37 వ ప్రకరణము:
ఇరవై అయిదు సంవత్సరాల పూర్వం పర్వతస్వామి భట్టారకుడు సార్వభౌమ బిరుదం పొంది రాజ్యమేలు తున్నాడు, అతని ఏకైక పుత్రుడు సుచంద్రుడు యువరాజుగా ఉన్నాడు.
ఒకరోజు మహారాజు తన కుమారుని పిలిచి ఇలా అన్నాడు.
“ నాయనా! కుంతల దేశాధిపతి అనంతసేనుడు మనపై దండెత్తి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి! నేను రేపే ఏభై వేల సైన్యంతో రాజధాని విడచి బయలుదేరు తున్నాను. నాకు సహాయంగా మహావీరుడైన నీ మామయ్య శివనాథుడు వస్తాడు. రాజధానిలో నీ మామగారు సర్వ సేనాపతి రణంధరుడు ఉంటాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళింగులు విజ్రుంభించ వచ్చును. అందువలన నీవు రేపటిదినమే రెండువేల ఆశ్వికదళంతో బయలుదేరి చిత్రకూటానికి వెళ్లు! చిత్రకూటంలో నీ పినతండ్రిని కలసుకొని, ఆలోచించి సరిహద్దు ప్రాంతాలు పరిరక్షించు కోవాలి! ఇది చాల ముఖ్యం! నా వద్దనుండి వార్త వచ్చేవరకు నీవు అక్కడే జాగరూకుడవై ఉండాలి.
యువరాజు సుచంద్రుడు తండ్రి ఆజ్ఞను పాటించి దండనాయక బలభద్రునితో సహా రెండువేల ఆశ్వికదళంతో మరునాడు గోధూళి సమయంలో బయలుదేరాడు. దండనాయక బలభద్రుడు సుచంద్రుని ఆంతరంగిక మిత్రుడు సహాధ్యాయి, సమ వయస్కుడు.
ఆ రోజు శుక్ల సంవత్సర ఆశ్వియుజ శుద్ధ దశమీ స్థిరవారం!
చిత్రకూటంలో యువరాజు తన పినతండ్రి మేఘస్వామి భట్టారకుల వారిని కలసుకొన్నాడు. దండనాయకుల సభ కూడింది. ఆ సభలో చిత్రకూట కళింగ దేశాల సరిహద్దు ప్రాంతాల రక్షణ గురించి చర్చ జరిగింది. సార్వభౌముని కుమారుడైన సుచంద్రుని రాకను గుప్తంగా ఉంచ వలసిందని సభలో తీర్మానమయింది. సుచంద్రుడు సుకీర్తి అనే నామంతో నందిదుర్గంలో మకాము వేయాలని తీర్మనమయింది. ఆ సభలో నంది దుర్గ సామంతుడు నందిసేన దొర కూడ ఉన్నాడు.
నంది దుర్గం ప్రక్రుతి నిర్మితం. దాన్ని మానవుడు సంస్కరించి సర్వ పటిష్టం కావించాడు. ఆ దుర్గ ప్రాకారాలు చిన్న రాతి గుట్టలు. ఆ గుట్టలను ఒకటిగా కలిపి శత్రువులకి అభేద్యమైన కోటగా చేసాడు మానవుడు. కోట చాల భూభాగాన్ని ఆక్రమించుకొని ఉంది. పూర్తిగా ఒక పెద్ద బస్తీ ఆ కోటలో ఉందనవచ్చు. దుర్గపాలకుని ప్రాసాదాలు దుర్గ మధ్యమందు నిర్మింపబడి ఉన్నాయి. ఆయుధ శాలలు, గజశాలలు, అశ్వశాలలు, ధాన్యాగా రాలు మొదలైన కట్టడాలు ప్రాసాదాల దగ్గరగా ఉన్నాయి. కోటలోనే అనేకవేల కుటుంబాలు నివసిస్తున్నాయి. తోటలు, తటాకాలు, పంట భూములు మొదలైన వాటితో ఆ దుర్గం అపూర్వ శోభతో ఒప్పుతూంది. దుర్గానికి వెలుపల జల పూరితమైన కందకాలు ఉన్నాయి. కందకాలు దాటి భయంకరమైన అరణ్యం ఉంది. ఆ అరణ్య ప్రదేశంలో అనేక గ్రామాలు ఉన్నాయి. అవన్నీ నందిసేన దొర ఏలుబడిలోనే ఉన్నాయి. మేఘస్వామి భట్టారకుల వారు నంది దుర్గ మండలాన్ని చాల సంస్కరించి పాడి పంటలు, ప్రక్రుతి శోభ కలిగిన మండలంగా చేసాడు.
నందిదుర్గంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూంది. ఆ కుటుంబం యజమాని సోమేశ్వరుడు, అతని భార్య కాత్యాయని. వారికి సంతానం లేదు. వారు ఒక పిల్లను పెంచుకొన్నారు. ఆ పిల్ల పేరు నిర్మల. నిర్మల పదిహే నేళ్ళ బాలిక.వయస్సు చిన్నదైనా, ఆ బాలిక ప్రౌఢగా ఎదిగింది.
సోమేశ్వరునికి లాంగలీ నదీ తీరాన దొరికింది నిర్మల! విపరీతమైన వరదలలో కొట్టుకొని వచ్చిన ఒక ఇంటి పూరి పెణకపై కులాసాగా ఆడుకొంటున్న శిశువును చూచాడు సోమేశ్వరుడు. అతడు ఈదుకొని వెళ్లి అమాయ కంగా ఆడుకొంటున్న ఆ శిశువును ఒడ్డుకు చేర్చాడు! ఆ రూజు మొదలు ఆ శిశువు కాత్యాయని పోషణలో పెరిగి పెద్దదయింది. కాత్యాయని ఆ శిశువుకు శరీర పోషణ మాత్రమె చెయ్యలేదు. ఆ శిశువులో బీజరూపమై అణగి ఉన్న విజ్ఞానాన్ని కూడ పోషించింది.
కాత్యాయని సంగీతంలో సహజ పండితురాలు. సంస్కృతాంధ్ర భాషల్లో ముందంజ వేయ గల విదుషి. ఆమె కాంకోల భట్టాచార్యుల వద్ద మంత్రోపదేశం పొందిన స్త్రీ! మంత్ర గురుచరణ సన్నిధానం లోనే సాహిత్యం కూడ ఆమె ఆకళించుకొంది. గురుప్రసాద ప్రభావం వల్ల కుండలినీ శక్తి సముల్లాసాన్ని కూడ చవి చూచిన యోగిని! మిక్కిలి స్వాతంత్ర ప్రియ, మూఢనమ్మకాలు లేని ఆధ్యాత్మ మనన తత్పరురాలు, నిర్భయ సత్యవాదిని!
అట్టి తల్లికి ఆమెని మించిన కుమార్తె నిర్మల! ఒకే ఒక్క దుర్బల గుణం నిర్మాలలో ఉంది. ఆమె రూప యౌవన సంగీత సాహిత్యాల్లో ఎంత ప్రౌఢయో, లోకం పోకడ తెలియనంత అమాయకురాలు!
యువరాజు సుచంద్రుడు నంది దుర్గానికి వచ్చి మాసం రోజులు అయింది. అది పుష్యమాసం సస్య లక్ష్మి పరిపూర్ణ యౌవనంతో సస్యారాధకుల ఇంట విలసిల్లింది. పృథ్వీలలామ మాతృత్వ శోభతో జీవ రాశులకు కన్నుల పండువుగా శోభించింది.
యువరాజు సుచంద్రుడు తన బాల్య సఖుడైన బలభద్రునితో, ఒక రోజు సాయంకాలం దుర్గం లోని ఫలవృక్షా రామానికి వెళ్ళాడు. గుత్తులు గుత్తులుగా బంగారు ముద్దల లాగ వ్రేలాడుతున్న ‘జామిపళ్ళ’ మధుర గంధం వారినిద్దరినీ ఆహ్వానించింది.
తోటకాపరి నీలందొర కొన్ని జామపండ్లు కోసి వారికి సమర్పించుకొన్నాడు. అప్పుడు సూర్యుడు అస్తమిస్తు న్నాడు. అతని బంగారు కిరణాలు తోటలోని వృక్ష సంతతికి అపూర్వ శోభని ఆపాదిస్తున్నాయి!
ఒక మధురాతి మదురమైన కంఠం వాయుమండలంలో సుడులు తిరుగుతూ సుచంద్రుని వీనులకు విందుగా ధ్వనించింది. ఆ కంఠనాదం లోని సౌమ్యం, గాంభీర్యం, మాధుర్యం, కళా విన్యాసం, తోట అంట ఆవరించి యువరాజు హృదయంలో విచిత్రమైన అనుభూతిని మొలకెత్తించాయి. ఆ గానకళకు పరవశుడై యువరాజు తోటమాలిని ఇట్లా ప్రశ్నించాడు.
“ నీలందొరా! ఈ ధ్వని ఎక్కడనుండి వస్తోంది? ఎవరిదీ?” అని.
“ప్రభూ! కాత్యాయనమ్మ గారి నిర్మలాకుమారి, ఇక్కడకి కొంత దూరంలో ఉన్న పారిజాత వృక్షం క్రింద కోర్చోని పాడుకొంటూ ఉంటుంది. ఆమె తరచూ సాయంకాలం ఈ తోటకు వచ్చి సాధన చేసుకోవడం అలవాటు!”
“బలభద్రా! నీవు, నీలందొర ఇక్కడే ఉండండి. ఆ పాటలు పాడుతున్న గంధర్వ కన్యకను ఇప్పుడే చూసి వస్తాను.” అని చెప్పి యువరాజు ఆ దిశగా వెళ్ళిపోయాడు.
“రంగుమీరగ వచ్చి రమ కౌగిలింప / బంగరు పుంఖపు ప్రభ కైతవమున! కాలంబు వచ్చు నాకలి తీరునంచు / గాలి నెయ్యుండు ముఖంబున డాగ!
తూణీర రూప పాథోరాశి యందు / బాణ రూపంబున పవళించు హరిని, గారవమున లేపి కరమున నంది / స్ఫార సుమేరు చాపంబున కూర్చి !
చికుర రూపంబగు జేజేల దారి / శకట రూపంబగు క్షమయును కదల, శకటాంగ వేష భ్రుచ్చంద్రార్క రుచుల / ప్రకటాట్టహాస ప్రభలు మించి పర్వ !
హుంకార భోదిత మురు నభోవాటి / నోంకార పటునాద ముగ్రమై వెలయ, ధనురాయ మన చండ ధాటికి నదరి / మినుకులు గుర్రాలు మేనులు వంప
‘జయము నీకగుగాక శంకరా’ యనుచు / హయ చోదకుడు బ్రహ్మ ఆశీర్వదింప, ఒక్క యేటున మూటి నుగ్రపురముల / సృక్కడగించిన ముక్కంటి గొలుతు!”
శివోపస్థాన రూపమైన ఆ ద్విపద గీతిని వింటూ నిర్మలా కుమారి వెనుక నిలబడ్డాడు యువరాజు!
“సుందరీ ! నీ పేరేమిటి?”
‘తననేనా సంబోధన! ఏమి ఆశ్చర్యం !! ఇదివరకు ఎవరూ తనని ఈ విధంగా సుందరీ అని సంబోధించ లేదు! నిర్మల ఇట్టి తలంపుతో ఉలిక్కి పడింది. హృదయం నుంచిగాని ఈ ధ్వని వచ్చి ఉండదు కదా? అని ఆమె అనుమాన పడింది.’
ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అపర చంద్రుడు సుచంద్రుడు!
బాలిక కండ్లు మూసుకొంది. తానేమి కల కంటున్ననా అనే ఆలోచనలో పడి పోయింది. ఇంత సుందర యువకుని ఆమె చూడడం ఇదే మొదటిసారి ! ఆమె పదిహేనేళ్ళ జీవితంలో అట్టి సుందర వదనం అపూర్వ దృష్టం! ఆమె కొండ జాతి యువకులనే ఇంత వరకు చూసింది.’ఒకవేళ దేవ పురుషుడు గాని తన గానానికి వశుడై .. కాదు! సాక్షాత్తు ఆ రుద్రుడే యువక రూపంలో తన మ్రోల నిలబడ్డాడు!’ అని తలచి ఆ బాలిక కాంచన విగ్రహం వలె చేష్టలు దక్కి కూర్చొన్న చోటు నుండి కదలకుండా కన్నులు మూసుకొనే .. “భగవన్! ఇవిగో నా నమస్క్రుతులు, మహాదేవా!” అని నమస్కరించింది.
“సుందరీ! నేను రక్త మాంసాలతో కూడిన మనిషిని, నీవేమీ భయపడనక్కర లేదు! నీ పాట విని దారినపోతూ ఉన్న వాణ్ని, ముగ్దుడనై ఇక్కడకి వచ్చాను.”
నిర్మల లేచి నిలబడింది. మెల్లగా తన కనుడంములు విప్పి చూచింది. ఆ చూపులు యువరాజు హృదయంలో స్థావరం కల్పించుకొన్నాయి.
ఆ యువక మిథునాన్ని చూసి అసూయతో కాబోలు, సూర్యుడు పశ్చిమాద్రిని గ్రుంకుతున్నాడు.
“నేను..నేను..” అని ఇక ఏమీ చెప్పలేక తడబడి తల వాల్చుకొంది నిర్మల.
“అవును నీవు పోరబడ్డావు!”
ఇప్పుడు నిర్మల సహజ భావానికి వచ్చింది. హ్రదయగతమైన భావాన్ని నిర్భయంగా వెల్లడించడం ఆమ సహజ గుణం. ఆ తెంపుతో ఇలా అంది. “పొరబడి ఉండవచ్చు! కాని ఆ భావం మాత్రం నా మనసులో లోతుగా పాతుకొని పోయింది, అది నాలో నుంచి తొలగి పోలేదు!”
“అయితే ఇప్పుడు ఈ ప్రమాదం నుండి నాకు విముక్తి లేదా?” అన్నాడు యువరాజు నవ్వుతూ. అతని మంద హాసం నిర్మల హృదయాన్ని కలచివేసింది.
ఆమె కండ్లు చెమ్మగిల్లాయి.”నేను ఒక అనాథ పక్షిని! నాకు రెక్కలు రాక ముందే నా జీవితాన్ని ప్రసాదించిన వారిని పోగొట్టుకొన్నాను. వారెవరో కూడ నాకు తెలియదు! నాకు రెక్కలు జతకూర్చి ఈ పృథ్విలో సంచరించడానికి అవకాశం కల్పించింది నా పాలిత మాతృదేవత! అంతేనా? నా రెక్కలకు రంగు పొంగులను, మెత్తని కుచ్చులను, ధావన శక్తిని కూడ ప్రసాదించింది. అంధకారమయమైన నా జీవిత నౌకలో నాకు ఉన్న వెలుతురు ఆ మాతృదేవత హృదయజ్యోతి ఒక్కటే! ఈనాటి మీరు నాకు వెలుగై కనబడ్డారు! ఎందుకు, ఎలా? అనే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను! మీరు నా అజ్ఞాతావస్థను ముగ్ధత్వాన్ని చూచి పరిహాసం చేయకండి.”
ప్రేమ అంటే ఏమో తెలియని ఆ బాలిక ఎంత నేర్పుగా తన ప్రేమను వ్యక్తం చేసింది! యువరాజు ఆ బాలిక ముఖాన్ని చూసాడు. ఆ ముఖం విషాదచ్చాయ పులుముకొన్నందున మంచు తెరలో కప్పబడిన చందమామ వలె అతని హృదయంలో వెన్నెలను వెదజల్లింది. తాను చేస్తున్న పని ..ఈ రెండింటి బేధాన్ని గుర్తించక, ఆ దయార్ద్ర హృదయుడు ఎదో ఆవేశంతో తనను తాను మరచి ఆ బాలికను గుచ్చి కౌగలించుకొన్నాడు.
సూర్యుడు బాగా అస్తాద్రి మరుగుచొచ్చాడు. పక్షులు తమ తమ గూళ్ళకి కోలాహలంతో వచ్చి చేరుకొంటు న్నాయి. వాటి రెక్కలచే కలిగిన వాతం వల్ల కాబోలు, పారిజాత వృక్షం ఆ యువక మిథునం పైన పుష్ప వృష్టి కురిపించింది. యువరాజు వెచ్చని కౌగిలిలో ఆ బాలిక కరిగి కొన్ని క్షణాలు అనిర్వచనీయమైన ఆనందం అనుభవించింది!
అప్పుడు ఆమెకు తాను ఒక స్త్రీనని, తానొక పురుషుని కౌగిలిలో ఉన్నాననీ జ్ఞప్తికి వచ్చింది. ఆ జ్ఞానం ఆమె హృదయంలో భీతిని, సిగ్గును పుట్టించింది. వెంటనే కౌగిలి బంధాన్ని వదిలించుకొని.. “ ఆర్య! అపరాధాన్ని మన్నించండి. ఈ అపరాధం నాలోని పవిత్రమైన కన్యాత్వాన్ని చెరిపింది. అది తిరిగి యథాప్రకారం కాజాలడు. అందు వలన నాకు శరణ్యం మీరైనా కావాలి! లేక మృత్యువైనా కావాలి! ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టమో వెల్లడించండి. మీ ఆదేశాన్ని శిరసా వహిస్తాను! నా ప్రేమ వివేకంలో ఇది నిర్ధారిక విషయమని మీరు గుర్తించాలి!” అని చెప్పింది నిర్మల.
“ప్రేయసీ! నీ శిరీష కుసుమ సదృశ కోమల తనువును, నిర్మల హృదయాన్ని నేను మృత్యువు కొరకు త్యాగం చేయగలనా? ఎన్నడూ ఆ పని నా వలన కానేరదు! నిన్ను భార్యగా స్వీకరిస్తాను, నమ్ము.”
“ధన్యురాలిని! ఆ పని రేపటి దినం నా తల్లి సమక్షంలో జరిగిపోవాలి. నేను విలంబాన్ని సహింప జాలను.”
“అలాగే, కానీ! ఈ రాత్రి నీ తల్లికి చెప్పు, ఆమె ఆదేశ ప్రకారం నడుచుకొంటాను.” అంతట ఆ ప్రేమికులు విడిపోయారు.
*************************************
మరునాడు సూర్యోదయం అయింది. గతసాయంకాలం జగస్సాక్షి ఆ ప్రేమికులను చూచే ఉన్నాడు. వారి ఉత్తరోత్తర కలాపాన్ని దర్శించాలని కాబోలు, సహస్ర చక్షువులతో ఆకాశం నుండి క్రిందకి చూస్తున్నాడు!
ప్రాతఃకాల కృత్యాలను ముగించుకొని కాత్యాయని నంది దుర్గంలో శ్రీకాకుళ దండనాదులు నివసిస్తున్న ప్రత్యేక భవనానికి వచ్చింది. ద్వార పాలకులు ఆమెను అడ్డలేదు! ఇది వరలో వారికి అట్టి ఆజ్ఞ సుచంద్రుడు ఇచ్చి ఉన్నాడు.
యువరాజు కవచ శిరస్త్రాణాలతో అలంక్రుతుడై కాత్యాయనికి దర్శనం ఇచ్చాడు.
కాత్యాయనికి అతడు యువరాజని తెలియదు! యువరాజు ఆసనాన్ని అలంకరించి, ఎదురుగా వేసి ఉన్న ఆసనంలో కాత్యాయనిని కూర్చోమని సంజ్ఞ చేసాడు. కాత్యాయని కూర్చొని తానే మొదట మాట్లాడింది. “ అయ్యా! తమరు నాకుమార్తెను నిన్న సాయంకాలం కలసుకొన్న మాట నిజమేనా?”
కాత్యాయని భయం లేని స్త్రీ ! ఆమెకు మూట ముప్పిడి వ్యవహారాలూ నచ్చవు ఏమంటే ఆమె యదార్థ వాదిని! నిర్మల తల్లితో ఈ విషయం ఇంత త్వరగా ప్రసంగిస్తుందని యువరాజు తలంచ లేదు! అతడు ఆశ్చర్యాన్నే పొందాడు.ఇలా జవాబు ఇచ్చాడు. “ అమ్మగారూ! మీరు చెప్పింది నిజమే!”
“తమరు ఆమెను భార్యగా స్వీకరిస్తాననివాగ్దానం చేసారట! వాస్తవమేనా?”
“నిజమే!” యువరాజు చకితుడై తనను తాను సమాళించుకొని చెప్పాడు.
“ ఈ సందర్భంలో నేను తమతో ఒక విషయం మనవి చేసుకోవలసి ఉంది. మా నిర్మల వరణ స్వాతంత్రాన్ని నేను ఎప్పుడూ దూషించను. అది నా స్వభావ విరుద్ధం, అధర్మం కూడాను! అయినప్పటికీ ఆమె వివాహ విషయంలో ఎట్టి అవక తవకలూ లేకుండా చూచే బాధ్యత నాకు ఉంది. నిర్మల నేను పెంచిన పిల్ల! ఆమె తల్లి తండ్రులు విషయం అజ్ఞాతంగా ఉంది! కాని నా అంతరాత్మ ఆ పిల్ల ఉత్తమ కుల సంజాత అనే చెప్తోంది! కనుక ఆమె వరించబోయే యువకుని కులగౌరవాలు నేను కనుక్కోవడంలో తప్పు ఉండదు కదా, ఏమంటారు?”
ఈ మాటలు విని యువరాజు సందిగ్దావస్థలో పడిపోయాడు. నిజ వృత్తాంతం చెప్తే కాత్యాయని భావం ఏ విధంగా ఉంటుంది! బాగా ఆలోచించాడు. తాను రాజపుత్రుడని చెప్తే విషయం చెడి పోతుందని భయం పొందాడు. తానేమో నిర్మలను గాఢముగా ప్రేమించాడు. ఆ అసాధారణ రూపవతిని తాను ఒదులుకో లేడు! ఈ కారణాల వల్ల యువరాజు తన వాస్తవమైన నామ రూపాలను గుప్తంగానే ఉండడానికి తీర్మానించి ఇలా అన్నాడు.
“ అమ్మగారూ! నేను సార్వభౌముని సేనలో పేరు పొందిన దండనాదుణ్ణి ! నాపేరుకౌండిన్య సుకీర్తి. నాకు మంచి హోదా, విస్తారమైన ఆస్తి ఉన్నాయి. నేను రాజ బంధువును కూడ.”
“సరే! సంతోషం, నేను మిమ్ములను పూర్తిగా నమ్మాను! ఈ దినమ్రాత్రి తొమ్మిది ఘడియల తరువాత మంచి లగ్నం ఉంది. ఆ శుభ లగ్నంలో మీరిద్దరూ వివాహితులు కావలసి ఉంటుంది. ఎట్టి ఆడంబరం పనికి రాదు. మీరు మీ స్నేహితులు ఒకరిద్దరితో మా ఇంటికి రండి. మీరు నా కుమార్తెను, ‘ఆంగీరస నిర్మలను’ మంత్ర పూతంగా వివాహం చేసుకొన్నట్లు ఒక కాగితం మీద వ్రాసి సంతకం చేసి ఇవ్వ వలసి ఉంటుంది. ఇలా ఎందుకు అడుగుతున్నానో మీరు ఊహించుకోండి. మీరుయుద్ద వీరులు! హఠాత్తుగా యుద్ధానికి వెళ్ళ వలసి ఉంటుంది. అలాంటి సందర్భాలలో ఆ దిక్కులేని పిల్లకు, ఈ కాగితమే ఆధారంగా ఉంటుంది కదా? కీడు ఎంచి, మేలు ఎంచ మన్నారు పెద్దలు!”
“సంతోషం ఒప్పుకొంటాను”
కాత్యాయని లేచింది, యువరాజు కూడా లేచాడు.
************************
నిర్మలా సుచంద్రుల వివాహం వేదోక్తం గాను, నిరాడంబరం గాను, అయిదు రోజులు జరిగింది. వివాహ కాలంలో దండనాయక బలభద్ర్రుడు, నంది దుర్గాధిపతి దండనాయక సామంత నందిసేన దొర సన్నిహితులై ఉన్నారు. యువరాజు మాట ప్రకారం కాగితం పైన నిర్మలను తాను వివాహం చేసుకొన్నట్లు వ్రాసి, కౌ:సు: అని పొడి అక్షరాలతో సంతకం పెట్టాడు. కాత్యాయని ఆ కాగితానికి పసుపు కోరు పెట్టి, నందిసేన, బలభద్రుల సాక్షి సంతకాలు కూడ తీసుకొంది.
నాగవల్లి నాటి సంధాన ముహూర్తం కూడ జరిగింది. మూడు రాత్రులు నియమ ప్రకారం యువరాజు నిర్మలనతో ఏకాంతంగా గడిపాడు.
వివాహమై మూడు మాసాలు గడచి పోయాయి. ఈ మూడు మాసాలూ నిర్మల తన నాథుని తోటలో ప్రతిరాత్రీ కలసుకొని ఆనందించింది. ఈ మూడు మాసాలో ఆ యువ దంపతులకు మూడు క్షణాల లాగు గడిచి పోయాయి!
చైత్ర మాసం ప్రవేశించింది. ప్రక్రుతి కోకిలారావంతో మేల్కొంది. పుష్ప జాతులు, రంగు రంగు జెండాలెత్తి వసంత సమ్రాట్టును రాబట్టుకొన్నాయి. ప్రక్రుతి సచేతనమై కిలకిల లాడుతోంది.ఆ కిలకిల సవ్వడికి తాళం హంగు జత కూర్చుతూంది మలయా మందానిలం.
నంది దుర్గానికి శ్రీకాకుళం నుండి వార్తాహరుడు వచ్చాడు. అతడు తెచ్చిన వార్త అందరి హృదయాల లోనూ విషాదం పుట్టించింది.
పర్వతస్వామి భట్టారకుడు కుంతలాదీశుని ఓడించాడు. ఓడిపోయిన కుంతల దేశాధిపతి సంధి చేసుకొని కొంత రాజ్యాన్ని పర్వత స్వామికి ఇచ్చుకొన్నాడు. ఆ రాజ్యంలో పర్వత స్వామి తన భగినీపతి శివనాధుని మాండలిక రాజుగా ఏర్పాటు చేసాడు. ఇంట వరకు వార్తలో సంతోష ఘట్టం! విచార ఘట్టమేమిటంటే పర్వతస్వామి భట్టార కుడు యుద్ధంలో గాయపడి మృత్యు ముఖంలో పడిఉన్నాడు! వెంటనే యువరాజు రావాలని ఉంది ఆ వార్తలో!
రాజ సందేశం వెంటనే అమలు జరుపబడింది. వార్తాహరుడు వచ్చిన కొన్ని క్షణాల లోనే యువరాజు తన మిత్రునితో కలసి బయలు దేరాడు.
ఆదరా బాదరాగా యువరాజు తన ప్రేయసి నిర్మలను తోటలో కలసుకొన్నాడు. రత్న స్థగితమై, కౌ:సు: అని అక్షరాలు చెక్కి ఉన్న బంగరు పిడిగల బాకు నిర్మలకు కానుకగా ఇచ్చాడు.
ఏడుపుల మధ్య, మందహాస చంద్రికాచ్చాదితమైన ముద్దుల మధ్య, ఆ నూతన దంపతులు ఒకరికొకరు వీడ్కోలు ఇచ్చుకొన్నారు.
“ప్రేయసీ! నిన్ను రెండు మాసాలలో తీసుకొని వెళ్లిపోతాను” అన్నాడు యువరాజు.
“నాథా! మీ చరణదాసి మీ కొరకు నిరీక్షించి ఉంటుంది. అధిక కాలం చేయకండి. అలా చేస్తే నాకు నిజంగా పిచ్చి ఎత్తుతుంది సుమండీ!” అని గడగడ కంఠంతో చెప్పింది నిర్మల.
వారిద్దరినీ విధి విడదీసింది! ఉన్నట్లుంది ఆ మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమయింది. చిన్న చిన్న కారు మబ్బులు ఆకాశంలో సంచారి స్తున్నాయి. చినుకులు రాక ముందు ప్రయాణం కావడం మంచిదని యువరాజ, బలభద్రులు తమ సేనావాహినితో దురాన్ని వదలి పయనించారు. వారి వెనకనే వాన చినుకులు ప్రచండ వాతంతో కలిసి పడ్డాయి! వెళ్ళుతున్న తన నాథుడు కనుమరుగు అయ్యేదాకా బురుజు మీద వానలో తడుస్తూనే చూస్తూ నిలబడింది నిర్మల!
**************************
38 వ ప్రకరణము:
రాజరికం కత్తిమీద సాము వంటిది. రాజుకంటే పేదే సుఖమూ, స్వేచ్చా అనుభవించ గలడు.’కోపీనవంతః ఖలు భాగ్యవంతః’ అంటారు పెద్దలు. రాజు స్వేచ్చగా సంచరించ లేడు. హోదా, ప్రభుత్వ శక్తి, ఐశ్వర్యం ..ఇవే స్వేచ్చా జీవికి ప్రతిబంధకాలని మానవ చరిత్ర పుటలలో నుంచి మనం గ్రహించవచ్చు. రాజుకు స్నేహితుడు, వాని అంతరాత్మ ఒక్కటే. రాజు ఎవరినీ నమ్మకూడదని చాణుక్య నీతి చెబుతుంది. దయా దాక్షిణ్యాది గుణాలు కల రాజు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించ వలసి ఉంటుంది. అందరూ రాజు పైన భక్తి గౌరవాలు ఉన్నట్లు నటిస్తారు. వారిని చూసి రాజు మోసపోకూడదు. అదే విధంగా రాజు కూడ వారిమీద నమ్మకం, ప్రీతి ఉన్నట్లు నటించడం నేర్చుకోవాలి. ఆహార పానీయాల్లో కూడ రాజుకు స్వేచ్చ ఉండదు. ప్రేమించి వివాహం చేసుకోవడం లోనూ నృపునికి ఇబ్బందులే! కొన్ని సమయాలలో పార్థివుడు ఇష్టం లేని వివాహం చేసుకోవలసి ఉంటుంది.
మహారాజు సుచంద్రుడు కూడ ఇట్టి చిక్కుల లోనే పడ్డాడు.
తండ్రి ఏరికోరి కూర్చిన భార్య చారుమతీ దేవి. సుచంద్రునికి ఆమె అన్ని విధాలా అనుకూలవతి అయిన భార్య. ఆమెపై అతనికి ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇట్టి అనుకూల దాంపత్యానికి విధి అడ్డు తగిలింది. నిర్మలా కుమారి నరపతి హృదయాన్ని ఆకర్షించింది. ఆ ఆకర్షణ చాల బలీయమయి పోయింది. రహస్యంగా వివాహం జరిగి పోయింది.
తండ్రి ఉత్తర క్రియలు జరిగిన తరువాత సుచంద్రుడు రాజకీయంగా చాల ఇబ్బందులకు గురి కావలసి వచ్చింది. ముఖ్యంగా కోశంలో ధనం శూన్యమయి పోయింది. తానంటే ఒంటరివాడు, ఎవరూ సహాయం చేసేవారు కనిపించ లేదు. ఆ సమయంలో ఆపద్భాందవుడు లాగ తారసిల్లాడు గౌతమ సునందుడు. సునందునికి రాజధానిలో పలుకుబడి విస్తారంగా ఉంది. ముఖ్యంగా రాజధాని లోని కోటీశ్వరులతో పరిచయాలు ఎక్కువ! తన కుమార్తె లీలావతిని వివాహం చేసుకొంటే తాను అన్ని విధాల సహాయం చేయగలనని మాట ఇచ్చాడు సునందుడు. సుచంద్రుడు లీలావతిని చూసాడు, ఆమె రూపం అతనికి నాయన మాదకంగా కనిపించింది. వివాహానికి ఒప్పుకొన్నాడు . తత్ఫలితంగా సునందుడు మహారాజుకు విశేష దనం అప్పుగా ఇప్పించాడు. చారుమతీ దేవి ఆరోగ్యం బాగులేదనే నెపంతో మహారాజు వివాహానికి వాయిదా వేసాడు. మాట ఇచ్చిన తరువాత, రాజు దానిని తప్పడని సునందునకు తెలుసు. కాబట్టి వివాహం శీఘ్రంగా జరగాలని నిర్భంధించ లేదు సునందుడు.
తండ్రి చనిపోయిన ఆరు మాసాల తరువాత మహారాజ సుచంద్రుడు చారుమతీ దేవిని ఒప్పించి లీలావతిని పరిణయమాడాడు. సంవత్సరం నిండక ముందే లీలావతి భోగనాథుని ప్రసవించింది. భోగనాథుడు పుట్టిన ఒక మాసం రోజుల తరువాత చారుమతీ దేవి శక్తిధరునికి జన్మనిచ్చింది. శక్తిధరుడు పుట్టిన రెండు సంవత్సరాల తరువాత చారుమతీ దేవికి రథినీ కుమారి పుట్టింది. అదే సంవత్సరం రథినీకుమారికి రెండవ పుట్టిన రోజు రాక ముందే పట్టమహిషి సూతికా వాతానికి గురి అయి పరలోక గతురాలు అయింది.
ఈ మధ్య మహారాజు నిర్మలా దేవిని స్మరించినా, ఆమెను తీసుకొని రావడానికి ప్రయత్నించ లేక పోయాడు.
చారుమతీ దేవి మరణానంతరం మహారాజు తన సఖుడైన దండనాయక బలభద్రుని నంది దుర్గానికి పంపి, నిర్మలాదేవిని తీసుకొని రావలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు.
నంది దుర్గానికి వెళ్ళిన దండనాయకుడు రిక్త హస్తాలతో తిరిగి వచ్చాడు. అతడు చెప్పిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
“నంది దుర్గంలో కాత్యాయని దంపతులు లేరు. కాత్యాయని భర్త సోమేశ్వరుడు ఏ కారణం చేతనో మతి భ్రష్టుడై గృహత్యాగం చేసాడు! అప్పుడు నిర్మలా దేవి పూర్ణ గర్భిణి! నిర్మలను, ‘ఏకవీర’ అనే కొండ జాతి స్త్రీ వశం చేసి తన భర్తను వెదికి తీసుకొని రావడానికి ఇళ్లు విడిచి వెళ్లింది కాత్యాయని. వెళ్ళిన మనిషి నంది దుర్గానికి తిరిగి రాలేదు! తల్లి తండ్రుల వియోగం చేత, ప్రియుని ఉపేక్ష చేత దుఖితురాలైన నిర్మల మతి చలించింది. ఆమె ఉన్మాదిని అయింది. ఆ ఉన్మాదం లోనే ఆమెకు మగశిశువు జన్మించాడు. అంత ఉన్మాదం లోనూ ఆమె ఆ శిశువుని చూసి ఆనందించి మైమరచి పాడుతూ ఉండేదట! శిశువుకి ఆరు మాసాలు నిండాయి. ఒక రోజు రాత్రి నిర్మల ఆ శిశువుని తీసుకొని పరారీ అయింది. ఇప్పటి వరకూ నంది దుర్గ వాసులకు కాత్యాయని గురించి గాని, నిర్మల గురించి గాని తెలియ లేదట!”
బలభద్రుడు చెప్పిన వృత్తాంతం విని మహారాజు చాలా ఖేదించాడు.
కాలం చాల ప్రభావం కలది! ఎంత విషాద ఘట్టాన్నయినా కాల ప్రవాహంలో మనిషి విస్మరిస్తాడు. సరాగి విరాగి గాను , విరాగి సరాగి గాను మారిపోతాడు. ఎత్తు పల్లం అయిపోతుంది, పల్లం ఎత్తు అయిపోతుంది! కాల ప్రవా హంలో దేశాలే మారిపోతాయి. మహారాజు సుచంద్రుడు తాను అధికంగా ప్రేమించిన నిర్మలను కాలక్రమంలో మరచిపోయాడు!! ఇదీ అలనాటి వృత్తాంతం.
***********************************
39 వ ప్రకరణం :
అశోకవనం లోని పాతాళ గృహం నుండి రాజకాళిని విడిపించిన మరుచటి దినం ప్రాతఃకాలం మహారాజ సుచంద్రుడు ఏకాంత శాలలో కూర్చొండి, తన కుమార్తె రథినీ కుమారిని చూడాలని కబురు పెట్టాడు.
రథినీ కుమారి తండ్రి వద్దకు వచ్చింది. ఆమె ముఖం కళావిహీనంగా ఉంది! రాత్రంతా నిద్ర లేదు కాబోలు, ఆమె కండ్లు ఎర్రబడి ఉన్నాయి.
“ఏమమ్మా, అలా ఉన్నావు, ఆరోగ్యం బాగా లేదా?”
“శరీరం నిరోగం గానే ఉంది నాన్నగారూ! మనస్సు బాగు లేదు.”
“ఏమ్మా, ఏం జరిగింది?”
“మీకింకా తెలియదా, నాన్నగారూ?”
“నాతో ఎవరూ ఏమీ చెప్పలేదమ్మా! ఇప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నీకు కబురు పెట్టాను”
“మహారాణి అంతఃపురం అంతా ఒకటే గోలగా ఉంది! చేటీ జనాధ్యక్షురాలు భ్రుంగాలక ముఖం కంద గడ్డలా వాచి పోయి ఉంది! పిన్ని ఏడుస్తోంది, సునంద తాతగారు ఇప్పుడే అంతఃపురానికి వచ్చారు. మీకు కూడ కబురు రాగలదు!”
“అసలు విషయమేమిటి?”
“అన్నయ్య భోగనాథ బాబు కోటలో కనపడడం లేదట! భ్రుంగాలక ముద్దు బిడ్డడు వీరసింహ బాబు కూడ రాజధానిలో లేడట!”
మహారాజు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి పోయాడు. అతని ముఖంలో విషాదచ్చాయ పొడచూపింది. దీరుడైనా, ఆ రాజు తన కుటుంబంలో జరుగుతున్న కుట్రలకు చలించి పోయాడు. “కుమారీ! ఒంటేనా విషయం, ఇంకేమైనా ఉందా?”
“ఇప్పటికింతే తెలిసింది. దీని వెనక భయంకర రహస్యాలు దాగి ఉన్నాయని నా అంచనా! ఉన్నట్లుండి
అన్నయ్యలో ఇంత తామస గుణం ఎందుకు పుట్టిందో ఊహించలేకుండా ఉన్నాను. మరొక మాట, నాన్నగారూ! మీరు నిన్న రాత్రి కోటలో లేరట! నిజమేనా?”
“ఎవరమ్మా, చెప్పారు?”
“ రథినీ కుమారి కొద్దిగా నవ్వి ఇలా అంది. “ మహాప్రతీహారి వీరభద్రుని మూలంగా తెలుసుకొన్నాను, మీతో ప్రమథ నాథ బాబు కూడా ఉన్నాడట!”
మహారాజు తన కుమార్తె చాతుర్యాన్ని అభినందించాడు. దానితో బాటు మహా ప్రతీహారిపై కించిత్తు కోపం కూడ ఏర్పడింది. సూక్ష్మబుద్ది ఉన్న రథిని దానిని కనిపెట్టి ఇలా అంది.“నాన్నగారూ! ప్రతీహారిని మీరు శంకించకండి. అతడు నిప్పువంటి వాడు, నాపై అతనికి భక్తి గౌరవాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తప్ప ఎవరికీ చెప్పడు.”
మహారాజు సమాధాన భావంతో తల పంకించి క్రోదటి రాత్రి జరిగినదానిని పూస గ్రుచ్చినట్లు కుమార్తెకు చెప్పాడు. అంటా విని రథినీ కుమారి బరువుగా నిట్టూర్పు వదిలింది.”నాన్నగారూ! కొంత కాలంగా గూడుపుఠానీ జరుగు తూందని కనిపెట్టాను. పదే పదే విశాలాక్ష బాబు, అన్నయ్య దగ్గరకు రావడం గమనించాను. ఇంత విపరీతం జరుగుతుందని ఊహించ లేదు!”
వీరిట్లా మాట్లాడుతూ ఉనడగా మహా ప్రతీహారి లోపలి వచ్చాడు. వినయంతో మహారాజుకి అభివాదన చేసి నిలబడ్డాడు. ఏమి అన్నట్లు మహారాజు వాని వైపు దృష్టి ప్రసరించాడు.
“మహాప్రభో! చేటీ జనాధ్యక్షురాలు భ్రుంగాలకమ్మ గారు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు.”
“ప్రవేశ పెట్టు.” అని చెప్పాడు మహారాజు.
భ్రుంగాలక లోపలి వచ్చింది. ఆమెను కూర్చోమని మహారాజు ఆదేశించ లేదు. ఆమె నిలబడే ఇలా అంది.” “మహాప్రభో! మహారాణి వారు శ్రీవారి దర్శనం కోరుతున్నారు.”
“భ్రుంగాలకా! మహారాజు శరీరంలో అస్వస్థతగా ఉందని చెప్పు. అవకాశం చూసుకొని సాయంకాలం లోపుగా దేవి గారి దర్శనానికి వస్తాను. నీవు ఇప్పుడు వెళ్ళవచ్చు!” అని కటువుగా చెప్పాడు మహారాజు.
భ్రుంగాలక చొరవ తీసుకొని ఎదో చెప్పాలని కొంత సేపు నిలబడింది. మహారాజు ఆమె ఉద్దేశం గ్రహించి ఇలాఅన్నాడు.
“ మహారాణి గారి శోకాన్ని వారించడానికి వారి తండ్రిగారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి చేయ వలసినది ఏమీ లేదు! భోగనాథుడు చంటిపిల్లవాడు కాదు, సర్వజ్ఞుడు, సర్వ సమర్థుడు. వానిని గురించి విచారించ వలసిన అవసరం ఉండదు. నీవు వెళ్లు.” భ్రుంగాలక ముఖం మాడి పోయింది. ఆమె ముఖంలో కట్టి వేసిన రక్తపు చుక్క లేదు. మారు మాట్లాడక వెళ్లి పోయింది.
“రథినీ! నేవు వెళ్లి మహా ప్రతీహారితో చెప్పు. మహామంత్రిని, ప్రమథ నాథ బాబుని నేను అత్యవసరంగా ఇక్కడే చూడాలి!” రథిని లేచింది. ఆమె వెళ్ళబోతూ ఉండగా, “ కుమారీ! నీవు కూడ సమావేశంలో ఉండాలి సుమా!” అన్నాడు మహారాజు.
**********************************
40 వ ప్రకరణం:
మహారాజ సుచంద్రుడు, రథినీ కుమారి, మహామంత్రి మల్లికార్జునుడు, రహస్యార్థ శోధకుడు ప్రమథనాథ బాబు ఏకాంతశాలలో సభ తీర్చారు.
అందరి హృదయాలూ బరువుగా ఉన్నాయి. అందరి ముఖాల్లోనూ ఆందోళన కనబడుతోంది. ఎవరు ముందు మాట్లాడాలో తెలియక రంగస్థలం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. సమయోచిత జ్ఞానం గల రథినీ కుమారి నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఇలా అంది. “ రాజధానిలో కొన్ని రోజులుగా కుట్రలు జరుగుతుండడం శ్రీమాన్ ప్రమథనాథ బాబు గమనించలేనట్లుంది!”
ఇది ప్రమథ నాథుని హెచ్చరించినట్లా, లేక అసమర్థతను ప్రశ్నించినట్లా అని తికమక పడ్డారు మహారాజ, మహా మంత్రులిద్దరూ. ప్రమథనాథుడు ఏమీ చలించ లేదు. అతడు ఇట్లా బదులిచ్చాడు. “మహాప్రభో! ద్వారదేశ మందు సర్వ సేనాపతి గారు ఉంటారు. వారుకూడా ఈ సభలో ఉండడం ఆవశ్యకమని నేను ఆహ్వానించాను. ఈపాటికి వారు వచ్చే ఉంటారు. ఏలినవారు వారికి కూడా ప్రవేశం కలిగించాలని నా ప్రార్థన.”
“చాలా మంచి పని చేసావు నాయనా! నీవే వెళ్లి అతణ్ణి లోనికి తీసుకొని రా” అని చెప్పాడు నృపతి.
ప్రమథ నాథుడు శాల వదలి వెళ్ళాడు. అతడు ద్వారదేశానికి వచ్చిన కొన్ని క్షణాలలో, సంపూర్ణ సైనికాలంకా రాలతో కాలనాథుడు వచ్చాడు. ఇద్దరూ కలసి రాజ సన్నిధికి వచ్చారు. కాలనాథుడు మహారాజుకి అభివాదన చేసి, తన కొరకు వేసిన ఆసనంలో కూర్చొన్నాడు.
“భర్త్రుదారిక నాకు కావించిన హెచ్చరికకి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ఒక మాసంగా రాజధానిలో జరుగుతున్న కుట్రలు నేను కనిపెట్టుతూనే ఉన్నాను. కాని , ఆ కుట్రలను మధ్యనే హతమార్చడానికి కొన్ని రాజకీయ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి! ఈ కారణం వలన నేనూ, రాష్ట్రీయుడు మా జాగ్రత్తలో మేము ఉన్నాము. కాని స్వతంత్రించి చేదించలేక పోయాము. సగం కొట్టి వదిలేసినా సర్పం చాల ప్రమాదకరం. అలాగే కుట్రల విషయంలో కూడ అని నా అభిప్రాయం! దానిని సర్వశక్తులతోనూ ఎదుర్కొ వలసిన కాలం ఇదే!” అని ప్రమథ నాథుడు రాజపుత్రికను చూసి అన్నాడు.
“ ఆ కుట్రల స్వభావాన్ని వినగోరుతున్నాను.” అన్నాడు మహారాజు.
“మహాప్రభో! నేను వివరంగా చెబుతాను. ఆ సందర్భంలో శ్రీవారి ప్రభుత్వోద్యోగులలో ప్రముఖుల పేర్లు , శ్రీవారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పడం తప్పని సరి అవుతుంది! శ్రీవారు దానికి క్షమించాలి.”
“రాజకీయ విద్రోహుల్లో నీవారు, నా వారు అనే భేదం ఉండదు. నిర్భయంగా చెప్పవచ్చును.”
“మహాప్రభో! కుట్ర రెండు ప్రాంతాల్లో నడుస్తోంది! ఒకటి ..ఇక్కడ మన రాజధానిలో, రెండు .. పార్వతీయ ప్రాంతంలో! ఇక్కడ కుట్రదారుల ప్రయత్నం విఫలమయి పోయింది. శ్రీవారి జ్యేష్ట పుత్రుడు కుమార భోగనాథ బాబు, విశాలాక్షుడు, మౌద్గల్య వీరసింహుడు, మహాసమాహర్త హేమచంద్రుడు, దండనాయక రుద్రసేనుడు, దండనాయక పింగాక్షుడు వీరు ప్రధానమైన కుట్రదారులు!
వీరిలో పింగాక్షుడు శరీరంలో అస్వస్థతగా ఉందని సెలవు పెట్టుకొని రాజధానిని వదిలి రెండు మాసాలు అయింది. దండనాయక రుద్రసేనుడు తీర్థయాత్రల నెపంతో రాజధానిని విడచి మాసం రోజులు అయింది. వీరసింహ హేమచంద్రులు వారం రోజులనుండి రాజధానిలో లేరు! కుమార భోగనాథ బాబు, విశాలాక్షులు నిన్న రాత్రి రెండవ యామంలోనే రాజధాని నుండి వెళ్లి పోయారు. వారితో పాటు కుముదాక్షి కూడా వెళ్ళినట్లు తెలిసింది. రాజధాని లోని కుట్ర దారులు మూడు విధాలుగా పథకాలు వేసుకొని తమ ప్రయత్నం సాగిస్తున్నారు.
ఒకటి .. రాజకాళమ్మను హతమార్చి, ఉత్తరాదికారి సమస్యను నిష్కంటకంగా చేసుకోవడానికి వారు అవలంబించిన పథకం విఫలమయి పోయింది. రెండవది.. రాజకీయ కోశాగారాన్ని హరించడం, అది కూడా విఫలమయి పోయింది.
మూడవది.. ఆంధ్రరాష్ట్రం లోని నాగ యువకులను చేరదీసి ఒక బలిష్టమైన సేనను తయారు చేయడం. ఈ మూడు పథకాలూ రాజధానిలో ఫలించలేదు. మూడవ కార్యక్రమంలోపింగాక్షుడు కొంత వరకు కృతకృత్యుడు అయ్యాడని తెలుస్తోంది! తాము బంధించిన రాజకాళమ్మ చెరనుంచి విమిక్తి పొందిందని తెలియగానే కుట్రదారులు ముఖ్యంగా రాజపుత్రుడు, విశాలాక్షుడు పలాయన సూత్రం చిత్తగించారని నా అనుమానం!”
“ఈ కుట్రదారుల గమ్య స్థానం ఏది, వీరి కుట్రలోని తాత్పర్యం ఏమిటి?”
“మహాప్రభో! వీరి గమ్యస్థానం పార్వతీయ ప్రాంతం. అక్కడ శ్రీవారి ప్రభుత్వంచే నియమించబడిన రాజ ప్రతినిథి అమరసేనుడు కుట్ర దారులతో చేయి కలిపినట్లు తెలిసింది. శ్రీవారి ప్రభుత్వాన్ని కూలద్రోయడమే వారి ముఖ్యా శయం! పార్వతీయ ప్రాంతంలో సైన్యాన్ని పటిష్టం చేసుకొని కళింగేశ్వరునితో మైత్రి సలిపి, ‘చిత్రకూట రాష్ట్రాన్ని మొదటి కబళంగా పుచ్చుకొని ఆంద్ర రాష్ట్రముపై దండెత్తాలని వారి పథకం! రాజకాళమ్మ మృతి చెందితే ఇంత మట్టుకు వారు చెయ్యదలుచుకొలేదు! అప్పుడు వారు తమ మిత్రుడు అమరసేనుడికి పార్వతీయ ప్రాంతం సంకల్పించారని తెలిసింది.
ఇప్పుడు వారి పథకం వేరు రూపం పొందింది. మొదటి పతకం ప్రకారం రాజకాళమ్మ మరణించినా పూర్తిగా ఉత్తరాదికారి సమస్య పరిష్కారం అవుతుందని నమ్మకం లేనందున మొదటి నుండి వారు అమరసేనునితోను, కళింగ దేశాధిపతి తోనూ, రాయబారాలు కొనసాగిస్తూ వచ్చారు. దీనిలో నాగులు కూడా కలిసారు. నాగులకు చిత్రకూట రాష్ట్రం ఇవ్వడానికి భోగనాథ బాబు అంగీకరించాడని తెలుస్తూంది. ఈ విధంగా పథకం వేసుకొని అమలు పరచడానికి ప్రయత్నిస్తున్నాడు విశాలాక్ష బాబు.” అని వివరించి చెప్పాడు మహామంత్రి.
“పథకం చాల ఆడంబరంగానే ఉంది గాని, చాల లోపభూయిష్టంగా ఉంది! పార్వతీయ ప్రాంతం కళింగులు పోగొట్టుకొన్న భాగం! దాన్ని తిరిగి ఇస్తేనేగాని, కళింగులు కుట్రదారులతో కలసి మనపై దండెత్తడంలో లాభ మేముంటుంది? కళింగులు అమరసేనుని పార్వతీయ మండలానికి రాజుగా అంగీకరించరు! పోగా నిశుంభుడు ఆంద్ర రాష్ట్రాన్ని కబళింప చూసే వ్యక్తి ! అలాంటివాడు కుట్ర దారులకు లోబడి భోగనాథునికి ఆంద్రరాష్ట్రం ఇస్తాడా, అదీకాక అతడు ఇరావతికి ఒక రాజ్యం సమకూర్చే షరతు మీదనే, ఇరావతి పక్షం వారు వానితో కలసి పని చేస్తున్నారు! ఇరావతికి చిత్రకూట రాష్ట్రం పైన కన్ను ఉంది. విశాలాక్షబాబు ఇంత దుర్బలమైన పథకం వేయడం నాకు వింతగా కనిపిస్తోంది!
మరొక విషయం. నిశుంభుడు కుంతలేశ్వరునితో మైత్రి సల్పుతున్నాడని వింటు న్నాము ! ఈ పథకాన్ని వారు ఆమోదించి ఉంటే, వాడు ఈ పాటికి పార్వతీయ ప్రాంతానికి వెళ్లిఉండి తన కార్య క్రమాన్ని జరుపుకొంటూ ఉంటాడు కదా? వీటిని బట్టి ఆలోచిస్తే నాకు అంతా గందరగోళంగా ఉంది!” అని చెప్పింది రథినీ కుమారి.
రథినీ కుమారి నిశిత బుద్ధిని గమనించి అందరూ ఆశ్చర్యం పొందారు! మహారాజు సగర్వంగా కుమార్తెను చూసి ఇలాగన్నాడు. “కుమారి చెప్పిన విషయాలు చాలా సమంజసంగా ఉన్నాయి!” అని.
భర్త్రుదారిక ఒక సామ్రాజ్యానికి మంత్రి పదవిని అధిష్టించదగిన వ్యక్తి ! ఆమె తర్కవాదం చాలా అద్భుతంగా ఉంది. కాని విశాలక్ష బాబు తన పథకం లోని దోషాలను కనిపెట్టక పోలేదు! అతడు స్వకార్యాచరణలో ఎంత మోసమైనా మార్గాలనయినా అవలంబించడానికి వెనుకంజ వేయడు. అతని పథకం లోని అంతరార్థం ఇలా ఉండవచ్చు.
1 .శ్రీశైల మహామండలాన్ని ఇరావతికి ఇవ్వడం. 2 . చిత్రకూట రాష్ట్రాన్ని నిశుంభుని వశం చేయడం. 3. ఆంద్ర రాష్ట్రాన్ని భోగనాథునకు వదిలి వేయడం 4 . పార్వతీయ మండలాన్ని తిరిగి కళింగులకే సమర్పించడం.
“వీటి కోసం అగ్రనాయకులు ఆంతరంగికంగా వేసుకొన్న రహస్య పథకమై ఉంటుంది. అమరసేనునికి వారు చూపించినది త్రిశంకు స్వర్గమే! రాజనీతి తెలియని మూర్ఖుడు, దురాశాపరుడు అమరసేనుడు. వాడు విశాలా క్షుని చేతిలో కీలుబొమ్మ! ఆ బొమ్మను కావలసినప్పుడు ఆడించి, అవసరం తీరగానే భగ్నం చేయడం వింత కాదు కదా?” అన్నాడు మహామంత్రి.
రథిని మహామంత్రి తెలివి తేటలకి మనస్సులోనే ఆనందించింది!
“అయితే ఇప్పుడు మనమేమి చేయాలి?” అని ప్రశ్నించాడు మహారాజు.
“మహాప్రభో! ఏలినవారు సంపూర్ణ మంత్రి సదస్సును ఏర్పరిచి కొన్ని అసాధారణ ప్రకటనలు చేయాలి.1. సర్వ సేనాపతికి సర్వవిదాలైన సైనిక చాలన హక్కులనూ ఇవ్వాలి. 2. ఆక్రమిత ప్రాంతాలలో రాజకీయ నిబంధనలు చేసుకొనే హక్కులు అతని అధీనం చేయాలి. 3 . కుట్రదారులుగా పరిగణింపబడిన అనుమానితులని వెంటనే బంధించడానికి రాష్ట్రియునికి సంపూర్ణాధికారం ఇవ్వాలి.4.సామ్రాజ్య ఉత్తరాదికారి విషయం వెంటనే తీర్మానం చేయాలి. 5.రాష్ట్రంలో ఆహారోత్పత్తి కావించడానికి తగిన సంస్థను ఏర్పాటు చేయాలి. 6 . యుద్ధానికి కావలసిన దానం సేకరించడానికి ఒక ప్రబలమైన పథకం ఏర్పాటు చేసే ధన సేకరణ సంస్థను ఏర్పాటు చేయాలి. 7 . ప్రజలలో నుండి సైన్యంలో చేర్చుకోవడానికి ఒక సైన్య సేకరణ ఉప సంఘాన్ని నియమించాలి.”
“ ఈ పైన చెప్పిన శాసనాలన్నీ చిత్రకూట రాష్ట్రంలో కూడ అమలుపరచ వలసినదిగా మహామందలేశ్వరునికి ఉత్తర్వులు జారీ చేయాలి. ఇవే ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్య కార్య కలాపం.” అన్నాడు మహామంత్రి.
‘ఇందులో నాది ఒక చిన్న మనవి ఉంది. సేనాధిపతులను ఇద్దరిని నియమించాలి. ఒకడు ఆంధ్ర రాష్ట్రం లోను, ఇంకొకరు చిత్రకూట రాష్ట్రం లోను ఉండాలి. ఆంద్ర రాష్ట్రంలో నేను ఉన్నాను. చిత్రకూట రాష్ట్ర సర్వ సేనాధిపతిగా ప్రమథనాథ బాబుని నియమిస్తే చాలా మంచిది!” అని అన్నాడు కాలనాథుడు. అందరూ ఆ సలహాను ఆమోదించారు.
“మహామంత్రీ! ఈ రోజు మధ్యాహ్న భోజనానంతరం పూర్ణ మంత్రి సదస్సును ఏర్పాటు చేయండి.” అని ఆదేశించాడు మహారాజు.
“చిత్తం, అలాగే చేస్తాను” అని పలికాడు మహామంత్రి.
********************************

Comments
Post a Comment