Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ : సత్యప్రభ -15 :బాపు వేసిన బొమ్మలతో సహా


32 వ ప్రకరణం:

“దొడ్డమ్మా! క్షేమమా! పెద్దావు కోడెదూడ సుఖంగా ఉందా?”

“కన్నతల్లీ! కోడెదూడ సొండై కూర్చొంది, పొడుపు కూడ నేర్చుకొంది. చెబితే వినడే తల్లీ! నీవైనా పిలిపించి నాలుగు చీవాట్లు పెట్టమ్మా !”

“వత్స కుడుపు మానేసిందని బొత్తిగా మరచి పోవడమేనా?”

“అయ్యో, కన్న తల్లీ! నిన్ను మరువగలనా? నీ జ్ఞాపకం నా రక్తంలో మిళితమై పోయిందమ్మా. పెద్ద గడపలు తొక్కడమంటే నాకు వల్లమాలిన జంకు.”

కర్ణి భీమనాథుని తల్లి. ఆమె సంపూర్ణ నామధేయం నాగ కర్ణి. అందరూ ఆమెను ‘కర్ణి’ అనే పిలుస్తారు ఒక రాత్రి మాత్రం ఒక మహాపురుషునికి కళత్రమై, తదనంతరం నిత్య బ్రహ్మచారిణిగా దీక్ష వహించిన ఉత్తమ జాతి స్త్రీ రత్నం ఆమె! ఆమె ఇప్పుడు సేనాపతి ఇంటికి రథినీ కుమారిని చూడడానికి వచ్చింది.

కర్ణి మంచి ఒడ్డూ పొడుగూ కలిగిన భారీ మనిషి. కొలిమిలో పుటం పెట్టి మెరుగుపరచిన రాగిలాగ ఆమె శరీర ప్రభ, ఔషసీ శోభను మించి పవిత్ర భీషణంగా కనబడుతుంది. ఆమె అంగాల లోని పటుత్వం నిరుపమానం. ఆమె వినీల కచభరం స్త్రీజన ఈర్ష్యా జనకం! బ్రహ్మచర్యం చేత కలిగిన ఆమె కండ్ల లోని తేజస్సు పరమాద్భుతం! నలభయ్యవ పడిని దాటినా, ఆమె శరీరలత లావణ్య తరంగ వారిచే పరిపూర్ణమై ప్రౌఢ యువతులను మించి కనపడుతూంది.   

ఆమె భీకరంగా కనబడినా ఆమె హృదయం నవనీతం లాగ మృదువైనది ! ఆమె నిర్భయురాలైన సత్యవాదిని  కన్యాత్వం దూషింపబడి గర్భవతి అయిన ఆమె, లోకుల కన్ను గప్పి తన గర్భాన్ని దాచుకోడానికి ప్రయత్నించ లేదు! సంఘం బహిష్కరించినా, ఆమె లక్ష్యం చేయలేదు. తనను తాను  కాపాడుకోవడానికి తన ప్రియుని నామము ఆమె ఈనాటికీ వ్యక్త పరచ లేదు!

కర్ణి ప్రేమ అమరవాహిని లాగ పవిత్రమైనది. అంభస్సు లాగ విశాలమైనది. ఆమె ప్రేమ విషయ వాంచా రహితమైనది. ఆమె ప్రేమకై ప్రేమించింది; దాని ఫలితం పూర్ణంగా పొందినట్లు తృప్తి పడింది.ఆమె తన ప్రేమ మూర్తిని హృదయంలో స్థిరంగా స్థాపించుకొని తదారాధన కావించే పరమ భక్తురాలు! ఆమె ఆ భక్తిలో విశ్వాన్ని మరచిపోయి శాశ్వతానందం అనుభవిస్తోంది!

భగవాన్ జటాముని ఆమెను ఒక రాత్రి మాత్రం ఏలుకొన్న సంగతి విని ఆమె కులస్తులు (నాగులు)తాము ఇదివరలో ప్రయోగించిన బహిస్కారాస్త్రాన్ని ఉపసంహరించు కొన్నారు. తనకు ఏ కులం తోనూ ప్రమేయం లేదని, ఆ ధీరవనిత ఎవరి తోనూ అంటకుండా, ప్రత్యేకంగా లోకోత్తర పరాక్రముడైన తన కుమారునితో కాలం గడుపుతూంది.

పట్టమహిషి  చారుమతీ దేవి స్వర్గస్థురాలైన పిమ్మట రథినీ శక్తిధరులకు దాదిగా సేనాపతి గారి ఇంట ప్రవేశించింది కర్ణి . ఆమె స్తన్యామృత దారలు గ్రోలి రథినీ శక్తిధరులు దిన దిన ప్రవర్ధమానులై పెరిగారు.

మహారాజ సుచంద్రుడు కర్ణి సేవకు తృప్తి చెంది ఆమెకు శ్రీకాకుళ నగరంలో మంచి వసతి గల ఇల్లు ఇప్పించడమే కాక, శాశ్వతంగా ప్రతీ నేలా నూరు కార్షాపణాలు భ్రుతి కల్పించాడు. భీమనాథ  శక్తిధరుల కంటె ఆమెకు రథిని మీద మిక్కిలి మక్కువ! దానికి కారణం ఉంది. భీమనాథ  శక్తిధరులు తమ మూడేండ్ల వయసు వరకు  ఆమె స్తన్యం గ్రోలారు, రథిని ఆరేండ్ల వరకు ఆమె స్తన్యాన్ని వదలక త్రాగిన గడుసు పిల్ల!

“అన్నయ్య కులపరిషత్తుకు విన్నపం పంపుకొన్నాడా దొడ్డమ్మా?”

“దేనికి తల్లీ, విన్నపం ! సైన్యంలో చేరి రాజసేవ చేయరా, ‘అంటే ఈ తుక్కు సేనలో’ ఉద్యోగమొకటా? అంటాడు.”

“అది కాదు దొడ్డమ్మా! బ్రాహ్మణ జాతిలో చేర్చుకోవలసిందని పరిషత్తుకు విన్నపం పంపుకోవడానికి అన్నయ్యకు అధికారం ఉంది! ఎంతైనా వానిది బ్రహ్మ వీర్యం కదా?”

“అదా నా కన్నా! ఆవిషయం గూర్చి నేను మౌనం వహించాను. వాని  స్నేహితులు వాణ్ని వేధించారు. వాడంటాడు – ‘జాతేమిటి జాతి? నీతి ఉంటే చాలదూ? దేవతలలో జాతులున్నాయా? మనం కూడ వాళ్ళలాగే ఎందుకు ఉండరాదు? ‘అని అడ దిడ్డం అంటే పెద దిడ్డం అని వాదిస్తాడు.”

“ఒకమాటు నాకు కనిపించమను, నేను వానికి నచ్చ చెబుతాను!” 

“ఎందుకు తల్లీ! వాని  నాన్నగారు ఇవాళ వస్తారు, ఆయన చెబితే తప్పక వింటాడు.”

“అయితే దొడ్డమ్మా! పెదనాన్నగారిని నాకు ఒకమారు చూపించవూ ? ఆయన ఈ రోజు వస్తారని నీకు ఎలా తెలిసింది?”

కర్ణి నాలుగు మూలలా చూసింది.

“దొడ్డమ్మా! నీవేమీ చూడనవసరం లేదు! నా గదిలోకి ఎవరూ రారు.”

అయినప్పటికీ కర్ణి దగ్గరగా వచ్చింది. రథిని చనువుగా కర్ణి ఒడిలో కూర్చొని గట్టిగా కౌగలించుకొంది. కర్ణి రాజకుమారి కురులు సరిదిద్దుతూ ఇలా అంది. “ నా ముద్దుల కూనా, రహస్యం సుమా! గత రాత్రి కలలో ఆయన నాకు కనిపించారు. ఆయన అన్నారు –‘ నాగూ! నేను శ్రీశైలం నుంచి రేపు రాత్రి రెండు ఝాములు దాటినా తరువాత నీ దగ్గరకు వస్తున్నాను, చిరంజీవిని చూచి మాట్లాడాలి అని’.

“అయ్యో దొడ్డమ్మా! నీ వెర్రి గాని, శ్రీశైలం నుంచి ఒక రోజులో ఎవరైనా ప్రయాణం చేయగలరా?” అని రథిని ఆమె గుండెల్లో తన తలను దాచుకొంది.

కర్ణి శరీరం పులకించింది. ఆమెలో మాతృత్వం పెల్లుబుకింది. రథిని బుగ్గలపై గోముగా చిటికె వేస్తూ ఇలా అంది.  “ఇంకా పెద్దావు పాలు ఇస్తుందనా, నీ భ్రాంతి?”

“ అదికాదు దొడ్డమ్మా! మా అమ్మ ముఖాన్ని నేను ఎరుగను. నిన్ను చూస్తె నాకు ఎక్కడ లేని చిన్నతనం పుట్టుకు వస్తుంది. నన్ను నేనే మరచి పోతూ ఉంటాను! అదీకాక, నీ శరీరం లోంచి కమ్మని వాసన వస్తుం టుంది. ఏ పుష్ప గంధం కూడ అంత పరిమళ భరితంగా ఉండదు.”

“వెర్రి తల్లీ! ఆయన వరం అది. ‘నాగూ, నీవు మాంసాహారం మానావంటే నీ శరీరం లోంచి కమ్మని వాసన అస్తూ ఉంటుంది, ఏ పుష్ప గంధం కూడ అంత మధురంగా ఉండదు’ అని. ఆయన చెప్పారు. ఆ నాటినుంచి మాంసాహారం మానివేశాను. నాకే ఆశ్చర్యం వేసింది, నా శరీరం పరిమళ భరితమై పోయింది! మా వాడికి అసలు మాంసాహారం అంటేనే జుగుప్స!”

“భగవాన్ జటాముని రావడం నిజమేనా?”

“నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా? ఆయనకు ఆకాశ గమన శక్తి ఉంది. నా కల ఎన్నాడూ కల్ల కాదు.”

“అయితే నేను నీ ఇంటికి వస్తాను, నాకు అతణ్ణి చూడాలని ఉంది.”

“తాతగారు ఒప్పుకొంటారా?”                        

 “ఒప్పుకొంటారు, నేను తాతగారితో చెప్పందీ రానులే!”                         

“సరే!అలాగేరా.”                                                                                                                                            

“దొడ్డమ్మా! వచ్చేటప్పుడు పళ్ళు, పాలకోవా పట్టుకు వస్తాను.”

“సరే తల్లీ! నేను వెళ్లి వస్తాను’అని లేచింది కర్ణి.

“దొడ్డమ్మా! ఉండు నీకు నగలు, చీరలు అన్నీ పట్టుకొని వచ్చి ఇస్తాను.”

“నాకు నగలెందుకమ్మా? రెండు పేటల గొలుసు ఉంది. నాలుగు జతల బంగారు గాజులు ఉన్నాయి. పుష్యరాగం దుద్దులు ఆయనే ఇచ్చారు. ఒ! అవి చాలు. నీ తృప్తికి ఎర్రంచుల సన్న రకం తెల్లచీర ఇస్తే పుచ్చుకొంటాను.”

“దొడ్డమ్మా! పెదనాన్నతో ఎన్నాళ్ళు కాపురం చేసావు?”

“ఒకే రాత్రి! తొమ్మిది గంటలనుండి ప్రాతఃకాలం వరకు! ఆ తరువాత ఆయన పావుకోళ్ళతోనే!” అని నవ్వుతూ చెప్పింది కర్ణి.

రథినీ కుమారి కర్ణి కోరినట్లుగానే సన్నరకం ఎర్రంచుల నేత చీర తెచ్చి ఇచ్చింది. ఆ చీర పుచ్చుకొని, రథినీ కుమారిని చిన్న పిల్లలాగ పైకెత్తి రెండు కపోలాలపై ముద్దు పెట్టుకొని క్రిందకి దించింది కర్ణి.

*******************************

అప్పుడే రాత్రి మొదటి ఝాము గడచి పోయింది.ఆసాశంలో నెలవంక కొలువు తీర్చింది. వీధిలో జనసంచారం పలచన పడింది.

అది కర్ణి ఇల్లు, గృహం చిన్నదైనా  చుట్టూ ప్రహరీ గోడలతో చూడ సొంపుగా ఉంది. ఇంటి ముందర సన్నజాజి పందిరి కన్నుల పండువు చేస్తోంది. ఇల్లంతా ఆముదపు దీపాలతో శోభాయమానంగా ఉంది.

ముందర ఉన్న పెద్దగదిలో ఆముదపు దీపం పెద్ద వత్తి  వేసి వెలిగించి ఉంది. ఉత్తరపు గోడ వద్ద వ్యాఘ్ర చర్మం వేసి ఉంద దానిపై కృష్ణాజినం పరిచి ఉంది! వ్యాఘ్రాసనానికి తూర్పుగా గోడ దగ్గర ఎత్తయిన వేదిక ఉంది. ఆ వేదికపై ఒక పావుకోళ్ళ జత ఉంది. దానిపై పుశాపాలు పేర్చి ఉన్నాయి. దాని ప్రక్కన మట్టి దూప కరండిక ఉంది. దానిలోనుంచి ధూపం సువాసనతో వెలికి వస్తోంది.

అది భగవాన్ జటాముని పాదరక్షల జత! అవే కర్నికి ఆరాధ్య దేవత!

భీమనాథుడు ముందుగా లోపలి వచ్చాడు. తిన్నగా  పెరటి లోకి వెళ్లి కాళ్లు చేతులు కడుగుకొని వచ్చాడు. నట్టింటిలో తల్లి వానికి కంచం పెట్టి, అన్నం వడ్డించింది. భీమనాథుడు తల్లిని చూసాడు.

కర్ణి అలంకారం ఆ రోజు నూతనంగా ఉంది. ఎర్రని అంచులు గల తెల్లచీర ధరించింది. ఆ చీరలో ఆమె స్వాహాదేవి వలె పవిత్రంగా కనిపించింది. బరువైన వినీల కచభరాన్ని బాగా దువ్వి, పల్లె పడుచులాగ కొప్పు ముడుచు కొంది.ఆ కొప్పు చుట్టూ సన్న జాజి పువ్వుల దండ చుట్టుకొంది. నొసట ఎర్రని కుంకుమ బొట్టుతో ఆమె సంధ్యా దేవి లాగ రమణీయంగా కనపడింది. సహస్ర తామరసం వలె ఉన్న ఆమె ముఖ మండలంలో నల్ల కలువల వలె ఆమె నేత్రాలు వింత శోభని ఇస్తున్నాయి. ఆమె చీరకు తగ్గట్టు నీలి రవికె తొడుగుకొని ఉంది.ఆమె ఉన్నత వక్ష స్థలంపై రెండు పేటల బంగారు గొలుసు కదలాడుతోంది.

తన తల్లి ముస్తాబు గమనించి భీమనాథుడు మందహాసం చేసాడు. కుమారుని చూసి తల్లి కూడా నవ్వింది.

భీమనాథుడు ఆరడుగుల మనిషి! ఎత్తుకు తగ్గ అవయవ పుష్టి వాణి సహ్రెర బలాన్ని ప్రదర్శిస్తోంది. వాడు కూడా తల్లి వలె తామ్రవర్ణుడు. వాణి వ్రుషభాక్షాలలో వింత తేజస్సు జ్వలిస్తోంది. నిరంతర వ్యాయామ విభక్తము లైన వాణి అంగల శోభ నిరుపమానంగా ఉంది! “అమ్మా! నన్ను ఇంట్లోనే ఉండమన్నావు నీ వేషం ఈ రోజు క్రొత్తగా ఉంది, ఏమిటి విశేషం?” అని అడిగాడు భీమనాథుడు.

“పోల్చుకోలేవూ? ఆచార్య భవనంది గురుకులంలో గొప్పగా చదివిన వాడివేమో! నా ముస్తాబు చూసి అయినా పోల్చగలగాలి!” అన్నది కర్ణి.     

భీమనాథుడు ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచన పూర్తికాక ముందే భోజనం ముగించాడు. కళ్ళు చేతులు కడుగుకొని ముందు గదికి వచ్చాడు. కర్ణి కూడ వాని  వెనకాలే వచ్చింది. తల్లి వానికి జటాముని రాక గురించి చెప్పలేదు!”

భీమనాథుడు తల్లిని పరీక్షగా చూసి ఇలా అన్నాడు. “ అమ్మా! నాన్నగారు గాని వస్తారా?” అని.

“అవును”                             “ఎవరు చెప్పారు నీకు?”

“కలలో మీ నాన్నగారే చెప్పారు.”

భీమనాథుడు బిగ్గరగానవ్వాడు.

ఇంతలో వీధిగుమ్మం  దగ్గర చప్పుడయింది. తల్లి, కొడుకులు వీధివైపు చూసారు. మహోజ్వల రూపిణి రథినీ కుమారి మూర్తీభవించిన నవరత్న పాంచాలిక లాగ గదిలో ప్రవేశించింది! భీమనాథుడు ఆశ్చర్యంతో రథినీ కుమారిని చూస్తూ ఉండిపోయాడు!

“అన్నయ్యా! క్షేమమా? చెల్లెలిని చాల రోజులుగా చూడడమే మానేశావు!” అని భీమనాథుని పలకరించింది రథినీ కుమారి.

“చెల్లెమ్మా! నన్ను క్షమించు ఏదో పనుల గొడవలో పడిపోయాను. చూసావా అమ్మ ముస్తాబు?”

“ పెదనాన్న గారు వస్తారుగా! దొడ్డమ్మ ముస్తాబు కాకుండా ఎలా ఉంటుంది?” దొడ్డమ్మ అచ్చు ముచ్చు క్షీర సాగర వీచికల మధ్య మహాలక్ష్మి  లాగ ఉంది!”

“ చూడు చెల్లెమ్మా! నాన్నగారు కలలో కనబడి ఇక్కడకి ఈ రోజు వస్తానని అన్నారట! వెర్రి తల్లి కళను నమ్ముకొని రాణి వాసంలోని నిన్ను కూడ లాగుకొని వచ్చింది!”

“అన్నయ్యా! నేను రాణి వాసంలో ఉండడం లేదు! రాణి వాసమంటే నాకు ఒళ్లు మంట! మా నాన్న అప్పుడే రెండు మూడు సార్లు నన్ను పంపించమని తాతగారికి కబురు పెట్టారు. ఏం చేయను? నేను ఇక మీద రాణి వాసానికి వెళ్లక తప్పదు!”

ఇంతలో సారథి పళ్ళ గంప తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు.

" చండీ! బండిని ఈ వీధి మలుపులో ఉంచు. నేను రావడం ఆలస్యమైనా నన్ను భీమనాథ బాబు వచ్చి దిగబెడతాడు!వెళ్లు” అని రథ సారథి చండీ దాసుతో చెప్పింది రథిని.

వాడు నిష్క్రమించాడు. కర్ణి వీధి తలుపు గడియ పెట్టింది.

అందరూ కూర్చొన్నారు. కర్ణి రథినీ కుమారికి మెత్తని చిత్రాసనాన్ని వేసింది. రాత్రి మూడవ ఝాము ప్రారంభాన్ని సూచిస్తూ కోటలోని నగారా మ్రోగింది.

రాజకీయ రంగంలో జరిగిన మార్పులని గురించి మాట్లాడడం ప్రాంభించారు రాతినే భీమనాథులు. కర్నికి ఇలాంటి భోగాట్టాలలో శ్రద్ధ లేదు. ఆమె పావుకోళ్ళ దగ్గర కూర్ర్చోని ధ్యాన ముద్రలో ఉండిపోయింది.

“శ్రీమాన్ మల్లికార్జున బాబు మహామంత్రిగా నియమింప బడ్డాడు. రెండు రోజులలో రాజకులం సమావేశమై ఇది వరలో అదనంగా వేయబడిన ‘పన్నులను’ తగ్గిస్తారని తెలిసింది. శాంతిసేనాదేవి వ్యాజ్యం కూడ ఇంక విచారణకు వస్తుంది” అని చెప్పింది రథినీ కుమారి.

రథినీ కుమారి ఈ ప్రస్తావన తేవడానికి కారణం లేకపోలేదు! భేమనాతుడు పరంతప సంఘంలో ఉన్నాడేమో అని ఆమె అనుమానం! అ అనుమానాన్ని  ధ్రువ పరచింది సత్య ప్రభ. కాబట్టి ప్రసంగాన్ని బట్టి భీమనాథుని ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఆమె తలంచింది.

“ఇన్నాళ్ళకు రాజుగారికి తెలివి పుట్టింది! ఇలా అన్నానని నువ్వు అపార్థం చేసుకోవద్దు!బాల్యం నుండి మనం ఏక స్తన్య దాయాదులం! కాబట్టి చనువుతో ప్రసంగిస్తున్నాను. అ సంబంధమే నేను నిన్ను ఏక వచనంతో సంబో ధించడానికి కారణం! చిన్న తనంలో నేను అనేక పర్యాయాలు నీ జడ పట్టుకొని లాగి అల్లరి చేసేవాడిని కూడ!”

“అన్నయ్యా! ఆ దయే నామీద నీవు ఎల్లప్పుడూ చూపించాలి! అందరి దృష్టిలో రథిని వేరు, నీ దృష్టిలోని రథిని వేరు! నీ సొంత చెల్లెలుతో మాట్లాడినట్లే నాతొ మాట్లాడవచ్చు. నీకు ఆ హక్కు ఉంది!”

“నా దృష్టిలో ఇప్పుడు ఆంద్ర రాష్ట్రంలో మహామంత్రి పదవికి మల్లికార్జునిని మించిన వ్యక్తి లేడు ! సేనాపతి నియమనమే నాకు నచ్చలేదు! యుద్ధమంటే నూరామడల దూరం పారిపోయే భారీ పెద్దమనిషిని సేనాపతిగా నియమించారు.”

“అది తాత్కాలికమే! నేను ఈ విషయం నాన్నగారితో ప్రసంగించాను. విషయం తెలుసుకొని తేలిక పడ్డాను.   కొన్ని మాసాలలో కాలనాథ బాబుని సేనాపతిగా నియమిస్తారట! అందుకే అతణ్ణి ఇప్పుడు సహస్ర పతిగా చేసారు.”

“సెభాష్! కాలనాథుడు సరయిన మనిషి. అతడు సేనను నడిపిస్తే సాక్షాత్తు భీష్ముడు ఎత్తి వచ్చినా ఆంద్ర రాష్ట్రానికి భయం లేదు.”

“అన్నయ్యా! నేను నిన్ను ఒకమాట అడుగుతాను. సావధానంగా బదులు చెప్తావా?”

“అడుగు, చెల్లెమ్మా! నాలో దొంగ గుణం ఉందని ఒప్పుకొంటాను. కాని నీ దగ్గర మాత్రం నిష్కపటంగా ప్రవర్తిస్తానని నమ్ము!”

“రాష్ట్రానికి సరయిన మంత్రి దొరికాడు, పన్నుల భారం తగ్గి పోతుంది. కాబట్టి నీకు ప్రభుత్వం పైన ఇది వరలో ఉన్న అసంతృప్తి ఇకమీద ఉండదు కదా! అలాంటప్పుడు నీవు రాజకీయ సేనలో ఎందుకు చేరకూడదు? నీవు ఇష్టపడితే సేనాపతి పదవి నీకే వచ్చే ఏర్పాటు చేయగలను.”

“చెల్లెమ్మా! నీకు నా మీద ఉన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. సేనాపతి పదవికి నా కంటే కాలనాథుడు తగిన వాడు. వ్యూహ రచనలో అతని కి ఉన్న జ్ఞానం నాకు లేదని ఒప్పుకొంటాను. నేను ఒక ప్రధాన కారణాన్ని బట్టి రాజకీయ సేనలో చేరలేకున్నాను! మరొక విషయం ఏమిటంటే నేను నా బాల్య మిత్రునికి మాట ఇచ్చేశాను. ఈ రెండు కారణాల వల్ల నేనొక విధంగా తటస్థ భావాన్నే అవలంబించి ఉన్నాను.”

“అన్నయ్యా! ఆ కారణమేమో నేను వినవచ్చునా?”

“సింహాసనోత్తరాదికారి సమస్య తీరేవరకు నేను రాజకీయ సేనలో చేరలేనమ్మా! కుమార భోగనాథుడే కాని అధికారిగా నిర్ణయింప బడితే, నా శాస్త్రం కుండినుల అధికారానికి వినియోగపడదు. కుమార శక్తిధరుడే గాని ఉత్తరాధికారి అయిన పక్షంలో నా  శక్తినంతా కుండినులకు ధార పోయగలను!”

“అన్నయా! ఆ అనుమానం నీవు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడ కుమార భోగనాథ బాబు సింహాసనోత్తరాదికారి కానేరడు! నీవు ఆ విషయంలో నా మాట విశ్వసించవచ్చును. రథిని నోటి నుండి ఎన్నడూ పొల్లు మాట రానేరదు. నీవు నన్ను నమ్ము! మరొక్క మాట నిన్ను అడుగుతున్నాను నీవు పరంతప సంఘంలో చేరి ఉన్నావని నేను అనుమానిస్తున్నాను! అదే సత్యమైతే అత్యధికంగా విచారించే వ్యక్తుల్లో నేనే మొదటిదాన్ని!”

భీమనాథుడు రథినీ కుమారికి ఏ విధమైన బదులు చెప్పలేక పోయాడు.

ఇంతలో కర్ణి వారి వైపు చూచి, “పిల్లలూ! ఆయన వచ్చే వేళ అయింది. మీరిద్దరూ ఆ గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసుకోండి. నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు బయటికి రండి!” అంది.

రథినీ భీమనాథులు మారు మాట్లాడకుండా ఆమె చూపిన గది లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టుకొన్నారు .

******************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ