ఆంద్ర రాష్ట్ర రాజధాని శ్రీకాకుళ వాతావరణంలో ఉష్ణోగ్రత హెచ్చింది. ఆబాల గోపాలం ఆ ఉష్ణోగ్రతకు గురి అయ్యారు. ఎక్కడ చూచినా ‘యుద్ధం’ అనే నాదం బయలుదేరింది. ఆ ఉష్ణోగ్రతకు ప్రతీ ఆంద్ర యువకుని రక్తం పొంగి సుళ్ళు తిరిగింది. తండోపతండాలుగా యువకులు సేనలోచేరుతున్నారు రైతులు విరివిగా వ్యవసాయం కొనసాగించి ధన్యాదులు ప్రభుత్వానికి ఇవ్వడానికి కంకణం కట్టుకొన్నారు. రాజధానిలో ధనిక వర్గం వారు యాభై కోట్ల మొహరీలు ప్రభుత్వానికి యుద్ధ నిదిగా సమకూర్చడానికి నడుం కట్టారు. కాందులు తమ కుటుంబాలకు సరిపోయే సాలుసరి పంటను కేటాయించుకొని మిగులు పంటను విరాళంగా ప్రభుత్వ పరం కావిస్తున్నారు.
మహిళా సంఘ పర్యవేక్షణ క్రింద యక్షగాన బృందాలు, వీధి భాగవత దళాలు, నాట్య ప్రదర్శన సంఘాలు, సంగీత కచ్చేరీలు, తయారు అవుతున్నాయి. ఇవన్నీ సైనికులకు వినోదం, ఉత్సాహం కలిగించడానికి ఉద్దేశింప బడ్డాయి. ఇవి రణ రంగాలకు సైన్య దళాలతో సహా పయనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
అక్షోభ్యముని ఆధ్వర్యాన క్షతగాత్ర చికిత్సాదళం ఏర్పాటయింది. మహిళా వర్గానికి అధ్యక్షురాలు వ్రణ చికిత్సా నిపుణురాలు కాత్యాయని. సుమారి ఐదువేల మంది స్త్రీ పురుషులతో కూడిన ఈ శాంతిసేన రాత్రిం బవళ్ళు కృషి చేసి, మూలికా భస్మాలు, తైలాలు, లేహ్యాలు, ఆసవాలు, అరిష్టాలు మొదలైన వాటిని తయారు చేస్తోంది. దీనికి అంతటికీ ప్రబల కోటీశ్వరుడైన సముద్ర గుప్తుడు సహాయం చేయబూనుకొన్నాడు.
విప్లవంలో పాల్గొన్నట్లు అనుమానించిన వారినందరినీ రాష్ట్రీయ ఘనేంద్రుడు చెరసాలలో బంధించాడు. మాజీ మహామంత్రి సునందుని భవనం రక్షిజనుల వశం అయిపోయింది. లోపలికి వెళ్ళినవారు బయటకు వెళ్ళ కూడదు లోపల ఉన్నవారు బయటికి రాష్ట్రియుని అనుమతి లేనిదే రాకూడదు. భ్రుంగాలక చేటీ జనాధ్యక్ష పదవి రద్దు చేయబడింది. సునంద బాబు సస్థానం తాత్కాలికంగా ప్రభుత్వ పరం అయిపోయింది. అతని నరిష్టా సదసత్పతి పదవి రద్దు కావించబడింది.
ఉపసదసత్పతి కాశ్యప ప్రమతి ప్రభుత్వానికి సకాలంలో విన్నపం పంపుకొన్నాడు. అందులో తాను భోగనాథుని పక్షంలో అతని ఉత్తరాదికారి సమస్య పట్లనే శ్రద్ధ పూనినట్లూ, ప్రభుత్వాన్ని కూలద్రోసే విప్లవంలో తనకి ఏమాత్రం సంబంధం లేనట్లు ఉదహరించాడు. భోగనాథుడు కుట్రలో మనిషి అని ఎప్పుడైతే తెలిసిందో, ఆ రోజు మొదలు తాను పూర్తిగా ఆ పక్షాన్ని వదలు కొన్నట్లు కూడా వ్రాసుకొన్నాడు. ఆ విన్నపం లోని విషయాలను పూర్తిగా పరిశోధించి రాష్ట్రియుడు కాశ్యప ప్రమతిని రాజద్రోహుల పట్టికలో నుంచి తీసేసాడు. మహారాజు అతనినే నరిష్టా సదసత్పతిగా నిర్ణయించాడు.
సునంద పుత్రుడు వీరనందుని ప్రాసాద కార్యదర్శి పదవి అంతరించింది. అతడు తన తండ్రితో సహా కులాసా ఖైదు అనుభవిస్తున్నాడు.
పూర్ణ మంత్రి సదస్సు కూడింది. ఆ సభకు నరిష్టా సదసత్పతి ప్రమతిని కూడ ఆహ్వానించారు. మహాన్యాయస్థాన ప్రాడ్వివాకులందరూ ఆహ్వానింప బడ్డారు. ఉభయ గురుకులాచార్యులు విషమ సిద్ది, భవనందులు కూడా సభలో సన్నిహితులయ్యారు. ఆ మహాసభకు అధ్యక్షుడుగా మహాప్రాడ్వివాక శివదత్త సూరిని ప్రతిపాదించాడు మహా మంత్రి మల్లికార్జునుడు. అతని ప్రతిపాదనను బలపరిచాడు బ్రహ్మకుల పరిషత్పతి ధర్మపాలుడు. సభికుల హర్ష ధ్వానాల మధ్య శివదత్త సూరి అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. మహారాజ సుచంద్ర భట్టారకుడు శివదత్త సూరి ప్రక్కన ఉన్నతాసనంలో ఉపవిష్టుడు అయ్యాడు.
స్త్రీలకు ప్రత్యేకించ బడిన వేదికపై రథినీ కుమారి, రాజకాళి, కాత్యాయని కూర్చొని ఉన్నారు. మహారాణి లీలావతికి ఆహ్వానం పంపబడింది గాని ఆమె సభకు రాలేదు. స్త్రీల వేదిక పట్టు తెరలతో మూయబడి ఉంది. ఆ తెరలోనుంచి సభాకార్యక్రమాన్ని ధారాళంగా చూడ వచ్చును!
సింహాసనోత్తరాదికారి సమస్యా నిర్ణయం ప్రారంభ మయింది. అధ్యక్షునిచే అనుజ్ఞాతుడై ధర్మపాల సూరి వేదిక పైకి వచ్చి రాజ ప్రకటనను ఏ విధంగా చదివాడు.
“అస్మత్కుల దేవతయైన భవానీ మాతను స్మరించి, మాననీయ కీ:శే: మహారాజ పరమేశ్వర కౌండిన్య పర్వత స్వామి భట్టారకుల చరణ రాజీవములకు తలంచి, ఆంద్ర సామ్రాజ్యాదిష్టిత మహారాజ పరమేశ్వర సుచంద్ర భట్టా రక నామధేయుడనైన నేను నా మనస్సాక్షికి సత్యమని తోచిన ప్రకటనను, నా ఘనత వహించిన న్యాయస్థాన ప్రాడ్వివాక మండలి సమక్షమునను, గౌరవనీయులైన ప్రజాప్రముఖుల ముందటను ఉద్ఘాటించు చున్నాను.
నేను యువరాజుగా ఉండిన రోజులలో నంది దుర్గమందు నా కంటికి, భువనమోహన సుందరి అయిన నిర్మల అను కన్యక తారసిల్లింది. మేమిద్దరమూ ప్రేమించుకొని శాస్త్రీయమైన పద్ధతిలో వివాహం చేసుకోన్నాము. అయితే నా నిజ పరిచయాన్ని, నన్ను నేను శత్రు సైనిక చాలనము నుండి కాపాడుకోవడానికి రహస్యంగా ఉంచవలసి వచ్చింది! ఆ వివాహానికి నందిదుర్గ దండనాయకుడు కీ:శే: నందిసేన దొర, నా బాల్య మిత్రుడు దండనాయక బలభద్రుడు సన్నిహితులై ఉన్నారు. ఆంగీరస సోమేశ్వరుడు తన భార్య కాత్యాయనితో కలసి తమ పెంపకపు కుమార్తె నిర్మలను నాకు కన్యాదానం చేసాడు. నేను పైన ఉదహరించిన వారందరి సమక్షంలో శాస్త్ర విధానంగా వివాహమైనట్లు పత్రం వ్రాసి దానిపై కౌ:సు: అని సంతకం పెట్టి ఇచ్చాను. ఆ పత్రంమీద సాక్షి సంతకాలు చేసారు.
నా తండ్రి కుంతలా దేశాదీశుని ఓడించి రాజధానికి మరలి వచ్చి క్షతగాత్రుడై మరణ శయ్యలో ఉండి నన్ను వెంటనే రావలసిందిగా కబురు పెట్టారు. నేను రాజధానికి మరలి వచ్చాను. రాజకీయమైన కొన్ని ఇబ్బందులకి లోబడి నేను నా వివాహిత భార్యను నిర్మలా దేవిని విస్మరించాను.
ఆ నిర్మలదేవియే ప్రస్తుతం రాజధానిలో ప్రసిద్ది చెందిన కవీశ్వరి రాజకాళి అని నేను అనేక నిదర్శనాల వల్ల తెలుసుకొన గలిగాను!
నిర్మలదేవిని నేను వదలి వచ్చినప్పుడు ఆమె గర్భిణిగా ఉండింది. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అతడే ప్రస్తుతం ఆంద్ర రాష్ట్ర సేనా వాహినికి సర్వాసైన్యాధిపతి అయిన కాలనాథుడని కూడా నేను అనేక నిదర్శనాల వలన తెలుసుకొన్నాను!
నేను మీ అందరి సమక్షంలో రాజకాళి ఉరఫు నిర్మలా దేవిని నా వివాహిత భార్య అనీ, సర్వసేనాపతి కాలనాథుని మాకు కలిగిన పుత్రుడని ప్రకటిస్తున్నాను.
కాబట్టి మీరు అందరూ నేను ప్రకటించిన అంశాల యథార్థాన్ని బాగా విచారించి, నా జ్యేష్ట కుమారుడైన కాలనాథుని నా అనంతరము సింహాసనోత్తరాదికారిగాను, నా భార్య రాజకాళి ఉరఫు నిర్మలా దేవిని పట్టమహిషిగాను తీర్మానింప గోరుతున్నాను.
ప్రకటన చదివి ముగించి ధర్మపాల సూరి తన ఆసనం పైన కూర్చొన్నాడు. శివదట్ట సూరి సాక్షి విచారణకు పూనుకొన్నాడు.
అక్షోభ్యముని సాక్ష్యం ఈ విధంగా ఉంది:
అక్షోభ్యముని ఇంద్రతీర్ధం వైద్యం నిమిత్తం వెళ్ళాడు. ఒకనాడు అతడు దారిన పోతూ ఒక విషాదకరమైన దృశ్యం చూసాడు. ఆర్య సుదర్శనుని ఇంటి అరుగు మీద ఎవరో పడుకొని ఉన్నారు. ఇంతలో హడావుడిగా ఒక స్త్రీ ఆ అరుగు దగ్గరకు వచ్చి, తన చేతిలోని శిశువును పడుకొని ఉన్న వ్యక్తీ ప్రక్కన పరుండ బెట్టి, ఒక్క ఉదుటున కృష్ణానది దిక్కుగా చర చరా నడక సాగించింది. అక్షోభ్య ముని సందేహించి శిశువు దగ్గరకు వెళ్లి చూసాడు. అది మగ శిశువు! నిద్రపోతున్నాడు ఆ చిన్నారి బాలకుడు! అక్షోభ్య ముని ఆ వ్యక్తి ముసుగు తొలగించి చూసాడు. ఆ వ్యక్తి మరణించి ఉన్న ఒక స్త్రీ!! వెంటనే వేగంగా నడిచి వెళ్తున్న స్త్రీని అనుసరించాడు. ఏమాశ్చర్యం!! ఆమె నిండుగా పారుతున్న కృష్ణా నదిలో దూకింది! మరేమీ ఆలోచించకుండా అక్షోభ్యముని కూడా కృష్ణలో దుమికాడు. ఎవరో అనుసరిస్తున్నారని పసిగట్టిన, ఆ స్త్రీ శీఘ్ర గమనంతో ఈదుకొంటూ వెళ్లింది. ఇట్లా నీటిలో ధావన కాండ కొన్ని ఘడియలు సాగింది. కొసకు అక్షోభ్య ముని గెలిచాడు. ఆ స్త్రీని పట్టుకొని ఒడ్డుకి చేర్చాడు. అప్పుడా స్త్రీ పూర్తిగా అలసిపోయినందున స్పృహ తప్పింది. ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి చికిత్స చేసి ఉన్మాదాన్ని పోగొట్టాడు. ఆమెకు రాజకాళి అనే పేరుకూడా పెట్ట్టాడు. ఇట్లా ఉండగా ఒకనాడు భగవాన్ జటాముని అక్షోభ్య ముని ఆశ్రమానికి వచ్చాడు. అతడు రాజకాళి నా కుమార్తె, అని చెప్పాడు! ఆమె భర్త మహారాజు సుచంద్రుడు అని వెల్లడించాడు. అతడు తన కుమార్తె కోరికపై మహారాజుకి యక్షిణీ విద్య ఉపదేశించి రాజకాళినే మంజులా యక్షిణిగా మార్చి, ప్రతి మంగళ వారం మహామారీ మందిరంలో కలసుకోనేటట్లు చేసాడు! మహారాజ సుచంద్రుడు నిర్మలకు ఇచ్చిన బంగారు పిడి గల రత్న స్థగితమైన బాకును, వివాహ ప్రమాణ పత్రాన్ని అక్షోభ్యమునికి ఇచ్చాడు జటాముని.
సాక్షి విచారణ ముగించే సందంర్భంలో శివదత్త సూరికి ఆ బాకును, పత్రాన్ని ఇచ్చాడు అఖోభ్యముని.
శివదత్త సూరి ఆదేశ ప్రకారం ప్రమథనాథుడు వేదిక పైకి వచ్చి సభాసదులకు నమస్కరించి ఇలా అన్నాడు:
“మన ఆంధ్ర రాష్రంలో కుల స్త్రీలకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది! ఒక కుల స్త్రీ అసాధారణ సందర్భాలలో తన సాక్ష్యం ఇవ్వ వలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సాక్ష్యం మూలంగా తన అభిజాత్యానికి భంగకరమైన విషయాలు చెప్ప వలసిన సందంర్భం ఏర్పడినప్పుడు, ఆమె భర్త అనుమతి తీసుకొని మహా న్యాయస్థానం వారిచే నియమింప బడిన ముగ్గురు ప్రాడ్వివాకులు ఆమె సాక్ష్యాన్ని తీసుకొని న్యాయ స్థానంలో సాక్ష్య పత్రాన్ని దాఖలు చేయవచ్చు! అట్టి సాక్ష్య పత్రాన్ని మీ ముందర నేను చదవడానికి మహా ప్రాడ్వివాక శివదత్త సూరి అనుజ్ఞ దయచేశారు! ఈ సాక్ష్యాన్ని అతి ప్రయాస మీద నేను సేకరించినందున దానిని చదవవలసిన అగత్యం నాకు ఏర్పడింది! సాక్షి పేరు మనోహారిణి. ఆమె వీరభద్రావధాని గారి భార్య! నాగుల పురోహితుడైన కాశ్యప దేవకీర్తి చెల్లెలు. ఇక మీ సమక్షంలో ఆమె సాక్ష్యాన్ని చదువుతున్నాను” అని చదవసాగాడు అతను.
“నా పూర్వ నామం శ్యామల, అవధాని గారిని పెండ్లాదినప్పుడు నా పేరుని మనోహారిణిగా మార్చుకొన్నాను.
నాకు తండ్రి లేడు, నా అన్న దేవకీర్తి శ్రీకాకుళంలో ఉండేవాడు. నేను మా అమ్మ ఇంద్ర తీర్థం గ్రామంలో ఉండే వారము. ఆ సమయంలో ఒక యువకుడు మా ఇంటికి కిరాయిదారుగా అద్దెకు వచ్చాడు. తాను బ్రాహ్మణుడ నని, తన పేరు కౌత్స సులోచనుడని చెప్పాడు. అతడు చాలా రూపసి! విధి వశం వలన ఇరువురికీ ప్రేమ ఏర్పడింది! నా తల్లి దృష్టి మాంద్యం గల మనిషి. నేను ఆ యువకునితో కలసి అమ్మ కన్నులు కప్పి చరించాను. నాకు గర్భం నిలిచింది. కొన్ని మాసాలు గడచిన తరువాత నా ప్రియుడు శ్రీకాకుళ నగరానికి పయనమై పోయాడు. పోతున్నప్పుడు నాతో ఏమీ చెప్పలేదు. అతడు వెళ్ళిపోయిన తరువాత అతడు మరచిపోయిన సంచి ఒకటి నాకు దొరికింది. ఆ సంచిలో కొన్ని కాగితాలు కనిపించాయి! అ కాగితాలను బడి పంతులుచె చదివించు కొన్నాను. దాని మూలంగా నా ప్రియుడు ఒక నాగ యువకుడని, అతని పేరు కౌళిక సులోచనుడని తెలిసింది. నాకు వాణి మీద జుగుప్స కలిగింది. నా గర్భం అమ్మకు తెలిసిపోయింది! ఆమె కొట్టింది, తిట్టింది, ఏడ్చింది. కొసకు నన్ను రహస్యంగా కాపాడింది. నేను ఒక మగ శిశువును కన్నాను. ఆ శిశువు ఏడవ రోజునే మరణించింది.
ఆ ఘటనతో నాకు బ్రతుకు మీద రోటా పుట్టింది. అదే సందంర్భంలో ఒక రజకుడు నా ప్రియుని వద్ద నుండి ఒక లేఖ తెచ్చాడు. ఆ లేఖను బడి పంతులుచే చదివించాను. ఆ లేఖలో కౌ:సు: అని పొడి అక్షరాలతో చేసిన సంతకం ఉంది! నేను ఆ రోజు రాత్రి అ జాబును పట్టుకొని వీధి వైపు వచ్చాను. సుదర్శన బాబు గారి ఇల్లు మా ఇంటికి ఎదురుగానే ఉండేది! ఆ ఇంటి అరుగు మీద ఒక స్త్రీ పరుండి మూలుగుతూ ఉండడం విన్నాను. నాకు ఒక ఉపాయం తోచింది ! ఎందుకు తోచిందో నాకు తెలియదు!! నేను వెంటనే వెళ్లి ఉత్తరాన్ని ఆ స్త్రీ పైట చెరుగున కట్టి, మారు మాట్లాడకుండా మా ఇంటి వాకిలికి వచ్చాను. ఇంతలో మరొక స్త్రీ అక్కడకి వచ్చింది! ఎదో మూటలాంటి వస్తువును ఆ స్త్రీ ప్రక్కన పడవేసి, పరుగు తీసింది!! ఆ స్త్రీ వెళ్ళిన తరువాత ఒక గడ్డాల పురుషుడు వచ్చి, ఆ మూటను తనిఖీ చేసి, పరుండి ఉన్న స్త్రీ ముసుగు తొలగించి పరీక్షించి, పరుగెత్తుతున్న స్త్రీని వెంబడించాడు. నాకు భయం వేసింది, ఇంటి లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టుకొన్నాను. ఇది జరిగిన ఒక సంవత్సరం నాటికి అవధానిగారికి నేను రెండవ భార్యను అయ్యాను. అతనికి ఈ విషయమంతా నన్ను పెండ్లి చేసుకోన్నప్పటికే తెలుసు కనుక నా వివాహంలో ఎలాంటి మోసం లేదు! ఈ సాక్ష్య పత్రం కూడ ప్రమథ నాథ బాబు ప్రోత్సాహంతో , నా భర్త అనుమతితో ముగ్గురు ప్రాడ్వివాకుల సమక్షంలో వ్రాయించాను.”
కొన సాక్ష్యంగా కాత్యాయని విచారించ బడింది. ఆమె సాక్షిబోనులో నిలబడి నిర్భయంగా తన సాక్ష్యాన్ని చెప్పింది. “ నిర్మలను పెంచింది నేనే! వరదల సందర్భంలో ఆ పిల్ల నా భర్తకు దొరికింది. రాజకాళియే నిర్మల అని నేను చాల కాలం క్రితమే తెలుసుకొన్నాను! నిర్మల కాంచన విగ్రహం, రాజకాళి శ్యామాంగ! ఈ రంగు భేదం కొన్ని రసాయనిక లేపనాల వలన ఏర్పడింది! మహారాజ సుచంద్ర భట్టారకుల వారే నిర్మలను వివాహం చేసుకొన్నట్లు నాకు అప్పుడు తెలియదు. కొన్ని మాసాల క్రిందట ఆ విషయం భగవాన్ జటాముని వల్ల తెలిసింది! నా భర్త మతి చలించి గ్రుః త్యాగం చేసిన సందర్భంలో నిర్మల నిండు గర్భిణి.
నేను నా భర్తను వెతికి తీసుకొని రావడానికి వెళ్లాను. అప్పుడు, ‘ఏకవీర అనే కొండ జాతి యువతి’ స్త్రీ పరంగా నిర్మలను విడిచి వెళ్ళిన మాట వాస్తవం! తరువాత నేను నంది దుర్గానికి రాక పోవడానికి ప్రబల కారణం ఉంది! నేను భర్తను వెతుకుతూ లాంగలీ నదీ తీరం వెంట వెళ్తున్నప్పుడు కళింగ దేశ రక్షి జనులు నన్ను ‘గూఢ చారిణి అన్న అనుమానంతో పట్టి బంధించి చెరసాలలో వేసారు. ఆ దిక్కుమొక్కు లేని చెరసాలలో నేను చాలాకాలం ఉండి పోయాను. రెండు సంవత్సరాల తరువాత నన్ను జటాముని చెరసాల నుండి విడిపించ గలిగారు. అది ఒక పెద్ద కథ! అతనే నాకు నిర్మల విషయం అనగా శ్రీకాకుళంలో నిర్మల, రాజకాళి అనే పేరుతో ఉన్నట్లు చెప్పారు. వివాహ ప్రమాణ పత్రాన్ని, బాకునీ తానూ సంగ్రహించి దాచాననీ, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెట్ట వచ్చనీ చెప్పారు. మహారాజే నిర్మల భర్త అని అతడు కొన్ని మాసాల క్రిందట శ్రీకాకుళం వచ్చినప్పుడు నాతోనూ, అక్షోభ్య ముని తోనూ చెప్పారు!”
సాక్షుల విచారణ ముగియగానే మహాప్రాడ్వివాక శివదత్త సూరి ఆసనం నుండి లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. “ నేను దీర్ఘ సూత్రిని అన్న అపవాదు చిరకాలం నుండి వాడుకలో ఉంది! ఆ వాదులో అసత్యం లేదు! ఈ విచారణ సందర్భంలో నా దీర్ఘ సూత్త్రత్వం మటుమాయమయింది! దానికి రెండు కారాణాలు ఉన్నాయి! ఒకటి ఉత్తరాదికారి సమస్యా విషయంలో గాని, మహారాజు గారి ద్వితీయ వివాహం గురించి గాని, ఆక్షేపణ చేస్తూ ఎవరూ కూడా ముందుకు రావడం లేదు!! రెండవది విచారించిన సాక్ష్యుల కథనాలలో అన్యోన్య విరుద్ధ కథనం లేదు!!! ఈ రెండు కారణాల వల్ల ప్రస్తుతం చర్చించ వలసిన సమస్య సులభంగా పరిష్కృతమై పోయింది!!
1 . రాజకాళియే నిర్మల అనడానికి ఆమెని పెంచి పెద్ద చేసిన కాత్యాయని సాక్ష్యం బలవత్తరమైనది.
2 . యువరాజుగా ఉన్న రోజులలో నిర్మలా దేవిని వివాహమాడినట్లు మహారాజు చిప్పి ఉన్నారు. శ్రీవారి కథనాన్ని అతడు వ్రాసి ఇచ్చిన వివాహ ప్రమాణ పత్రం, నిర్మలకు బహుమానంగా ఇచ్చిన బాకు, ఈ రెండూ బలపరుస్తున్నాయి. వివాహ ప్రమాణ పత్రం పైన సంతకం చేసిన వారిలో దండనాయక బలభద్ర బాబు ప్రస్తుతం చిత్రకూట రాష్ట్రంలో ఉన్నందున సభకు వచ్చి ఉండలేదు. కాని పత్రం లోని సంతకం, అతని సంతకమేనని నిర్దారితమైనది!
3 . అక్షోభ్యముని, శ్రీమతి మనోహారిణి –వీరి సాక్ష్యాలను బట్టి చని పోయిన స్త్రీ ప్రక్కన నిర్మలాదేవిచే విడిచిపెట్ట బడిన బాలకుడు, నిర్మలా దేవికి మహారాజునకు పుట్టియన్ వాడు అని నిర్ధారణ చేయవచ్చు. ఆ బాలకుడే ప్రస్తుతం ఆంద్ర రాష్ట్ర సేనావాహినీ అధ్యక్షుడైన కాలనాథ బాబు అనేది, పూర్వం కొలిక సులోచనుడు తెచ్చిన వ్యాజ్యంలో తీర్మానమైన విషయం!
ఈ పై అంశాలన్నీ సప్రమాణంగా రుజువైనందున మహారాజ పరమేశ్వర కౌండిన్య సుచంద్ర భట్టారకుల వారి ద్వితీయ కళత్రం శ్రీమతి రాజకాళి ఉరఫు నిర్మలా దేవి అని, ఆమె ఆంద్ర సామ్రాజ్యానికి సమ్మతమైన పట్టమహిషి అని, తీర్మానిన్చుతున్నాను. ప్రతత మహిషీ పుత్రుడైన శ్రీఅమాన్ కాలనాథ బాబు రాజకుమారు లలో జ్యేష్టుడు. కనుక జ్యేష్టుడు మరియు పట్టా మహిషీ పుత్రుడు అయిన కాలనాథ బాబు సింహాసనోత్త రాదికారి అని తీర్మానితము అయినది!!” అనిచెప్పి మహా ప్రాడ్వివాకుడు కూర్చొన్నాడు.
మహారాజ్ఞి నిర్మలాదేవికీ జై ! యువరాజ సర్వ సేనాపతి కాలనాథ బాబుకీ జై !! అని సభ ఒక్కుమ్మడిగా జయవాదం చేసింది. అంతటితో సభ ముగిసింది.
**********************
satya prabha 15 va bhagam ledandi
ReplyDelete