునట్లు చేశారని వారిపై ఆరోపించిన దేవికి గౌరవ హాని కలుగదు.
ఈ సంవిధానం బాగుంది,” అని మహారాజు మహామంత్రిని చూసి,”చిన్న మామయ్యా ! మీరేమంటారు ?” అని ప్రశ్నించాడు.
సునందునికి, చంద్రప్రభా దేవికి, గౌరవ హాని అగునని చింత ఏ మాత్రము లేదు. అతని ఘోష అంతా అల్లునికి రాజ్యభ్రంశం కాకూడదనియే ! తన మాటకు మహారాజు బదులు చెప్పక ముందే సచివుడు మధ్యలో కలుగ జేసుకొని మాట్లాడి ప్రభువును ఆ గాలిలో ఎగురగొట్టుట మహమంత్రికి కోపాన్ని కలుగ జేసింది. అయినను ఆ వృధ్ధ మంత్రి తన కొస ప్రయత్నాన్ని విడువ లేదు.
మహప్రభో ! నేను సంధిని గురించే ఆలోచిస్తున్నాను.
ఇప్పుడు శాంతి సేనా దేవి విన్నపం అంగీకరించినంత మాత్రాన, సంధికి అవకాశం పోదు. అంగీకరించ వచ్చునా, లేదా ? అన్నదే మీరు ఇప్పుడు చెప్పాలి.
అంగీకరించే పక్షంలో విచారణ తప్పకుండా జరుగుతుంది. విచారణలో శాంతిసేనా దేవికి జయం కలిగితే వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుని పుత్రుడు కాడని స్థిరపడుతుంది. తనకొక కర్మనడిపించు పుత్రుడు ఉన్నాడని తృప్తితో వారు దివంగతులయ్యారు. ధర్మాసనపు తీర్పు అందులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి పుంసంతతిని మనం తుడిచి వేసినట్లే అవుతుంది. కాబట్టి వ్యవధి కావాలంటున్నాను.
సుచంద్రునికి ఇంత సేపటికి తన మహామంత్రి తత్వం బోధపడింది. అతడు తన కూతురు ద్వారా, ఏదో ఎత్తు పన్ని తన్నంగికరింప జేయడానికి వ్యవధి కోరుతున్నాడని తలంచాడు. అందువలన మహామంత్రికి వ్యవధి ఇవ్వకుండా ఉండడానికే మహారాజు తీర్మానించు కొన్నాడు. ఆ నిశ్చయంతో ఇలా అన్నాడు.
ఇప్పటి పని ఇప్పుడే ముగిసి పోవాలి. సంధికి మంచి మార్గం మీకు తోచినప్పుడు నాకు చెప్పండి. నేను దానికి అనుకూలంగా ప్రయత్నిస్తాను.
తండ్రి పుత్రుడని విశ్వసించిన ఒక పిల్లవానిని అతని పరోక్షంలో, అతని పుత్రుడు కాదని నిర్ణయించ డానికి ఏ న్యాయస్థానానికీ హక్కు లేదని నా మతం. కాబట్టి శాంతిసేనా దేవి విన్నపాన్ని త్రోసి వేయ వలసిందే !
మహారాజు సచివుని ముఖం చూసాడు.
మేఘస్వామి భట్టారకులు వీరేశ్వర భట్టారకుని పెంపకాన్ని, పుత్రార్థం అంగీకరించారో, ధర్మార్థం అంగీక రించారో మనకి తెలియదు. వారు వీరేశ్వర భట్టారకుని తన పుత్రునిగా ఎప్పుడూ ప్రకటించ లేదు. ఉపనయనాన్ని ఆచార్యుల చేత చేయించారు గాని, స్వయంగా చేయించ లేదు. కాబట్టి వారు తన జీవిత కాలంలో అతనిని (వీరేశ్వర భట్టారకుని ) తన పుత్రునిగా విశ్వసించడం సంశయ గ్రస్తం ! కనుక శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరించాలని నా మతం.
తండ్రి భ్రాంతితో విశ్వసించినా, దాన్ని న్యాయస్థానం మన్నించి తీరాలని నిర్భంధం కలదా, అన్న విషయమే సంశయగ్రస్తంగా ఉంది. కాబట్టి నేను సచివునితో ఏకీభవించి, శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరిస్తున్నాను. ఆమె విన్నపం రాజకులంలో అంగీకరింప బడినట్లున్నూ, ఆమె మోసమునకై చంద్రప్రభా దేవిపై కాకుండా, చంద్రముఖి దంపతులపై అభియోగం తెచ్చుకోవచ్చునని కౌండిన్య ధర్మపాలునికి రేపు ప్రాతఃకాలానికి సందేశాన్ని పంపండి.
మహారాజు సుచంద్రుని నిర్ణయాన్ని విన్న పిమ్మట సునందుని వెన్నెముక విరిగినట్లయింది. అనాధ పద్మావతీ ! ఇంక నిన్ను ఎవరు రక్షిస్తారు ? వెర్రికుక్క విషం వలె చిత్రకూట రాష్ట్ర సింహాసనోత్తరాధికారి సమస్య తిరిగి బయలు దేరింది. ఇప్పుడేం చేయాలి.? ’ అని అతని మనసు శోకించింది. బహిరంగంగా
ఆఙ్ఞాప్రకారం అలాగే చేస్తాను.అన్నాడు దీనంగా.
ఇన్నాళ్లకి ఇతని దశ తిరిగింది. అని సచివుడు లోలోపల సంతోషించాడు.
చిన్న మామయ్యా ! రేపు మహారాఙ్ఞి వర్ధంత్యుత్సవం. కనుక ఉత్సవం ముగింఛే వరకు ఈ రాత్రి రాజకుల చర్యలను ఆమె చెవిలో వెయవలదు.
చిత్తంఅన్నాడు మహామంత్రి.
సచివుని ఉద్దేశం నెరవేరింది. మహామంత్రి పలుకుబడి ఈ విధంగా ఆ రాత్రి భూస్థాపితం కావింప బడింది. దానికి పునర్జీవితం వచ్చే ఆశ కూడా అంతగా కన్పట్టుట లేదేమో !

===========

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...