42 వ ప్రకరణము
మహానంది పురానికి ఈశాన్య దిశలో ఒక పెద్ద కోనేరు ఉంది. దానిలోని నీరు తామరాకులచే కప్పబడి బయటికి కన్పించదు ! కోనేరుకు నిండుగా తామర పువ్వులు, మొగ్గలు ఉన్నాయి.కోనేరు ఒడ్డున ఒక విశాలమైన పదహారు స్తంభాల మంటపం ఉన్నది.
రాత్రి మొదటి యామంలో చాలావరకు దాటింది. ప్రక్రుతి చీకటి తెరలో మాటు మణిగి ఉంది. చీరండల నాదం, నక్కల ఊళలు తప్ప వేరే అలికిడి లేదు!
తామరకొలను అవతల ఆవలిగట్టు ప్రక్కగా శ్మశానవాటిక ఉంది. పట్టణం అంతటికీ అదే శ్మశానవాటిక.
ఆ మంటపంలో ఇద్దరు మనుష్యులు కూర్చొని మాట్లాడు కొంటున్నారు. వారిద్దరూ నల్లని ఉడుపులు ధరించి చీకటితో ఐక్యం చెంది ఉన్నారు.
“వీరమల్లూ! నీవు చుట్టు ప్రక్కల బాగా పరికించి రా! అప్పుడు గాని అమనం మాట్లడుకోరాదు!”
“దొరా! ఎవరూ లేరు. చూసే వచ్చాను.”
“సరే! ఇప్పుడు నీవు విషయాన్ని సన్నని స్వరంతో వెల్లడించు.”
“దొరా! వారందరూ ఎల్లుండి అర్థరాత్రి వేళ దొడ్డి ద్వారంలో నుంచి కోటలోకి ప్రవేశించడానికి నిశ్చయించారు.”
“మొత్తం ఎంతమంది ఉంటారు?”
“నూరు మంది దొరా! వాందరికీ నాగసేనుడు నాయకుడు.”
“ నాగసేనుడా! మంచి గడుసువాడే, సాధారణంగా లొంగే రకం కాదు, ఆ తరువాత?”
“ ఆ నూరు మందిలో నేను ఒకణ్ణి, దొరా ! నేను మీతో పరిచయం కలిగి ఉన్న విషయం వారికి తెలియదు.”
“నేను ఈ ప్రాంతాల్లో ఉన్న విషయం వారికి తెలియదా?”
“ తెలుసు దొరా!”
“ ఆ తరువాత విషయం చెప్పు.”
“చోర పరమేశ్వరుడు భీమనాథ బాబు కౌండిన్యుల పక్షంలో చేరిపోయాడు. అతని కంట నీవు పడవద్దు.” అని నాగసేనుడు నన్ను హెచ్చరించాడు.
“మీ నూరు మందిలో మన పక్షం చేరేపోవలసిన వారు ఎవరైనా ఉన్నారా?”
“లేరు దొరా! అందరూ నాగజాతి వారినే చూచి నియమించాడు పెద్దదొర. నేను ఒక్కడినే భిల్ల జాతి వాణ్ణి. ఎల్లుండి రాత్రి మల్లిక అనే రాజకుమార్తె చేటిక దొడ్డిద్వారం తెరచి ఉంచుతుంది.”
“ మల్లికను మీరు ఎలా పట్టారోయ్?”
“వెండి చెప్పుతో మల్లికను మర్దించాము అని నాగసేనుడు అన్నాడు.”
“తరువాత ఏమి చేయదలచు కొన్నారు?”
“ఎల్లుండి రెండవ యామంలో పెద్దదొర ఐదువేల సైన్యంతో కోటను ముట్టడిస్తాడు. మేము నూరుగురం కోటలోని పహరాదార్లను మాటు మాయం చేసి కోట సింహద్వారం తెరచి ఉంచుతాము. కోట లోపలికి సైన్యం ప్రవేశిస్తుంది! వీర తాండవం కావిస్తుంది. ఈ ప్రకారం మహానంది పుర దుర్గం నాగుల వశమై పోతుంది.”
" కోటలో సైన్యం ఉండదా?”
“ ఉన్నా, లేనట్లే దొరా! కుంతల దేశపు దొర యుద్ధానికి వస్తాడని మా వారు విరివిగా ఒక వార్తను ప్రచారం చేసారు. మహామండలేశ్వరుడు సేనాపతి మాటలు నమ్మి దేశ భక్తులైన దండనాథులను సైన్యాలతో సరిహద్దు ప్రాంతాలకు పంపించాడు. సేనాపతి కారవేలుడు మా పక్షమై ఉన్నాడు. కాబట్టి కోటలో అట్టే చెప్పుకోతగ్గ ప్రతిఘటన ఉండదు!”
“సేనాపతి కుట్రదారులతో చేరడానికి మీవారేం ప్రలోభం చూపించారు?”
“రత్నప్రభా కుమారిని బలవంతంగానైనా పెండ్లి చేయించి కొంత జాగీరు ఇస్తామని ఆశ చూపించి ఉన్నారు.”
“మల్లూ! ఈ సైన్యం అంతా ఎక్కడనుంచి వస్తుంది?”
“ఈ ప్రాంతాల్లోనే చాలామంది నాగులు ప్రచ్చన్న వేషాలలో నాగరిక ప్రజల వలె ఉన్నారు దొరా! వారినందరినీ ఒకటిగా చేర్చుకొన్నాడు పెద్ద దొర.”
“మంచి చక్కని పథకం వేసాడు నిశుంభుడు! కాని ఈ ప్రాంతాల్లో మహా సింహం తిరుగుతున్నాడని తెలుసుకొన్నా, నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు వాడు తన పొరపాటుని గ్రహించుకో గలడు. సరే, మల్లూ! నీవు వెళ్ళవచ్చు. మళ్ళీ మనం ఎల్లుండి కోటలోనే కలుసుకొందాం.”
వీరమల్లు భీమనాథునికి అభివాదం చేసి వెళ్ళిపోయాడు. భీమనాథుడు ఆ మంటపంలో కొంత సేపు కూర్చొని ఆలోచనా ముద్రలో మునిగి పోయాడు. వాని మెదడులో ఆలోచనా తరంగాలు దొర్లిపోతున్నాయి. సాహస ప్రియుడైన ఆ ఆంధ్ర యువకుడు తనకు సమకూడిన అవకాశాన్ని ఆనంద ప్రఫుల్ల హృదయంతో స్వీకరించాడు.
శ్రీశైల మహామండలం అపాయకర పరిస్థితిలో ఉంది! అమాయకుడైన మహామండలేశ్వరుడు సత్యకర్మ ద్రోహి యైన తన సేనాధిపతి కారవేలుని నమ్ముకొని గొప్ప అగాధం అంచులో నిలబడి ఉన్నాడు. ఏ సమయంలో కాలు జారి పడతాడో అన్నట్లుంది అతని స్థితి!
ఆంద్ర సేనాపతికి భీమనాథుడు ఒక గూఢమైన లేఖ రాశాడు కదా? ఆ లేఖను అనుసరించి అతనికి సహాయంగా రెండు వందల మంది ఆరితేరిన యోధులు శతపతి కనకసేనుని నాయకత్వంలో వచ్చి ఉన్నారు. వారందరూ మారు వేషాలతో మహానందిపుర ప్రాంతాల్లో వేచి ఉన్నారు.
ఈ రెండు వందల మంది సైన్యంతో నిశుంభుణ్ణి ఎదిరించడం అవివేకమని తలచాడు భీమనాథుడు. ఈ విధంగా సాధ్యాసాధ్య విచారణలో పడిన భీమనాథునికి తాత్కాలికంగా ఒక ఉపాయం తోచింది! ఆ ఉపాయాన్ని అనుసరించి ఉత్తరోత్తర కార్యక్రమాన్ని సరిపెట్టు కోవడానికి తీర్మానించాడు.
భీమనాథుడు లేచి నగరాభిముఖుడై బయలు దేరాడు.
Comments
Post a Comment