Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాథ--23: బాపు వేసిన బొమ్మలతో సహా


శ్రీశైల మహామండలేశ్వరుని ఏకైక పుత్రిక ‘రత్నప్రభా కుమారి’ బుద్దిసాగర, భీమనాథులని  తన అభ్యంతర మందిరంలో కలుసుకొంది. చేటీ జనాధ్యక్షురాలు వసుంధరా దేవి కూడా ఆ సమావేశంలో సన్నిహితురాలు అయింది.

భీమనాథుడు రత్నప్రభా కుమారిని చూడడం అదే మొదటిసారి! ఆ మహోత్కృష్ట సుందరిని కంచి అతడు తన కన్నులు సార్థకత పొందినట్లు తలచాడు!

ఆమె సుకుమారాంగాల నిరుపమానం! చంద్రునికి వంక  పెట్టే ఆమె ముఖ మండలం అత్యుజ్వల కమనీయం! ఆమె తనూలత లావణ్యం పావన తరంగ రమణీయం! ఆమె అవయవాల వంపు సొంపులు నయన మాదకాలు!

ధీరుడైన భీమనాథుడు తన జీవితంలో మొదటి సారిగా చలించాడు!

భీమనాథుని మేఘ గంభీర సుందరాక్రుతి  రత్నప్రభా  రాకుమారి  హృదయంలో నూతన స్పందం పుట్టించింది. ఆమె చూపులు  రాగార్ద్రాలై తళుక్కుమని  మెరిసాయి.ఆమె నును చెక్కిళ్ళపై సిందూర ప్రభ భాసించింది!

“తాతగారూ! తమ దర్శనం నాకు లభించి చాల దినాలు అయింది. మనుమరాలి మీద  ఈనాటి కైనా మీకు దయ పుట్టినందుకు సంతోషం! వసుంధర ఏమేమో చెప్పింది. నాకు ఏమీ బోధ పడడం లేదు! “ అని చెప్పి

రత్నప్రభ తన కడగంటి  చూపుతో భీమ నాథుని చూసింది.

వృద్ధుడైన బుద్ది సాగరుడు వారిద్దరి భావ కల్లోలాన్ని గమనించనట్లు  నటించి, “కుమారీ! యితడు శ్రీకాకుళ వాస్తవ్యుడు. భగవాన్ జటాముని కుమారుడు! పేరు భీమనాథుడు! ఇతడెంత సుందర యువకుడో అంతటి  వీర పురుషుడు. ఇతని వీరత్వాన్ని నేను ఈ దినం నా కండ్లతో చూసాను ! ఇతని వల్లనే మన దేశం మహా విప త్తులో నుంచి ఈ దినం ఉద్ధరించ బడింది” అని జరిగిన విషయమంతా రాజపుత్రికి వివరించి చెప్పాడు.

రత్న ప్రభా కుమారి బుద్దిసాగరుని మాటలు శ్రద్ధగా విన్నది. ఆమె భీత దృక్కులు హృదయగత భయాన్ని ఎత్తి చూపెట్టాయి! ఏమి చెప్పాలో తెలియక ఆమె భీమనాథుని వంక చూసింది. ఆమె దృష్టిలో కృతజ్ఞతా భావం స్ఫుటమయింది!

ఇంతలో ఒక చేటిక పరుగు పరుగున అక్కడకు వచ్చింది. అందరి ద్రుష్టులూ ఆ వచ్చిన చేటికపై ప్రసరించాయి. “భర్త్రుదారికా! మహామండలేశ్వరుల వారు, భగవాన్ జటామునితో కలసి వస్తున్నారు!” అని చెప్పింది.

అందరూ తమ ఆసనాల నుండి లేచి నిల్చోన్నారు. మహామండలేశ్వర కౌత్స సత్యవర్మ భగవాన్ జటామునితో పాటు ప్రవేశించాడు.

భీమనాథుడు సాష్టాంగంగా తన తండ్రి పాదాలపై పడి పోయాడు. జటాముని తన కుమారుని లేవనెత్తి శిరస్సు మూకొన్నాడు.

అందరూ ఆసీనులయ్యారు.

“భీమా! నీవు శ్రీశైలానికి ప్రయాణం కట్టడం చాలా లాభించింది. నీవు జాగరూకతతో చేసిన పనిని మహామండలేశ్వ రుడు మెచ్చుకొన్నాడు. ఆ మహోపకారానికి బదులు తనకు అత్యంత ప్రియమైన వస్తువును సమర్పించు కొంటానని నాతో ఇప్పుడే చెబుతూ వస్తున్నాడు”  ఇట్లా చెప్పి మహాముని రత్నప్రభను చూసాడు.

భీమనాథుడు లేచి నిలబడి చేతులు ముకుళించి ఇలా అన్నాడు. “ భగవాన్! మహామండలేశ్వరుల వారికి అత్యంత ప్రియమైన వస్తువు చాలా అమూల్యమైనది అయి ఉంటుంది! అటువంటి దానిని స్వీకరించడానికి నేను వారికి చేసిన సేవ మహోత్కృష్ట మైనదయి ఉండాలి! నేను అంతటి ఘన కార్యం చేసానా అన్నదే నా సందేహం! ఒకవేళ చేసినా ఆ మహోత్కృష్ట మైన వస్తువుకు నేను పాత్రుడను అవుతానా లేదా అన్నది మరొక సందేహం!”

అందరూ మెల్లగా నవ్వుకొన్నారు. రత్నప్రభ సిగ్గుతో తలవంచుకొంది.

“ భీమనాథ బాబూ! దక్షిణా పథం లోనే కాదు యావద్భారత దేశంలో కీర్తింప బడుతున్న మహాయోగి భగవాన్ జటాముని పుత్రుడివైన నీవు అబిజాత్యంలో, గౌరవంలో అత్యుత్తమ శ్రేణికి చెందిన వాడివి. కనుక పాత్రాపాత్ర విచక్షణకు నీ పట్ల సందేహానికి తావు లేదు! నీవు మా కుటుంబానికి, మా దేశానికి ఈ రోజు కావించిన ఉపకారం ఎటువంటి ఘనమైనదో నా నోటితో నేను చెప్పలేను! ఈ రోజు మొదలు నీవు మా సర్వ సేనాపతివి! బుద్దిసాగరుడు మహామంత్రిగా ప్రతిష్టింప బడ్డాడు. మీ ఇద్దరి భుజ స్కందాల పైననే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇంకొక ఘడియలో ప్రస్తుతం రాష్ట్రం లోని సైన్యమంతా ప్రాసాద మైదానంలో కూడుతుంది. అందరు దండనాదులు, మంత్రుల సమక్షంలో పై ప్రకటనలు చేయబడతాయి. నీవు నేను ప్రసాదించిన పదవిని స్వీకరించి మా దేశాన్ని శత్రువుల బారి నుండి కాపాడాలని ప్రార్థిస్తున్నాను.

“మహాప్రసాదం!” అని ఒకే మాటతో తన సమ్మతిని ప్రదర్శించాడు భీమనాథుడు.

“భీమా! నీ కర్తవ్యం చాలా బాధ్యతతో కూడుకొని ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి పరాక్రమంతో పాటు సూక్ష్మ మైన రాజనీతి పరిజ్ఞానంకూడా ఉండాలి. ఇప్పుడు కుంతలదేశాధిపతి ‘విక్రమసేనుని’ సులభంగా పడేసుకొంది.   మహా చతురురాలైన ‘ఇరావతి!’ విక్రమసేనుడు యుద్ధ  ప్రస్థానానికి ముహూర్తం పెట్టుకొన్నాడు. ఈ అమావాస్య దాటిన సప్తమి నాడు వాడు ఇరావతితో కలసి, యాభైవేల సైన్యంతోతరలి వస్తున్నాడు. నిశుంభుని పరిస్థితి ఇప్పుడు కొంత ఇరకాటంలో పడి  ఉంది. అప్రతిభ పరాక్రముడైన కాలనాథుడు అప్పుడే దేవవాటికా దుర్గం సమీపించాడు. కాలనాథుడు ప్రజలచే, ‘ఆంధ్ర మహావిష్ణువుగా’  కీర్తింప బడుతున్నాడు! నీ పూజ్య సహోదరుడు అక్షోభ్యుడు వాణ్ని ఆ పదంతో కీర్తించి దేశమంతా ప్రచారం కావించాడు!! ఇవాళో, రేపో దేవవాటికా దుర్గం భయంకర రణరంగంగా మారి పోగలదు! ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా కనిపెట్టాడు నిశుంభుడు. ఇలాంటి పరిస్థితులలో  ఒక ఘడియ ఆలస్యం కూడా విపరీత పరిణామాలకి దారి తీస్తుంది! దేవవాటికలో ఉన్న దండ నాయకుడు పింగాక్షుని పరాక్రమం మీద నిశుంభునికి పూర్తీ నమ్మకం లేదు! కారణం ఏమిటంటే దండెత్తి వస్తున్నవాడు  ‘ఆంధ్ర మహావిష్ణువు!!’ ఈ కారణాన నిశుంభుడు ఐదువేల సైన్యంతో ఈ రోజే దేవవాటికా దుర్గానికి పయనమయ్యాడు.

 ఇక్కడ కారవేలుని సహాయం మీద నమ్మకంతో ఒక వేయి సైన్యాన్ని దండనాయక శివకీర్తి పరం చేసి వెళ్ళాడు నిశుంభుడు. ఇక్కడ ‘బలం భీమాభి రక్షితం’ అని వానికి తెలియదు!! శాంతి ప్రియుడైన మహామండలేశ్వర సత్యకర్మ  యుద్ధం ఎదురు చూడనందువలన ఆహారాది వస్తు సేకరణ విషయంలో దేశం కుంటుపడింది. ఆ పని యుద్ధంతో పాటు నీవే చేసుకో వలసి వచ్చింది! కుంతలేశ్వరుడు సీమోల్లంఘన చేయ గలిగితే నీ స్థితి చాల విషమిస్తుంది. కాబట్టి నీవు మహామంత్రి బుద్దిసాగరునితో కలసి బాగా ఆలోచించి ఆచరణ యోగ్యమైన విధానాన్ని అవలంబించాలి” అని సుదీర్ఘంగా విషయ స్పష్టీకరణ చేసాడు జటాముని.భీమనాథుడు సాభిప్రాయమైన దృక్కులతో తన తండ్రిని చూసాడు! ఆ చూపును బట్టి వాని హృదయగత భావాన్ని అవగతం చేసుకొని జటాముని ఇలా అన్నాడు.

“భీమా! నీ స్వదేశ విషయాన్ని విపులంగా వినడానికి ఇష్ట పడుతున్నావు, అది సహజమే! నీ తల్లి ఇప్పుడు శ్రీకాకుళంలో లేదు. ఆమె శ్రీశైల గిరి ప్రాంతం లోని  నా ఆశ్రమంలో ఉంది. నీ ధర్మ సోదరి రాజకుమార్తె రథినీ కుమారి తాతగారి సంస్థానాన్ని పొంది, కీ:శే: సేనాధిపతి రణంధరుని ప్రాసాదం లోనే ఉంది. ఆమె ఇప్పుడు మహామంత్రి మల్లికార్జునునికి ఇల్లాలై  వానికి మహామంత్రి స్థానాన్ని వహించి, విప్లవాన్ని తన నిశాత బుద్ది ఖడ్గంతో ఎదుర్కొం టోంది! భోగనాథుడు తన మామగారైన విశాలాక్షుని తోను, తన ప్రేయసి కుముదాక్షి తోను, కళ్యాణ దుర్గంలో ఉన్నాడు. వానికి కళింగేశ్వరుడు అండగా ఉన్నాడు. అప్పుడే  ఒకలక్ష సైన్యంతో రణ ప్రస్తాన భేరిని వాయించాడు కళింగేశ్వరుడు. ఆ ప్రాంతానికి అభిమన్యు పరాక్రముడు ప్రమథనాథుడు మహా సేనాపతిగా ఉన్నాడు. ప్రమథనాథుని ఖడ్గం ఎంత పడునైనదో అంత కంటే పది రెట్లు కలది వాని బుద్ది! కాబట్టి ఆంద్ర సామ్రాజ్య లక్ష్మి ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడ గుండెలపై చేతులు ఉంచుకొని నిద్ర పోగలుగుతోంది. విశాలాక్షుడు మగధ సామ్రాజ్యంలో కూడ విషబీజాలు నాటాడు! కాని మహామేధావి అయిన మల్లికార్జునుడు ముందు జాగ్రత్త వహించి మగధ మహామంత్రి రాక్షసా మాత్యునితో స్నేహభావం బలపరచుకొని తన దేశాన్ని మాగధుల దాడి నుండి తప్పించ గలిగాడు!

మగధ దేశానికి అంటి ఉన్న మన సరిహద్దు ప్రాంతాలకి రాజపుత్రుడు శక్తిధరుడు పంపబడ్డాడు. కుమార శక్తిధరుని అనునయ వర్తన చేత ఆ ప్రాంతం నుండి యుద్ధ భయం ఉండదని విశ్వసించ వచ్చు! నీ సోదరి నిర్మల (రాజకాళి) ఇప్పుడు ఆంధ్ర సామ్రాజ్య లక్ష్మికి సవతిగా పట్టమహిషి అయి శ్రీకాకుళం లోనే ఉంది. కీ:శే: సత్యరథుని కుమార్తె మణిమాల శక్తిధరుణ్ణి వరించింది. వారి వివాహం రథినీ కుమారి వివాహం ఒకేమారు జరిగాయి. కుమార కాలనాథుని ( ఆంధ్ర మహావిష్ణువు) ఆంద్ర సామ్రాజ్యానికి యువరాజుగా మహా న్యాయస్థానం ప్రకటించింది. వాని వివాహం కూడా జరగవలసింది . కాని వాని నాయిక ‘సత్యప్రభ’ ప్రస్తుతం శ్రీకాకుళంలో  లేదు! అదీకాక కాలనాథుడు (ఆంధ్ర మహావిష్ణువు) యుద్ధం ముగిసేవరకు వివాహానికి సమ్మ తించ లేదు! రాష్ట్రీయ ఘనేంద్రుడు ధరణిని వివాహం చేసుకొన్నాడు. వాడు ఇప్పుడు రాజధాని లోని సైన్యానికి అధినేతగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ఏ రంగానికి అయినా వానిని పంపడానికి మహారాజు నిర్ణయించుకొన్నాడు.”

రాజధానిలోని విషయాలు విని, భీమనాథుడు చాల సంతోషించాడు. ముఖ్యంగా తన అభిమాన వీరుడైన కాల నాథుడు ఆంద్ర మహావిష్ణువు బిరుదు పొంది, సామ్రాజ్యానికి వారసునిగా నిర్ణయింపబడిన వార్త విని, వాని హృదయం పులకించింది! ఉత్కృష్ట సుందరి సత్యప్ర్రభ , ఆంద్ర మహావిష్ణువును వరించడం వానికి ఆనందకరమైన వార్తగా ఉండింది !

“ ఈ సందర్భంలో నా విన్నపం మీరు చిత్తగించాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రసంగాన్ని మార్చి పలికాడు మహామండలేశ్వరుడు సత్యకర్మ.

“మహామండలేశ్వరా ! మీ కోరికను నేను గ్రహించాను. కుమారి వరణ స్వాతంత్రంపై  మనం ఒత్తిడి తీసుకొని రావడం ధర్మం కాదు” అన్నాడు జటాముని.

“ఈ విషయంలో నాది ఒక సలహా! అందరి సమక్షంలో కుమారి బిడియం చూపడం సహజం! కాబట్టి మనం ప్రక్కగది లోపలి వెళ్లడం మంచిది!” అన్నాడు బుద్దిసాగరుడు.

“ఈ సంవిధానం నాకు నచ్చలేదు. నేను మొరటు వీరుణ్ణి. నాకు స్త్రీలతో సంభాషించడం తెలియదు. స్త్రీ లోకంపై నాకు అమిత గౌరవం ఉంది. కానీ రహస్యంగా ఒక కన్యకతో మాట్లాడ లేను. భర్త్రుదారిక తన తండ్రితో బాగుగా ఆలోచించి చెప్పుకొనే అవకాశం కల్పించడమే మంచి పద్ధతి!” అని చెప్పాడు భీమనాథుడు.

అందరూ కుమారి రత్నప్రభ వంక చూసారు. రత్నప్రభ మెల్లగా ఆసనం నుండి లేచి నిల్చుంది. సిగ్గు దొంతరలతో పూచి వికసించిన ఆమె తనులత వింత శోభను ఇచ్చింది.

ఆమె జటామునిని సమీపించి వంగి అతని పాదాలు ముట్టి నమస్కారం చేసింది. జటాముని ఆమెను లేవనెత్తాడు.

“భగవన్! నన్ను ఆశీర్వదించండి. ఏ కారణం చేతనో మాట్లాడలేకున్నాను. నాకు తల్లి లేదు, ఆ స్థానాన్ని మీరు తీసుకొని నన్ను కృపతో చూసారు! నేను మీ కుమారుని మనఃపూర్తిగా ఆరాధించగలను” అని తడబడుతూ మెల్లగా ఉచ్చరించింది ఆమె!

అట్లా చెప్తున్నప్పుడు ఆమె కమ్మని కంఠం వణికింది, కంటి వెంట ముత్యాల వలె కన్నీటి బొట్లు రాలాయి.

“వత్సే! భగవాన్ ఇంద్రుడు నీకు నిండు సౌభాగ్యం ప్రసాదించును గాక!” అని ఆశీర్వదించి జటాముని ఆమె పాణిని భీమనాథుని చేతిలో పెట్టాడు. భీమనాథుడు తన పటిష్టమైన దక్షిణ హస్తంతో ఆ కిసలయ సదృశమైన పాణిని గ్రహించాడు.

ఈ విధంగా వివాహత్పూర్వంగా ప్రదాన క్రియ జరిగింది. అందరూ ‘మంగళం మహాత్’ అని పలికారు.

45 వ ప్రకరణం  

ఆ రోజు మధ్యాహ్నం భీమనాథుడు శ్రీశైల మహామండలేశ్వర సర్వ సేనాపతిగా నియమితుడైన విషయం రాష్ట్రమంతా వ్యాపించింది.

బుద్దిసాగరుడు మళ్ళీ మహామంత్రి అయినాడు. మహామంత్రిగా ఉంటున్న ధనగుప్తుడు, కారవేలుని అనుచరు లుగా సందేహింపబడిన దండనాదులు బంధింపబడ్డారు.

గ్రామ పంచాయితీదారుల మూలంగా ఆహార సేకరణ చేయడానికి మహామంత్రి బుద్దిసాగరుడు చతురులైన ఉద్యోగస్తులను నియమించాడు. విశ్రామ్తో తీసుకొంటున్న ఉప సేనాపతి భార్గవ సోమదత్తుడు తిరిగి యథాస్థానం ఆక్రమించాడు.

దండనాయక శివకీర్తి రాష్ట్రంలో సంభవించిన విపరీత పరిణామాలను బాగా పర్యాలోకించి కోటను ముట్టడించడం అవివేకమని తలచాడు. తలచినదే తడవుగా వాడు  సేనను సత్వరంగా నడుపుకొని దేవవాటికా దుర్గానికి పయనమై పోయాడు.

ఈ విధంగా నిశుంభుని రాష్ట్రాక్రమణ ప్రయత్నం నాందిలోనే కూలిపోయింది!

సరిహద్దు ప్రాంతానికి పదివేల సైన్యంతో వేలిన దళపతి అమృతభానునికి, రాష్ర్టంలో జరిగిన మార్పుల గురించి కుంతలేశ్వరుని సైనిక ప్రస్తానం గురించి వివరంగా తెలియపరిస్తూ మహామంత్రి బుద్దిసాగారుడు బేగీరావు టపా పంపించాడు.

సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సామంత దుర్గాదిపతులకు, సైన్యాన్ని జత కూర్చుకొని అమృతభానునికి సహాయంగా వెళ్లవలసినదిగా మహామండలేశ్వర సత్యకర్మ ముద్రలతో కూడిన తాఖీదులు పంపబడ్డాయి. భగవాన్ జటాముని వచ్చిన మరునాడు ప్రాతఃకాలం భీమనాథుని ఉత్తరువుని అనుసరించి రాష్ట్రం లోని సైన్యమంతా రాజప్రాసాదం లోని పెద్ద మైదానంలో సమావేశమయింది. ఇరవై ఐదువేల చతురంగ బలం బారులు తీరి నిలబడి ఉంది! అలలు లేక స్తంభించిన మహాసముద్రం లాగ ఆ సేనావాహిని చూడ ముచ్చటగా ఉంది.

సేనావాహినికి మధ్య భాగంలో ఉన్నతమైన వేదికపై సర్వ సీనాపతి భీమనాథుడు లోహ కవచదారి అయి వీర సామ్రాజ్య పతాక లాగ నిల్చొని ఉన్నాడు. అతని ప్రక్క ధవళ వస్త్రాలు ధరించి శుభ్రకీర్తి వలె మహామంత్రి బుద్ది సాగరుడు నిలబడి ఉన్నాడు.

మహామంత్రి  సైనికులని ఉద్దేశించి మాట్లాడాడు. అతని ప్రసంగాన్ని పొడుగుపాటి కంచుబూరల మూలంగా అందరికీ వినపడేటట్లు  ఉద్ఘాటిస్తున్నాడు మహాప్రతీహారి.

“ఆంద్ర వీరులారా! శాంతి భధ్రతలతో, సుఖ సంతోషాలతో మన ఆంద్ర సామ్రాజ్యం సుమారు అర్థ శతాబ్దంగా ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని మనకు ప్రసాదించింది. మన సామ్రాట్టు శ్రీ కౌండిన్య సుచంద్ర భట్టారకుల వారి పరాక్రమానికి వెరచి, పరదేశ రాజులు ఇన్నాళ్ళూ మిత్ర భావంతో మెలుగుతూ వచ్చారనడంలో అతిశయోక్తి లేదు! కొన్ని సంవత్సరాలుగా మన దేశం లోని కొందరు దురాశాపరులు రాజ్యకాంక్షా పిశాచానికి దాసులై విప్ల వాన్ని లేవదీసి దేశం లోని శాంతిని భంగపరిచారు. వారందరూ మన దేశ ప్రజలుగా ఉన్నందున మన సామ్రాట్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా కాలక్రమంలో వారిలోని దురాశాభావం శాంతించవచ్చని ఓర్మివహించింది. కాని దురదృష్ట వశంచే వారి ఉద్దేశాలలో మార్పేమీ కలుగలేదు సరికదా, పైపెచ్చు ఆందోళన కలిగించే క్రూరచర్యల చేత, పరరాజుల సహాయం అభ్యర్థించటంచేత, మన దేశాన్ని విపరీతమైన సందిగ్ధావస్థలోకి తెచ్చిపెట్టారు. మన సార్వభౌమ ప్రభుత్వం విప్లవాన్ని చిన్నాభిన్నం చేయడానికి భారీ ఎత్తున సైనిక చర్యకు పూనుకొంది...

“.. ఇట్లా ఉండగా మన రాష్ట్రంలో మిత్ర భావాన్ని ప్రకటిస్తూ మీ మాజీ సేనాధిపతి కారవేలుడు మన దేశాన్ని పరరాజు కబంధ హస్తాలకు సమర్పించడానికి నిశుంభునితో కలసి కుట్రలు పన్నాడు! వాని దుర్మార్గ చర్యలు కనిపెట్టి ఇదుగో మీ ఎదుట నిలబడి ఉన్న  శ్రీ కాంకోల భీమనాథుడు మహామండలేశ్వరుని సరయిన సమ యంలో హెచ్చరించి, తానే సర్వ బాధ్యతలు పూని ఇప్పుడు సర్వ సేనాధిపతి హోదాలో సమావేశ పరిచాడు. మీరు ఇతని నాయకత్వాన మీ దేశ ప్రతిష్టని, శాంతిని పునరుద్ధరించండి. ఈ విషయంలో మేరు వెనుకంజ వేయరని నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది.”

“తప్పక ముందుకి దుముకుతాము! మా ప్రాణాలు అర్పించి మాతృదేశాన్ని రక్షించు కొంటాము” అని సముద్ర ఘోష లాగ సేనలో కలకలం ఏర్పడింది!

భీమనాథుడు మేఘ గంభీర ధ్వనితో ఈ విధంగా ప్రసంగించాడు.

“శ్రీశైల ఆంద్ర వీరులారా! జాతిమత వైషమ్యాలు గాని, చిన్న పెద్ద తారతమ్యాలు గాని పాటించకుండా మీరందరూ  కలసి ఖడ్గబాంధవ్యం ఒక్కటే మనస్సులో పెట్టుకొని ఏకాగ్ర చిత్తంతో ప్రవర్తించవలసిన సందర్భం ఏర్పడింది.మీలో  ప్రవహిస్తున్న రక్తం, మీరు శ్వసిస్తున్న గాలి, మీరు భుజించే ఆహారం, వీటిని మీకు నిరంతరం చేకూరుస్తున్నది ఎవరు? అదే మీ దేశమాత! మీ దేశమాత పరహస్త గతమై అవమానం పొందడం సహింప గలరా? మధురాతి  మధురమైన, గౌరవాతి  గౌరవమైన మీ దేశమాతకు  గుండెలపై పోతూ పొడవడానికి వస్తున్నారు శత్రువులు! అది చూస్తూ మీరు శాంతి పాఠాలు వల్లించగలరా? అది అసాధ్యం! ఆంధ్రుల ప్రతిభను నాలుగు మూలలా స్థాపిం చండి. మీ కత్తుల వేడిలో శత్రు శలభాలు మలమల మాడేటట్లు చేయండి. ఆంధ్రుడు శాంతి ప్రియుడు!

అయినా రణ రంగంలో వెనుకంజ వేయజాలడు, అని సత్యాన్ని నిరూపించండి. ‘ధర్మమే జయతి’ అన్న వాక్యం గుర్తు ఉంచుకోండి. మీ పట్ల ధర్మం పూర్తిగా ఉంది. మీరు పరరాష్ట్రాన్ని కోరలేదు! మీ దేశాన్ని పరుల దురాక్రమణ నుండి కాపాడుకోవడానికి మీరు కత్తులు ధరించారు! మీరు ధర్మపథం లోనే ఈ రణ యజ్ఞానికి ఆధ్వర్యం వహిం చారు! ధర్మ బద్ధమైన మీ కత్తులు రణ రంగంలో శతాధిక వీర్యంతో నాట్యమాడుతాయి! మీ భావిని మీరే నిర్ణ యించుకొనే తరుణం ఇది! మీరు ప్రాణ భయం, స్వార్థం, పరిత్యజించి ఏకైక మనస్సుతో లక్ష్యంతో మన దేశ మాత స్వాతంత్రాన్ని ఉద్దేశించి ఘోర సంగ్రామంలో ప్రతిభను, ఓర్మిని, నేర్పును, వీరత్వాన్ని చూపించండి. కార్య దీక్షలో మీ అందరి మనస్సులూ  ఏకీభవించినప్పుడు ఒక్క కుంతల దేశమే కాదు,అశేష భరత ఖండమైనా రణరంగంలో తేరి చూడలేరు! మిమ్మల్ని నడిపించే సైన్యాదిపతులను ఒక్క అక్షరం తప్పకుండా అనుసరించండి. అదే ప్రతీ సైన్యానికీ విజయస్తంభమనే మాట మరచిపోకండి.

మన జయఘోషణ ఎటువంటిది? ‘జై ఆంద్రవిష్ణు!’ ఇది మన జయనాదం! కారణం చెబుతున్నాను వినండి. నిశుంభుడు రాక్షస తుల్యుడు, తుల్యుడే కాదు.. వాని రక్తంలో రాక్షస స్త్రీ రక్తం ప్రవహిస్తోంది!! అట్టి భయంకరుడైన రాక్షసుని హతమార్చడానికే పుట్టాడు ఆంద్ర సామ్రాజ్య సేనా వాహినికి అధ్యక్షుడు యువరాజు కాలనాథుడు. అతడు మహాయోగిని అయిన ఆంధ్ర సామ్రాజ్ఞి రాజకాళి కుమారుడు. అతడు విష్ణ్వంశ సంభూతుడై పుట్టినట్లు భగవాన్ జటాముని తెలుసుకొన్నారు! కాబట్టి కాలనాథునికి ‘ఆంద్ర విష్ణు’ అనే పవిత్రనామం సిద్ధించింది ! అతని నాయకత్వాన మనం దేవాసురలను కూడా ఎదిరించగలం. ఏదీ, మీ కత్తులు దూసి జయగానం చేయండి.”

వెంటనే పాతికవేల ఖడ్గాలు భయంకర చీత్కారంతో ఒరల లోంచి బయటికి వచ్చి మెరిసాయి! సేనావాహిని “ఆంద్ర మహావిష్ణువుకీ జై ! సేనాపతి భీమనాథునికీ  జై! మహామండలేశ్వర సత్యకర్మ భట్టారకులకీ జై!”  అని ఏక కంఠంతో జయజయ ధ్వానాలు చేసారు. ఆ నాదంతో నభస్సు శబ్ద పూరితమై కత్తుల దాళదళ్యంతో మిళితమై వెలుగందింది.

46 వ ప్రకరణం

శ్రీశైల మహామండల రాజధాని మహానందిపుర ప్రాసాదం లోని బహిరంగ సభలో దండనాదుల సభ కూడింది. ఆసభకు సర్వసేనాపతి భీమనాథుడు అధ్యక్షత వహించాడు. సభలో సైనిక చాలనం గురించి వివరంగా చర్చ జరిగింది. భీమనాథుడు ఇలా ప్రసంగించాడు.

“ దండనాదులారా! ఇప్పుడు మనదేశ స్థితి ఆందోళన కరంగా ఉంది.అంతర్విప్లవం వలన, పర రాజుల దండ యాత్రల వలన దేశంలో శాంతియుతమైన ప్రభుత్వ పద్ధతి అంతరించింది. మహామండలేశ్వరుల వారు సమస్త బాధ్యతలు మనపైన మోపి ఉన్నారు! కాబట్టి దేశంలో సైనిక ప్రభుత్వమే ఏర్పడింది. మీరందరూ కఠినతరాలైన మీ బాధ్యతలను బాగా గుర్తించి దేశంలో శాంతి విరోధ శక్తులని నిర్మూలించి శాంతి స్థాపించవలసి ఉంది”

“ఒకవైపు సింహ పరాక్రముడు నిశుంభు నాగేంద్రుడు లక్ష సైన్యంతో ఉన్నాడు. కుంతలేశ్వరుడు యాభై వేల సైన్యంతో సీమోల్లంఘన చేయడానికి రణ ప్రస్తాన యుద్ధ భేరి వాయించినట్లు వార్తలు వచ్చి ఉన్నాయి.”

“ ఇక మన పక్షంలో కుంతలా దేశం సరిహద్దు ప్రాంతంలో దండనాయక అమృతభానుడు పదివేల సైన్యంతో ఉన్నాడు. అతనికి సహాయం చేసే నిమిత్తం సరిహద్దు ప్రాంత దుర్గాదిపతులు పదివేల సైన్యంతో బయలుదేర డానికి సిద్ధమైనట్లు వార్తలు చేరాయి! ఈ విధంగా సరిహద్దు ప్రాంతంలో మన సైన్యం ఇరవైవేలవరకు ఉంది”

“ఇటు వైపు నిశుంభుడు దేవవాటిక దుర్గాధిపతిని లోబరచుకొని తన సేనను కేంద్రీకరించి ఉన్నాడు. దేవవాటిక దుర్గాధిపతి కూడ నిశుంభునితో చేయి కలిపి వెయ్యి అశ్వదళాన్ని,యాభై గజయూదాన్ని, ఎనిమిదివేల పదాతి దళాన్ని ఇచ్చినట్లు తెలుస్తూంది. నిశుంభుని సేన లెక్కలో గొప్పదే కాని, సుషిక్షితం కాదని వేగుల వాళ్ల కథనం!. వ్యూహ రచనలో నిశుంభునిది అందే వేసిన చెయ్యి!”

“ నిశుంభుని ఎదుర్కోవడానికి ఆంద్ర విష్ణువు యాభై వేల సైన్యంతో దేవవాటిక సమీపానికి వచ్చినట్లు ఈ రోజే వార్త వచ్చింది. కళింగ దేశం సరిహద్దుల ప్రాంతానికి ఫల్గుణ సమాన పరాక్రముడు ప్రమథనాథుడు సర్వసేనా పతి హోదాలో ఉన్నందువలన మనం నిర్భయంగా మన దేశ స్థితి పైననే సర్వ ప్రయత్నాలను కేంద్రీకరించాలి.
ఇలాంటి పరిస్థితిలో మన సైనిక చాలనం గురించి మీరందరూ యోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించమని కోరుతున్నాను”

ఉపసేనాపతి భార్గవ సోమనాథుడు లేచి ఇలా చెప్పాడు.” దండనాదులారా! మన సేనాధిపతి కంకోల భీమనా థుడు మన పాలిత దేవత! అతని నాయకత్వంలో మనం శత్రువులను నెట్టివేయ గలమని నా విశ్వాసం. మన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగం దేవవాటిక దిశకు, మరొక భాగం సరిహద్దు ప్రాంతాలకు పంపడం మంచిదని నా అభిప్రాయం! రాజధానిలో వెయ్యి సైన్యం ఉంటే  సరిపోతుంది!”

దండనాయక మయూరవర్మ లేచి తన అభిప్రాయాన్నిఈ విధంగా చెప్పాడు.“ఆంద్ర విష్ణువే స్వయంగా వస్తు న్నాడు. కాబట్టి నిశుంభునికి సరయిన ప్రత్యర్థి ఏర్పడి ఉన్నాడు. మన రాజధానికి నిశుంభుని తాకుదల ఉండదు! మనం సన్నిహిత ఘోర శతృవు కుంతల దేశాదిపతిని ఎదుర్కోనడమే ఉచితం! కొద్దిపాటి సైన్యాన్ని రాజధానిలో రక్షణకు నియమించి, మిగతా సైన్యంతో మనం అమృతభానునికే సహాయపడడం  సరైన పద్ధతి!”  

“దండనాయక మయూర వర్మతో నేను ఏకీభవిస్తున్నాను” అని అన్నాడు దండనాయక గజేంద్రుడు.

దండనాయక వీరసేనుడు ఈ విధంగా చెప్పాడు. “మనం పదివేల సంయంతో దేవవాటిక వైపు విద్యుద్వేగంతో వెళ్ళడంలో చాల లాబహం ఉంది. రెండు వైపులనుండి దేవవాటిక ముట్టడింప బడితే నిశుంభుని ఓటమి తథ్యం. అప్పుడు ఆంద్ర విష్ణువు మనకు సహాయ పడతాడు. కాబట్టి నేను ఉప సేనాపతి భ్హ్ర్గవ సోమదత్తుని సూచనను బల పరుస్తున్నాను.”
   
ఈ ప్రకారం దండనాయకులు తమలో తాము భేదాభిప్రాయాలు వెల్లడించి మాట్లాడారు. భీమనాథుడు లేచి తన తుది నిర్ణయాన్ని ఈ విధంగా తెలిపాడు. “ దండనాయకు లారా! మీ అమూల్యమైన అభిప్రాయాలు విన్నాను. యుద్ధ కాలంలో మనం ముఖ్యంగా గమనించ వలసినవి నాలుగు విషయాలు! ఒకటి.. దేవవాటిక, అమరావతి దుర్గాలకూ మన దేశానికీ రాకపోకలు అరికట్టాలి! ముఖ్యంగా ఆహార సామగ్రుల ఎగుమతిని ఆపు చేయాలి! రెండు.. దేశం లోని ఆహార సామగ్రిని, యుద్ధ కారణాన్ని బట్టి పెంచిన సుంకాన్ని సేకరించడానికి మనం కొంత సైన్యాన్ని వినియోగించాలి!

కారణమేమంటే మన దేశంలో విరోధ శక్తులు పని చేస్తున్నాయి. కాబట్టి రాజకీయోద్యోగులకు సైనిక సహాయం చాలా అవసరం! మూడు.. పరదేశ రాజు ఆక్రమణ కొనసాగకుండా మన సర్వ శక్తులూ వినియోగించి పని చేయాలి! నాలుగు.. రాజధాని లోనూ, దేహ్సం లోనూ శాంతి భద్రతలను కాపాడాలి. ఇట్లా నాలుగు ప్రక్కలా వ్యవహరిస్తేనే గాని విప్లవాన్ని మనం శీఘ్రంగా అణచలేము! పై విషయాలు బాగా ఆలోచించి నేను ఒక విధానాన్ని వెంటనే అమలుపరచడానికి సూచిస్తున్నాను.”

“1. దండనాయక మయూరవర్మ రెండువేల సైన్యం నడిపించుకొని అమరావతీ, దేవవాటికా దుర్గాలకు పోయే బాటలన్నిటినీ ఆక్రమించు కోవాలి! అతనికి అనుమానితులను బంధించడానికి, రహదారుఅలలో రాక పోకలు అరికట్టడానికి ప్రత్యెక అధికారాలు ఇవ్వబడతాయి.

2. దండనాయక గజేంద్రుడు రెండువేల సైన్యంతో గ్రామ గ్రామం రాజోద్యోగులతో పర్యటిస్తూ, ప్రజలను ఉత్సాహ పూరితులుగా చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. దాన్య , ధన సేకరణ కార్యక్రమంలో రాజకీయోద్యోగు లతో పూర్తిగా సహకరించాలి. ఈ పనులను ఆతంకపరచే వ్యక్తులను, గూఢ చారులను బంధించడానికి అతనికి ప్రత్యెక అధికార పత్రాలు ఇవ్వబడతాయి.

3. ఉపసేనాపతి భార్గవ సోమదత్తుడు ఐదువేల సైన్యంతో దేవవాటికా దుర్గానికి బయలుదేరి వెళ్లాలి. అచ్చట ఏ విధంగా వ్యూహం పన్నాలో అతడే తీర్మానించుకో గలదు.

4. రాజధాని శాంతి బద్రతలు కాపాడే నిమిత్తం దండనాయక వీరసింహుడు ఉంటాడు.

5. నేను మిగతా సైన్యాన్ని నడుపుకొని కుంతల దేశం సరిహద్దులకు వెళ్తాను.”

అందరూ సేనాధిపతి సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. దండనాయకుల సభ ముగిసింది.

*********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ