దండనాయకుల సభ ముగిసిన కొన్ని ఘడియల్లో ఉప సేనాధిపతి భార్గవ సోమదత్తుడు రథ, గజ, తురగ, పదాతి దళాలతో కూడిన ఐదువేల సైన్యంతో దేవవాటికా దుర్గాభిముఖంగా కదిలాడు. భేరీ భాంక్రుతులతో కదలి వెళ్తున్న ఆ సేనావాహినికి పట్టణ ప్రజలు జయనాదంతో వీడ్కోలు ఇచ్చారు.
మరునాడు గోధూళి సమయంలో సర్వ సేనాధిపతి కాంకోల భీమనాథుడు రాజధానిని విడచి తన సేనతో సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళుతాడని పట్టణమంతా ఉద్ఘాటించ బడింది.
ఆ సమయం వచ్చింది. అరుణ వర్ణం చేత ప్రకృతి రాగరంజితమై శోభాయమానమై ఉంది. మహానందిపురమంతా దీపావళులతో జాజ్జల్యమానంగా ఉంది. రాజవీధి పొడుగునా కళ్ళాపి చల్లబడి, చిత్ర విచిత్రంగా ముగ్గులు వేయ బడ్డాయి. పట్టణ ప్రజలు ఆబాల గోపాలం తమ దేశ సైన్యం తరలి వెళ్ళే దృశ్యం చూచే నిమిత్తం వీధి అరుగుల మీదా, డాబాలమీదా గుమికూడారు.
రాజప్రాసాదం దీప మాలికలతో అలంకరింపబడింది. కోట వాకిలి డాబాపై మంగళ తూర్యారావం వీనుల విందు చేస్తోంది. రాజ ప్రాసాదానికి ఎదురుగా ఉన్న మైదానంలో సేనలు బారులు తీరి నిలబడి ఉన్నాయి.
సర్వ సేనాధిపతి ఆయుధ శాలకు కవచ ధారణ నిమిత్తం వెళ్ళాడు. ద్వార పాలకులు అభివాదన చేసి అతనికి దారి ఇచ్చారు. భీమనాథుని ఎదుర్కొంటూ వచ్చింది కుమారి రత్నప్రభ. తన నయన జ్యోత్స్నను చూచి ఆనం దించాడు భీమనాథుడు. సుందర యువతుల సమక్షంలో నిలబడి మాట్లాడే అలవాటు లేని భీమనాథుడు తట పటాయిస్తూనే సందిగ్ధంతో నిలబడ్డాడు. సుందర యువతి దర్శన మాత్రం చేతనే మనోభవుడు తత్కాలావసర అనునయాన్ని బోధిస్తాడు కాబోలు! భీమనాథుని హృదయంలో, అంగాలలో విచిత్రమైన మధురానుభూతి ఉదయించింది!
వారిద్దరి ద్రుక్కులూ కలుసుకొన్నాయి!
వీణ మీటినట్లయింది! రత్నప్రభ మాట్లాడింది! “ ప్రభూ! నేనే స్వయంగా మీకు కవచం తొడగాలని ఉత్సుకత పుట్టి వచ్చాను. నా సేవ స్వీకరించండి.” ఆ ధ్వనితో భీమనాథుని శరీరం పల్లవించింది. వాని కండ్లలో వింత కాంతి మెరిసింది! “ప్రియే! ధన్యుణ్ణి!” అన్నాడు అతి ప్రయత్నం మీద భీమనాథుడు.
రత్నప్రభ ఆనంద ఫ్రఫుల్ల నయనాలతో భీమనాథుని సమీపించింది. ఆమె తనులత వింత సోయగంతో వయ్యా రాలు పోయింది.“ప్రభూ! మీ వక్ష స్థలాన్ని ఈ ఉత్తరీయంతో కొలవాలి, శరీరానికి తగిన కవచాన్ని తీయాలికదా?”
“ సుందరీ ! నీ ఆజ్ఞకి బధ్దుణ్ణి!”
రత్నప్రభ సన్నటి పట్టు ఉత్తరీయంతో మునికాళ్ళపై నిలబడి సాలవృక్షం వలె నిలబడి ఉన్న భీమనాథుని వక్షస్థలాన్ని కొలిచింది! అప్పుడా సుందరి ముఖం భీమనాథుని గుండెలకి సమీపమయింది. అతనికి ఆమె వినీల విస్తృత కచభరం సువాసిత పుష్పమాలికావృతమై కనబడింది. వాని నయన చకోరాలు ఆ కచభర జాలంలో
చిక్కుపడ్డాయి. భీమనాథుడు తనకి తెలియకుండానే మనోభవుని వశమై పోయాడు. వాడు తన బాహువులను కదిలించాడు. అది యాంత్రికం! అవి అప్రయత్నంగా రత్నప్రభ కుమారి సుందర తనులతను పెనవేసుకొన్నాయి. రత్న ప్రభ పుష్ప రాశి వలె మృదువుగా వాని వక్షస్థలంలో ఇమిడి పోయింది! ఆమె కోర్కె ఈడేరింది ! ఆమె అంగాలు వింత కోర్కెలతో స్పందించాయి. కొని మధుర క్షణాలు గడచాయి. ఇద్దరికీ చైతన్యం వచ్చింది. రత్న ప్రభ ఉల్లాసంతో తన భావి భర్త వక్షస్థలాన్ని, బాహువులను, కటి ప్రదేశాన్ని కొలిచింది.
ఆ కవచాలంకరణ మహోత్సవం శ్రుంగార వీర సమిళితమై వారిద్దరి మధ్య వింతగా శోభించింది. లోహ కవచం లోని భీమనాథుని గంభీర మూర్తి రత్న ప్రభ హృదయంలో ఉత్కృష్ట స్థానం ఆక్రమించుకొంది. అలంకరణ పూర్తి అయింది. రత్న ప్రభ భీమనాథునికి సింధూర తిలకం పెట్టింది. భీమనాథుడు రత్న ప్రభ చెక్కిళ్ళపై ముద్దు ముద్రలు వేసాడు. అప్పుడామె ముఖం సిగ్గుతో సిందూరారుణ మయింది.
వారిద్దరూ ప్రాసాద బహిః పురం లోని కచ్చేరీ సావడి లోనికి వచ్చారు. అక్కడ శ్రీశైల మహామండలేశ్వరుడు అమాత్య వర్గంతో కలిసి భీమనాథునికి స్వాగతం పలికాడు. చేటీ వర్గం దీపపు పళ్ళెరాలతో ప్రవేశించింది. కుమారి రత్న ప్రభ పళ్ళెరంలో కర్పూరం వెలిగించి భీమనాథునికి హారతి ఇచ్చింది!
“సేనాధిపతీ! విజయ లక్ష్మిని వరించి నీవు మాకు పునర్దర్శనం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని మంత్రాక్షతలు భీమనాథుని ఉష్ణీవంపై చల్లాడు మహామండలేశ్వరుడు.
కత్తి దూసి భీమనాథుడు మండలేశ్వరునికి సైనిక అభివాదం చేసాడు. అందరూ మైదానం వైపు బయలుదేరారు ఆర్ద్ర నయనాలతో తన ప్రియుని తర్పిస్తూ సఖీజన పరివృత అయి రత్న ప్రభ నిలబడి పోయింది.
సర్వ సేనాపతి భీమనాథుని కంచు రథం చిరుమువ్వల రవళితో ముందుగా బయలు దేరింది. దాని వెనుకాల గజ దళం కదిలింది. గజ దళాన్ని అనుసరించి ఆశ్విక దళం గమించింది. రథ దళం దానిని అనుసరించింది. చిట్టచివరగా పదాతి దళం నడక సాగించింది.
రాజమార్గం కోలాహల పూరితమై సముద్ర ఘోషను తలపించింది. “ఆంద్ర విష్ణువుకు జై! సేనాపతి భీమనాథునికీ జై!” అని జయనాదం ఒక్కుమ్మడి జన సందోహం నుండి నిర్గమించింది.
భేరీ పణవ కాహళ ధ్వనులు దిక్కులు నింపాయి. హయహేలతో, గజ ఘీంకారాలతో శ్రీఅశైల మహామండల సేనావాహిని తరలి వెళ్లింది.
47 వ ప్రకరణం
కళ్యాణ దుర్గం లాంగలీ నది తీరాన్ని అంటి కళింగ దేశం సరిహద్దులలో ఉంది. ఆంద్ర కళింగుల సంధి ప్రకారం ఆ దుర్గం కళింగ రాష్టంలో ఉన్నప్పటికీ, ఆంధ్రుల సైనిక స్కందావారంగా ఇవ్వబడింది. ఆ దుర్గమూ, దాని చుట్టూ ఉన్న కొంత అరణ్య ప్రదేశమూ కళింగులు ఆంధ్రులకు ఇచ్చిఉన్నారు. అదే విధంగా లాంగలీ నదికి ఇవతలి వైపు ఆంధ్రుల సరిహద్దులలో ఉన్న భైరవ దుర్గం కళింగుల సైనిక స్కందావారంగా ఆంధ్రులు ఇచ్చి ఉన్నారు.
పదివేల సైన్యంతో దండనాయక అమరసేనుడు పార్వతీయ మండలాని వదలి కళ్యాణ దుర్గం చేరుకొన్నాడు. కుమార భోగనాథుడు, దూతసామంత విశాలక్షుని తోనూ, దండనాయక రుద్రసేన , వీరసింహుల తోనూ కళ్యాణ దుర్గంలో మకాం వేశారు.
కళ్యాణ దుర్గం లోనే భోగనాథుడు, విశాలాక్షుని కుమార్తె కుముదాక్షిని వివాహం చేసుకొన్నాడు. వివాహం నిరాడంబరంగా జరిగింది.
మహా చతురుడైన విశాలాక్షుడు తన ప్రతిస్ఫర్థి ప్రమథనాథుని బుద్ది పాటవం బాగుగా తెలిసిన వాడు! కాబట్టి ఏ సమయంలోనైనా కుమార భోగనాథుని మాయోపాయం చేత బందించగలడని ముందుగానే యోచించి భోగనాథ దంపతులను కళింగుల వశం కావించాడు! కళ్యాణ దుర్గంలో తాను దండనాదులతో కలసి సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
కళింగులు ఆంధ్రులపై యుద్ధం ప్రకటించలేదు! వారిలో మతభేదాలు ఏర్పడజొచ్చాయి! కాని వారు లక్ష సైన్యాన్ని లాంగలీ నది తీరానికి పాతిక క్రోసుల దూరంలో నిలబెటి ఉంచారు. సమయానుకూలంగా ప్రవర్తించడమే వారి యుద్ధనీతి!
భైరవ దుర్గం లోని కళింగుల సైన్యం కదలకుండా ఉండి పోయింది. ఏ సమయంలో నైనా కళ్యాణ దుర్గానికి దౌడు తీయడానికి తగు సన్నాహాలన్నీ కావించ బడ్డాయి.
ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని సేనాధిపతి ప్రమథ నాథుడు బాగా పరిశీలించి తన సేనను రెండు భాగాలుగా విభజించాడు. రాష్ట్రీయ ఘనేంద్రుని నాయకత్వంలో కళ్యాణ దుర్గానికి సమీపంలో ఉంచాడు. రెండవ భాగాన్ని తానే నడిపించుకొని భైరవ దుర్గ సమీపంలో విడిది వేసాడు. ఇద్దరు సేనాధిపతులు అన్యోన్యం ప్రతి ఘడియా వార్తలు అందించుకొనే ఏర్పాట్లు కావించు కొన్నాడు.
భైరవ దుర్గ పాలకుడు ప్రమథ నాథునికి ఒక లేఖ పంపాడు. ఆ లేఖలో ఆంధ్ర , కళింగుల మధ్య మైత్రిని భంగ పరుస్తూ ఆంధ్రులు కావిస్తున్న సైనిక చాలనాన్ని తీవ్రంగా విమర్శించి వ్రాసాడు!
ఆ లేఖకు తగిన సమాధానం వ్రాసి పంపాడు ప్రమథనాథుడు. అందులో ఆంధ్రులు మైత్రికి భంగకరమైన కార్యం ఏదీ కావించ లేదనీ, కళింగులే రాజద్రోహులైన భోగనాథ సహిత దుండగులను ఇరు దేశాల మధ్య వస్తున్న మైత్రిని భంగ పరచారని స్పష్టపరచాడు. కళింగులు రాజద్రోహులైన వారిని తమకు అప్పగించే షరతు మీద తాను ససైన్యంగా మరలి పోవడానికి సిద్ధమని ఆ లేఖలో సూచించాడు.
రాజధాని నుండి మహామంత్రి మల్లికార్జునుడు చిత్రకూట సర్వాసేనాధిపతి ప్రమథనాథునికి ఒక సుదీర్ఘమైన లేఖ పంపించాడు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా ఉంది!
“శ్రీశైల మహామండలం సర్వసేనాపతి కాంకోల భీమనాథుడు కుంతల దేశంపై యుద్ధం ప్రకటించాడు! అక్కడ సరిహద్దులలో పోరు తీవ్రంగా నడుస్తోంది. ఇప్పటికి అందిన వార్తలను బట్టి మన ఆంధ్రులదే పైచెయ్యిగా ఉన్నదని తెలుస్తోంది! మహర్షి పుత్రుడు భీమనాథుడు పరాక్రమం నమ్మి మనం అక్కడి పరిస్థితులను గురించి నిశ్చింతగా ఉండవచ్చు!
ఇక శ్రీశైల మండలం, ఆంధ్ర దేశాల మధ్య భాగంలో ఆంద్ర విష్ణువు నిశుంభుని మూడు చెరువుల నీళ్లు త్రాగిస్తు న్నట్లుగా రూడిగా తెలుస్తోంది. మహారాజ్ఞి రాజకాళి స్వయంగా తన కుమారునికి సహాయం చేసే నిమిత్తం రణ రంగానికి వెళ్లి ఉన్నారు. ఆమెకు సహాయంగా అంగరక్షక సైన్యంతో దండనాద వాత్సాయన విష్ణుశర్మ వెళ్ళాడు. ఈ ప్రస్థానానికి కారణం లేక పోలేదు! శాంబర విద్యా మహిమాన్వితుడయిన నిశుంభు నాగేంద్రుడు తద్విరోధక శక్తుల చేతనే జయింపతగి ఉన్నాడు! కాబట్టి మహాయోగీశ్వరి రాజకాళి దేవి సహాయం ఆంద్ర విష్ణువుకు అవసరం ఉంటుంది!
మగధ రాజ్యం ఎల్లలలో కుమార శక్తిధరుడు ఉన్నాడు. అచ్చటనుండి యుద్ధ భీతి ఏమాత్రం లేనందున , కొంత సైన్యాన్ని అక్కడ ఉంచి అతడు రాజధానికి వచ్చాడు.
రాజకులం సమావేశమై కళింగుల కుటిల తాటస్థ్యాన్ని గురించి చర్చించింది. మహారాజ సుచంద్ర భట్టారకులు, కళింగుల విషయంలో సమయానుకూలంగా చరించడానికి చిత్రకూట సర్వ సేనాపతికి సంపూర్ణ అధికారం ఇవ్వాలని తీర్మానం ప్రతిపాదించారు! ఆ తీర్మానం ఏక గ్రీవంగా అంగీకరించ బడింది. అ తీర్మానం ప్రకారం, లేఖతో పాటు తాజముద్రలతో కూడిన అధికార పత్రం పంపడ మయింది.
ప్రమథనాథుడు ఆ రోజు సాయంకాలం దండనాయకుల సభ కూర్చి కళింగులతో ఎలా వ్యవహరిం చాలో పూర్తిగా చర్చ సలిపాడు. కళింగులతో యుద్ధం ప్రకటించడమే సరి అయిన మార్గమని తీర్మానింపబడింది!
మర్నాడు దశమి అనగా, నవమి నాడు త్రిపురసుందరీ పూజ విధి విధానంగా సైనిక స్కందావారంలో జరిగింది. హోమాది వైదిక క్రియలు జరిగాయి. పురోహితులు సాంగ్రామిక సూక్తులు పఠించారు.
దశమినాటి రాత్రి పూర్వాయామమున భైరవ దుర్గాన్ని ముట్టడించాలని తీర్మానం జరిగింది. అదే సమయంలో కళ్యాణ దుర్గాన్ని కూడ ముట్టడించాలని సేనాపతి ఘనేంద్రునికి ఆజ్ఞ జారీ చేయబడింది.
48 వ ప్రకరణం
శ్రీశైల మహామండలం సర్వసేనాపతి భీమనాథుడు తన సేనను నడిపించుకొని వెదురు కోలలాగ అప్రతిహత పరాక్రముడై క్షీరనదిని ( పాలారు) దాటి పయనం సాగించాడు. అతని ధాటికి ఓర్వలేక కుంతలులు వెనక్కు తగ్గారు.
భీమనాథుడు అర్థ చంద్రాకృతిగా వ్యూహ రచన కావించి సైన్యం నడిపించాడు. దీనిలో చాల గొప్ప మర్మం ఇమిడి ఉంది! శత్రువులు రెండు వైపులనుండి ఆంధ్రులు వస్తున్నారని భ్రమపడి మధ్యభాగం గుండాసైన్యాన్నినడిపించ డానికి అవకాశం ఉన్నది. ఆ విధంగా జరిగితే ఆ సైన్యాన్ని చుట్టుముట్టి నాశనం కావించ వచ్చును!
ప్రథమాన భీమనాథుని వ్యూహ రచన గుర్తించక కుంతలులు అపార నష్టం పొందారు. ఈ విధంగా ప్రారంభం లోనే భీమనాథునికి విజయం సిద్ధించింది.
మధ్య మొనలో ఎవరూ ఎదురు చూడని సంభవం జరిగింది. నిశుంభుడు తనని ఎదుర్కోవడానికి వస్తున్నఆంద్ర మహావిష్ణువుని గుర్తించాడు! ఎదురుగా నిలబడి యుద్ధం చేయడం సరి కాదని తలచాడు నిశుంభు నాగేంద్రుడు. అమరావతి, దేవవాటిక దుర్గాలను ఖాళీ చేసి, తన సైన్యాన్ని తిన్నగా మహానందిపురానికి మళ్ళించాడు. మార్గ మధ్యంలో తనను ఎదుర్కొన్న, ‘సోమదత్తుని’ పూర్తిగా ఓడించి సత్వర గమనంతో ప్రస్థానాన్నికొనసాగించాడు. ఆ మహా యుద్దంలో భార్గవ సోమదత్తుడు నిరుపమానమైన పరాక్రమం చూపి వీరస్వర్గము అలంకరించాడు ఇట్లా శ్రీశైల ఆంధ్రులకు ఒక చోట అఖండ విజయమూ, మరొక చోట పరాజయమూ సిద్ధించాయి.
మహానందిపురంలో నిశుంభునికి ఆశాభంగమే ఎదురైంది! మహా నందిపూర దుర్గం ఖాళీగా ఉంది! దుర్గం లోని జలాశయాలన్నీవిషపూరితం కావించబడ్డాయి. పట్టణమంతా శూన్యంగా కనపడింది! శత్రువుల రాకను ముందు గానే తెలుసుకొని బుద్దిసాగరుడు దుర్గాన్ని, పట్టణాన్నీ ఖాళీ చేయించి ఉంటాడని నిశుంభుడు ఊహించాడు.
తనను వెన్నంటి శరవేగంతో ఆంద్ర విష్ణువు వస్తున్నాడని నిశుంభునికి వార్తాహరులు చెప్పారు. నిశుంభుడు దీర్ఘంగా ఆలోచించి, పట్టణంలో ప్రతీగృహం లోనూ సైన్యాన్ని నిలబెట్టి కొంత సైన్యాన్ని పట్టణ బహిర్భాగంలో ప్రచ్చ న్నంగా ఉంచి, ఆంద్ర విష్ణువుని ఎదుర్కోవడానికి సనాహాలు కావించాడు. ఆటవిక యుద్ధనీతిని అవలంబించి ఆంధ్రులను చీకాకు పెట్టాలని భారీ ఎత్తున సన్నాహం కావించాడు నిశుంభుడు.
****************************
ప్రమథనాథునికి తీవ్ర ప్రతిఘటన లేకుండానే భైరవ దుర్గం వశమయింది. ఆ యుద్ధంలో భైరవదుర్గ పాలకుడు దండనాయక చండభానుడు తప్పించుకొని నది దాటి కొంత సైన్యంతో పారిపోయాడు! రెండు వేలకు పైచిలుకు కళింగులు యుద్ధనిహతులు అయ్యారు. విశేషమైన ఆహార సామగ్రి ఆంధ్రుల వశం అయింది. ప్రమథనాథుడు కొంత సైన్యాన్ని దుర్గ సంరక్షణకు ఉంచి మిగతా సైన్యంతో లాంగలీ నదిని దాటి పురోగమించాడు.
సేనాపతి ఘనేంద్రుడు కళ్యాణ దుర్గాన్ని ఆక్రమించాడు. ప్రతిఘటన ఏమాత్రం లేకుండానే దుర్గం ఆంధ్రుల వశం అయింది. దుర్గంలో పూచిక పుల్ల కూడ వానికి లభించలేదు! దుర్గంలో అయుదు వందల మంది సైన్యాన్ని ఉంచి ఘనేంద్రుడు ప్రమథ నాథుని సైన్యానికి సమాంతర రేఖలో తన సైన్యాన్ని నడిపించు కొంటూ పురోగమించాడు.
49 వ ప్రకరణం
చండ భానుడు వెలవెలబోతున్నాడు. తమ స్వామి దైన్యాన్నిచూసి కాబోలు, పద్మినీ కాంతలు కళావిహీనలై పోతున్నాయి! కలువ భామినులు నూతన చైతన్యాన్ని పుంజుకొంటున్నాయి. సాయంకాలపు నీరెండలు తరు లతా గుల్మాదులపై ప్రసరించి కాముకుని భంగి రాగరంజితమై ఎరుపెక్కింది. పక్షుల కిలకిలారావాలతో నందన
వన ప్రదేశం మనోహర ధ్వనులతో కలకలలాడుతోంది!
ఒక జవ్వని విరజాజి పొదరింట చంద్రకాంత శిలావేదికపై పట్టు పరుపుల మధ్య ఒయ్యారంగా చేరగిలబడి ఉంది. ఆమె ముఖం తిలోత్తమను మరపిస్తూంది, రంభను దిక్కరిస్తోంది! ఆమె తనూ పరివేష్టితమైన లావణ్య ఝురి ఆకాశగంగవలె నిర్మలంగాను, చంద్రకళ వలె రసప్రపూరితం గాను రాణిస్తూ ఉంది. ఆమె ముఖ మండలమందు మందహాస రేఖ నిత్య ఫ్రఫుల్లితమై బొండు మల్లెలను పరిహసిస్తోంది.
ఆమెయే కాకుల దౌహిత్రి ‘ఇరావతి’! ఆమె గుప్త నామం పర్ణిని! అసలు నామ గోప్యం ఇప్పుడు బహిరంగమై పోయింది!
చంద్రకాంత శిలావేదిక సమీపంలో ఒక దంతపు పీటపై ఆసీనుడై ఉన్నాడు ఒక ప్రౌఢ యువకుడు! వాని శరీర చ్చాయ ధవళమై వీరరస సమ్మిళిత శోభతో నయన పర్వంగా ఉంది. వాడే యువతీ జన మన్మథుడు అయిన, కీ:శే: మహారాజ పరమేశ్వర అనంతసేనుని కుమారుడు విక్రమసేనుడు!
“సుందరీ! భీమనాథుడు క్షీరనదిని దాటి పది కోసులు మనసులోకి చొచ్చుకొని వచ్చాడని వార్త అందింది! దండ నాయక విజయవర్మ యుద్ధంలో నిహతుడయ్యాడు. నేనే స్వయంగా సైన్యాధిపత్యం వహించి వెళ్లాలని తలపోస్తు న్నాను” అన్నాడు విక్రమసేనుడు.
“మూర్ఖుడు, యుద్ధనీతి తెలియని మొరటు వీరుడు!” అని ఇరావతి లేచి కూర్చొంది. ఆమె సుందర వదనంలో క్రోదారుణిమ భాసించి, ఆమె ముఖాన్ని భానుమండలంగా మార్చింది!
విక్రమసేన మహారాజు కలవరపడ్డాడు.’నన్నే నిందిస్తున్నదేమిటి?’ అని వాని మనస్సు తలపోసింది!
“మహారాజా! నేనేమో నిశుంభుడు చాలా తెలివైన వాడని అనుకొన్నాను! నాకు ఉండిన విశ్వాసం బూడిదలో పోసిన పన్నీరు అయింది! ఏనాడో శ్రీ శైల మహామండలాన్ని వాడు సాధించి ఉండవలసింది! వృధా విలంబం చేసి విషయాన్ని చెడగొట్టు కొన్నాడు. భీమనాథుడు సేనా ముఖాన నడిచినప్పుడు సాక్షాత్తు రుద్రుడు ఎత్తి వచ్చినా లాభించదు! నాకు వాని పరాక్రమం చిర పరిచితమైనదే!” అని చెప్పి ఆ కోమలాంగి నిశాత మధుర దృక్కులు వెదజిమ్మింది.
ఆ దృక్పీయూషంలో చిక్కు పడిన మహారాజు మనస్సు మత్తెక్కి పోయింది. అతడు ఉన్మత్తుడిలా తేలిపోతున్న వాగ్జాలంతో ఇట్లా అన్నాడు. “మహా సుందరీ! నీ రమణీయ దృక్కోణాలతో నన్ను ఆజ్ఞాపించు, నేను నీ ...”
“మహారాజా! మీరు మూర్తాభిషిక్తులు, నేను సామాన్య వ్యక్తిని! మీరు ఇట్లా..”అంటూ మాట మధ్యలోనే చక్కని మందహాసాన్ని ప్రదర్శించింది ఇరావతి! ‘ఆహా! స్త్రీ మందహాసం! దాని ప్రభావం విద్యుత్తుకు కూడా ఉండదు! కాబట్టే మహా కవులు జగన్మాత మందస్మితాన్ని వివిధ భంగిమలలో వర్ణించారు. ఇరావతీ ముఖ నిర్గతమైన మందహాస చంద్రిక, మహారాజు విక్రమ సేనుని హృదయాకాశానికి పండు వెన్నెలయింది! ఆ వెన్నెలలో వాని మనోమృగం విహరిస్తోంది, ఎన్నో కలలు కంటూ ఉంది. మైమరిచి ఆనంద వార్ధిలో మునిగి తేలుతూంది.
మహారాజు ఆవేశంతో ఇలా అన్నాడు. “ త్రిభువన సుందరీ! రత్న స్థగితమైన నా కిరీటాన్ని నీ పాద పద్మాల మీద ఉంచి పూజిస్తాను! ఈ అఖండ కుంతల దేశాన్ని నీవే శాసించు! నేను నీ మృదు మధుర సౌభాగ్య పూరితా లైన, అంగచ్చాయలలో విశ్రమించి కాలం గడుపుతాను!” అని.
“మహారాజా! ఆవేశ పడకండి! మీ కరవ్యాన్ని మరిచారు, భయంకర శతృవు మన రాజ్యంపై దూసుకొని వస్తున్నాడు.”
మహారాజు దిగ్గన ఆసనం నుండి లేచి ఇలా అన్నాడు. “ప్రేమ స్వరూపిణీ! నీ పరిష్వంగ జ్వాలచే నన్ను పునీ తునిగా చేసి పంపించు! విక్రమ సేనుని పరాక్రమాన్ని నీవు చూస్తావు” అని.
ఇరావతి కూడా లేచింది. కూర్చొన్నప్పుడు గుప్తంగా ఉన్న ఆమె అంగాల సౌభాగ్యం విస్తృత శోభతో మహారాజు నయనోత్సవం చేసింది!
ఇరావతి తన మనస్సులో ఇలా తలపోసింది. ‘ ఇరావతీ! నీ పాణికి తగినవాడు నిశుంభుడని తలపోసావు? మహావీరుడు నిశుంభుడని నీవు చిన్ననాటి నుండి తలుస్తూ వచ్చావు. కాని వాడు నీకు నాయకుడు కాజా లడు, కాకూడదు! నీవు సామ్రాజ్య సింహాసన భాగస్థురాలివై ఉండాలి! అదే నీ ధ్యేయం! ఇప్పుడు కాలనాథుడు నిశుంభుని హతమార్చక మానడు! భీమనాథునితో విరోధం కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది. నీ హృదయ పుష్పాన్ని ఈ కుంతల దేశాదిపతికి సమర్పించుకో! అతులిత భోగాలు అనుభవించు! పట్టమహిషివి అన్న కీర్తిని అందుకో!’ ఇరావతి ప్రకాశంగా ఇలా అంది. “మహారాజా! నా మాట మన్నిస్తారా?”
“ఓ ! తప్పకుండా!”
“మనం ఆంధ్రులతో సంధి చేసుకోవడమే ఉచితం! మనకు ఉన్న రాజ్యం చాలు, పరిస్థితులు నేను అనుకొన్నట్లు కలిసి రాలేదు! మీ తండ్రిగారి హయాంలో పోగొట్టుకొన్న రాజ్య భాగం తిరిగి సంపాదించ కోవడానికి మనం మంచి సమయం కోసం వేచి ఉండాలి! నన్ను సంధి నిమిత్తం రాయబారానికి పంపండి. నాపై భీమనాథునికి సోదరీ వాత్సల్యం ఉంది. నేను అంతా చక్కబరచ గలను.”
విక్రమ సేనుడు మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపుతో వాడు తన మనస్సుని ఆమె వశం చేసాడు. ఆమె ఉజ్జ్వల రూపం ముందర వాని బుద్ది మోడువారి ఆలోచన శక్తిని కోల్పోయింది.
ఇరావతి మహారాజుని సమీపించి కౌగలించుకొంది. ఆ కౌగిలిలో పూర్తిగా కరిగి పోయాడు ఆ మూర్ధాభిషిక్తుడు! “నీ ఇష్ట ప్రకారమే కానీ, నా హృదయ రాణీ!” అని ఆమెను తనివితీరా కౌగిలి బంధంలో ఇముడ్చుకొని పలికాడు కుంతల దేశాధీశుడు!
50 వ ప్రకరణం
కళింగదేశ మంత్రి వర్గంలో మతభేదం పుట్టింది. మహామంత్రి కోణార్కుడు ఆంధ్రులాటి యుద్ధాన్ని ఆమోదించ లేదు! దూత సామంతుడు వినయ చంద్రుడు కోణార్కుని మతాన్ని సమర్థించాడు.
మహారాజ శ్రుతసేన పురస్కృతమైన సంపూర్ణ మంత్రి సదస్సు సమావేశమయింది. ఆ సమావేశంలో కళింగదేశ మహామంత్రి ఆంధ్రులతో యుద్ధం చేయడం వలన కలిగే కష్ట నష్టాలు వివరించాడు. “ఈ యుద్ధం వలన మనకు లాభం కన్నా నష్టం పదిరెట్లు అధికంగా ఉంది. మనం పోగొట్టుకొన్న పార్వతీయ ప్రాంతం రావచ్చు! కాని సరిహద్దులు బలహీ నమైపోతాయి! అవకాశార్థం ఎదురు చూస్తున్న వంగ దేశీయులు సమయం చూసుకొని మనపై దండెత్తగలరు!”
“కుమార భోగనాథుడు పూర్తిగా ఆంధ్ర దేశానికి రాజు కాలేడు! నిశుంభు నాగేంద్రునితో దేశాన్ని పంచుకోవడం జరుగుతుంది. దీని వలన మనకు వచ్చిన లాభం ఏమిటి? ప్రత్యుత మనకు నష్టకరమే కాగలదు! నిశుంభునకు చిత్రకూట రాష్ట్రం రావచ్చు. అప్పుడు వాడు మనకి పక్కలో బల్లెంగా ఉంటాడు! ఇది మనకు అవాంఛనీయము! మంచి మిత్రుని పోగొట్టుకొని కపట మిత్రుని తెచ్చుకొనడంలో లాభం ఏమిటి?”
“ ఆంధ్రుల మాజీ దూతసామంతుడు విశాలాక్షుడు వేసుకొన్న పథకం తారుమారు అయింది. తన రాష్ట్రం నుండి అధిక సహాయాన్ని అతడు మనకి వాగ్దానం చేసాడు! ఆ సహాయం మనకు ఎండమావుల్లో నీరులా అయింది! మన కోశాన్ని, సైనిక బలాన్ని, పలుకుబడిని కుమార భోగనాథునికై, ఇంకా మనకు ఏ సంబంధమూ లేని ఒక నాగ ప్రముఖునికై వినియోగించ వలసినంత లాభం ఈ యుద్ధంలో నాకు కనపడలేదు! అన్నివిధాలా ఆలోచించి తర్కించినా మనం యుద్ధం కొనసాగించడంలో లాభం లేదనే నామతం!”
మహాసమాహర్త వాణీధరుడు మహామంత్రిని ఖండిస్తూ ఇట్లా మాట్లాడాడు. “ మహామంత్రి గారి తార్కిక వాదం లోని విషయాన్ని గ్రహించాను! వారు పోరు కష్టమని చెప్పారు. నేను కష్టం లేదని చెప్పలేను. కానీ నష్టమని వారు చెప్పినదానితో నేను ఏకీభవించ లేకుండా ఉన్నాను..”
“ నేను కష్టమని చెప్పలేదు, పోరు వలన లాభం లేదని చెప్పాను” అని మహాస్మాహర్త ఉపన్యాస మధ్యంలో లేచి చెప్పాడు మహామంత్రి.
“లాభం లేదన్నా, నష్టం ఉందన్నా ఒకటే అర్థం!” అన్నాడు వాణీధరుడు.
“లాభం విస్తారంగా ఉన్నప్పుడు ఎంత నష్టమైనా భరించ వచ్చు! లాభం లేనప్పుడు మనం నష్టం ఎందుకు పొందాలి?” అని ప్రశ్నించాడు మహామంత్రి.
“మహాసమాహర్త తన ప్రసంగాన్ని పూర్తీ చేయవచ్చు!” అని చెప్పి మహారాజు ఇద్దరి మధ్యా జరుగుతున్న వాగ్వాదానికి స్వస్తి చెప్పాడు.
“ ఈ యుద్ధం వలన లాభం లేదన్న మాటను నేను అంగీకరించ లేను! మనం కోల్పోయిన పార్వతీయ ప్రాంతం సాధారణమైన భూభాగం కాదు! కోట్ల కొలది కార్షాపణాలు వెలగల ‘కలప’ కలిగిన ప్రాంతమది! శ్రీమాన్ విశా లాక్ష బాబుతో చేసుకొన్న సంధి ప్రకారం చిత్రకూట రాష్ట్రంలో మనకు సగం సిద్దిస్తుంది! మిగిలిన భాగం నిశుంభు నకు చెందనీగాక! దాని వలన మనకు కలిగే ప్రతిబంధకం ఏమిటి? ఇటు కళింగ దేశం, అటు ఆంద్ర దేశం ఈ రెండింటి మధ్యన నిశుంభుడు నొక్కిన పేనులాగ ఉండవలసిన వాడే కదా? మహామంత్రి గారు అన్నట్లు ఎంత నష్టమైనా భరించి గొప్ప లాభం పొందే నిమిత్తం మనం యుద్ధం కొనసాగించ వలసినదే! అని నా అభిప్రాయం.”
దూతసామంత వినయచంద్రుడు లేచి ఇలాగన్నాడు. “ మహాసమాహర్త ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గుర్తించక తన తీర్మానాన్ని వెల్లడించడం చాల శోచనీయం! శ్రీమాన్ విశాలాక్షబాబు మనతో సంప్రదించకుండా గూఢమైన కొన్ని ఒడంబడికలు రహస్యంగా నిశుంభునితో చేసుకొన్నాడు. ఆ విషయం మనకు ఈనాటికి మసక మసకగా కనిపిస్తున్నది! నిశుంభుడు ఎప్పుడు శ్రీశైల మండల ప్రాంతానికి తన నాగసైన్యాన్ని తరలించాడో, ఆనాడే నేను ఊహించి, నా అనుమాన సామగ్రిని మహారాజు మ్రోల పెట్టాను. ఇప్పుడేమి జరిగిందో చూడండి! నిశుంభుడు తన ప్రధాన సహాయకారిణి ‘.. ప్రేయసి అయి ఉండవచ్చు!..’ ఇరావతిని కుంతలదేశానికి పంపి, అతనితో చేతులు కలిపినట్లు తెలిసిపోయింది! దీని పరిణామం ఏమిటి? శ్రీమాన్ విశాలక్షబాబు ఈ విషయాన్ని మనకు ఎందుకు చెప్పలేదు?
నిశుంభుడు కుంతలుల సహాయంతో శ్రీశైల మహా మండలాన్ని కబళించడం జరు గుతుంది. తద్వారా రానున్న పరిణామాన్ని రాజకీయ రహస్యాలు తెలిసిన మీకు నేను వివరించవలసిన పని లేదు! ఇలాంటి ప్రతారణ నీతిని అవలంబించిన విశాలాక్షునితో కలసి పనిచేయడం మనం ఘోర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది! బలవత్తర దేశం సహాయం లభించిన నిశుంభుడు ఆంద్ర రాష్ట్రాన్ని ఆక్రమించడని చెప్ప డానికి ఆధారమేముంది? ఆ విధంగా జరిగితే మన మిత్రుడు భోగనాథునికి మనం ఏ మార్గం చూపించ గలం? కాబట్టి ఆప్పుడు మనం ఆంధ్రులతో సంధి చేసుకోనడమే ఉచితం” అని.
కళింగుల పూర్ణ మంత్రి సదస్సు చాలా తర్జన భర్జనలు చేసి ఆంద్రలతో సందికే తీర్మానించింది.
దూత సామంతుడు వినయచంద్రుడే స్వయంగా రాయబార వర్గానికి నాయకత్వం వహించాడు!
Comments
Post a Comment