Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---21

 శరణ్య  ముందుగా వాళ్లని వెళ్లి చూసింది. ఆమెతో పాటు వచ్చిన  అవినాష్’ని చూసిన  ఆ రౌడీలకి, వెన్నులో వణుకు వచ్చి భయం వేసింది. శరణ్య వాళ్లతో భయపడ వద్దని చెప్పి, అప్పటి వరకు జరిగిన వైద్య సహాయం గురించి అడిగింది. వాళ్లు కన్నీళ్లతో ‘రాఖీ-జాకీలు’ డబ్బు ఇవ్వమని చెప్పారనీ, అది లేనిదే సరైన వైద్యం జరగదనీ చెప్పి ఏడ్చారు.

 అలాంటి ‘డాయన్’ ( మంత్రగత్తె ) లకి  సహాయం చెయ్యడం  తప్పనీ, ఇక వాళ్ల సంగతి  మరచి పొమ్మనీ చెప్పి, శరణ్య వారికి కావలసిన  ధన సహాయం  చేసి, వాళ్ల ఆపరేషన్’కి ఏర్పాట్లు చేసింది. అప్పుడు చెప్పారు వాళ్లు ఆ పిల్లవాడిని రాఖీ జాకీలకి తెచ్చి ఇచ్చింది తామేననీ. ఆ బాలుణ్నిఒక బంజారీ  కుటుంబం నండి అపహరించి తెచ్చామని !!

శరణ్య ఆ బంజారీ కుటుంబాన్ని కలిసింది. వాళ్లు తమ పిల్లవాడిని పోగొట్టుకొని  ఎంతో విలపించడం చూసింది. పోలీసులకి రిపోర్టు  ఇవ్వడానికి భయపడనవసరం  లేదని చెప్పి, అవినాష్;ని వాళ్లతో పంపి. పోలీసు స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్  వ్రాయించింది.

ఆ తరువాత రాఖీ జాకీల మీద, తనే స్వయంగా,కిడ్నాప్’ నేరాన్ని ఆరోపించింది. వాళ్లు కిడ్నాప్ చేసిన బాలుడు బహుశా ఆ బంజారీల పిల్లవాడే అయి ఉంటాడని  క్లూ ఇచ్చింది. ఒక వర్ధమాన నటి పోలీసు స్టేషన్’కి వచ్చి రిపోర్టు ఇవ్వడం వల్ల, దాని ప్రాముఖ్యం  మరింత పెరిగింది. తానే స్వయంగా వెళ్లి, ఆ కేసుని విచారిస్తామని, ఎస్.ఐ . చెప్పాడు.

శరణ్య  పోలీసు స్టేషన్ బయటికి రాగానే , ఒక  అమ్మాయి వచ్చి, ఎవరో సినిమా వాళ్లు వచ్చి, ఆమెని పిలుస్తున్నారని, కాస్త దూరంలో ఉన్న కారుని చూపించి  చెప్పింది.  అంతే !

శరణ్య  అనాలోచితంగా ఆ కారు దగ్గరకు వెళ్లింది. ఆ కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగి,  ఆమె ముఖాన్ని నల్లని గుడ్డతో కప్పి, అందులోని మత్తు పదార్థం ద్వారా, ఆమెకి స్పృహ తప్పించారు. తరువాత  ఆమెని కారులో బలవంతంగా త్రోసి, తీసుకొని పోయారు.

అదంతా క్షణంలో జరిగి పోయింది. శరణ్య కారు డ్రైవరు  ఆలీ  దానిని  గ్రహించేటంతలో , ఆ కిడ్నాపర్ల  కారు కనుచూపు మేర దాటిపోయింది. ఆలీ ఆ సంగతిని పోలీసులకి  రిపోర్టు  చేసాడు. కిడ్నాప్ నేరాన్ని రిపోర్టు చేయడానికి వచ్చిన సినీ నటి, కిడ్నాప్’కి  గురి కావడం  పోలీసులకే కాక, అక్కడ ఉన్న ఒక విలేఖరికి కూడా ఆశ్చర్యం కలిగించింది. వెంటనే ఆ వార్త  టి.వి. ఛేనల్లకి చేరిపోయింది !

పోలీసులు మరో దారి లేక  త్వరితంగా పరిశోధనలు మొదలుపెట్టారు.ముందుగా రాఖీ జాకీల  ఇంటికి వెళ్లారు. రాఖీ జాకీలు నేరాన్ని అంగీకరించ లేదు. తమ  దగ్గర  ఉన్న పిల్లాడు  నరేంద్ర అనీ, వాడు తమ మేనల్లుడనీ  అన్నారు. పోలీసులతో వచ్చిన  బంజారీ తల్లి తండ్రులు ఆ బుడ్డోడు తమ పిల్లడేనని  గోల పెట్టారు.

దాంతో  పోలీసులు కుర్రవాడిని తమ కస్టడీలోకి తీసుకొని, రాఖీ జాకీలని అరెస్టు చేసి, ఆ కుర్రవాడికి డి.ఎన్.ఎ. టెస్టు చేయించడానికి తయారయ్యారు.

ఆలీ, శరణ్య కిడ్నాప్ విషయంలో, రాఖీ, జాకీల ప్రమేయం ఉండ వచ్చని చెప్పడంతో, వాల్లని ఇంటరాగేషన్ మొదలు పెట్టారు.

శరణ్యని ఒక మారుమూల శివాలయంలోని బేస్మెంటులో  దాచి ఉంచాడు  నన్కీ యాదవ్ ! సద్దు మణిగాక  ఆమెని బెదిరించి, తమ ప్రతీకారం తిర్చుకోవాలని అనుకొన్నాడు.

ఆలీ ఇంటికి తిరిగి వచ్చి, అవినాష్’కి , శ్యాంకి, నరేంద్రకి, శరణ్య అపహరణ సంగతి  చెప్పాడు. అదృశ్య రూపం లోని మానసి, అప్పటి  కప్పుడే, శరణ్యని  దాచి ఉంచిన స్థలం  తెలుసుకోవడానికి బయలు దేరింది.

శరణ్య  ‘భోపాల్  సెంట్రల్ జైలు లోని’, ఒక హైస్కూలులో ‘ ఇంటర్ రెండవ సంవత్సరం చదువు తున్న రోజులవి !

హత్యా నేరం మీద జీవిత ఖైదు శిక్ష  అనుభవిస్తున్న ఒక ఖైదీ ఆ జైలునుండి పారిపోయాడు. జైల జైలంతా, అలెర్టు అయింది. పారిపోయిన ఖైదీ కోసం, అంతటా వెతికారు, కాని  లాభం లేకపోయింది. ఆ ఖైదీ  ముఖం శరణ్యకి  చిర పరిచితం ! రోజూ  స్కూలుకి  వెళ్లేముందు, అక్కడ  నిర్మాణాధీనమయిన  ఒక  బిల్డింగులో  ‘ తాపీ మేస్త్రీ ’ పని  చేస్తూ కనిపించేవాడు.

 కాళ్లకి, చేతులకీ  పొడవు పాటి సంకెళ్లతో, వెనక ఇద్దరు గార్డులు కాపలా కాస్తూ ఉండగా ! తనని చూసి, నవ్వుతూ పలకరించేవాడు, “ బాగా చదువుతు న్నావా పాపా?”అని. అందుకే అతని ముఖం ఆమెకి గుర్తు ఉండి పోయింది.

ఇప్పుడు తనకి ఎదురుగా నిల్చొని ఉన్న, బీహారీ బద్మాష్,‘నన్కీ యాదవ్’ని  తేరిపార చూసిన ఆమెకి ఆ పారి పోయన  ఖైదీ  గుర్తుకు వచ్చాడు. భూషణం ఇంట్లో  తన మీద అత్యాచారం చేయడానికి  వచ్చిన ప్పుడు, తను అంత  సన్నిహితంగా  చూడలేదు వీడిని ! లేకుంటే  ఈ పాటికే  పట్టించి  ఉండేది ! ఆ జైలులో అందరూ  వాడిని ‘సన్కీ దాదా’ అని పిలిచేవారు. ఆ సన్కీ దాదావే, ఈ నన్కీ యాదవ్ అని గుర్తించడానికి ఆమెకి  ఎంతో సమయం  పట్టలేదు!

నన్కీ యాదవ్  ఆమెని చూసి ఫకాలుమని  నవ్వాడు, “ ఏమిటే  సినిమా హీరోయిన్’వి అయిపో యావు అని, తెగ నీల్గుతున్నావ్ ? ప్రేతాత్మతో స్నేహం కట్టి, మాతోనే ఆడుకంటున్నావ్ ? ఇప్పుడు రమ్మనవే నీ ప్రేతాత్మని ! ” అంటూ.


“మానసి ఎక్కడికైనా రాగలదురా  సన్కీదాదా!” అంది శరణ్య.

ఆమెని ఒక కుర్చీలో కూర్చోబెట్టి  కాళ్లూ, చేతులూ కట్టేసారు, మాట్లాడడానికి  నోటికి అంటించిన  టేపు తొలగించారు, యాదవ్’తో ఉన్న ముగ్గురు అనుచరులు.

‘సన్కీ దాదా !’  అన్న సంభోధన  వినగానే, నన్కీ యాదవ్’కి, గతం గుర్తుకి వచ్చింది. “సన్కీ  దాదావా ? నీకు  ఆ పేరు ఎలా తెలుసే ?” అడిగాడు యాదవ్.

“ తెలుసు, నువ్వు భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయిన  జీవిత ఖైదీవి అన్న విషయం  నాకు తెలుసు ! నేను ఇక్కడి నుంచి బయట పడితే చాలు,  ఈ సంగతి పోలీసులకి చెప్పి, నిన్ను పట్టించగలను. అలా చెయ్యకుండా ఉండాలంటే, నన్ను మర్యాదగా విడిచి పెట్టు !” శరణ్య  ఆ క్షణంలో తనకి తోచిన సామోపాయం ప్రయోగించింది.

నన్కీ యాదవ్ ఖంగ లేదు ! “ అంత వరకు నిన్ను ఎవడు వదులుతాడే ? అందంగా ఉన్నావు గనుక ఆ అందంతో విందు చేసుకొవాలనే, ఆలోచనే లేకపోతే, నిన్నీ పాటికి  ముక్కలు ముక్కలుగా నరికి, ‘ తందూరీ  పొయ్యిలో’ పడేసి కాల్చి మసి చేసే వాడిని, తెలిసిందా ?”

“ నన్ను  పోలిసు స్టేషన్ దగ్గర  కిడ్నాప్ చేసావు ! పోలీసులు గాజులు తొడిగించుకొని  కూర్చుం టారని అనుకోకు, నీ కారుని ట్రేసు  చెయ్యడానికి వాళ్లకి  ఎంతో సేపు పట్టదు.”

“పోలీసులకి ఈ చోటు తెలియదు, నువ్వు ఇప్పుడు  శివాలయం క్రింద బేస్’మెంటులో ఉన్నావు. ఒక వేళ  వాళ్లు వచ్చినా, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్లిపోతారు !

ఆలయానికి బేస్’మెంటు  ఉన్న సంగతి నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు.ఇక  పోతే నీ ‘దెయ్యం’  స్నేహితురాలు, ఆలయం లోని  శివలింగాన్ని దాటి రాలేదు. అందుకని నువ్విప్పుడు  అడకత్తెరలో ‘పోకచెక్కవి’ భూషణం సార్ రాగానే, ముందు నిన్ను వంతుల వారీగా అనుభవించి, ఆ పైన  ముక్కలు  ముక్కలుగా  నరుకుతాము”

శరణ్యకి అర్థమయింది, ‘ ఈ  ఖైదీ ఇన్నాళ్లూ పోలీసులకి దొరకకుండా  ఎలా  ఉన్నాడో !

 మానసి ఇక్కడికి రాలేదు. నరేంద్ర తన యోగశక్తితో, ‘కొరకంచులో  ఇనప మేకుని’ కంట్రోల్ చెయ్య గలడే గాని, ఈ చోటుని  తెలుసుకోలేడు ! పోలీసులు ఈ  సన్కీ దాదా  అన్నట్లు ఇక్కడికి  వచ్చినా ఈ  చోటుని  కనిపెట్టలేరు ! ’ శరణ్యకి  తొలిసారిగా తన పరిస్థితి మీద భయం కలిగింది.

‘ ఈ స్థితిలో  ఎవరున్నారు తనని కాపాడేవాళ్లు!’ ఆమె బుర్ర చాల చురుకుగా పని చేసింది.‘ఇలాంటి  భూగర్భ సొరంగంలోనే , మణికంఠ సిధ్ధుని కంకాళం తపస్సు చేస్తోంది ! అతను పవిత్రాత్మ  కాబట్టి ఈ స్థలానికి రాగలడు !’  శరణ్య మనస్సులోనే మణికంఠ సిద్ధుని స్మరించి, తనని రక్షించమని ప్రార్థించింది.

ఇంతలో యాదవ్ సెల్ ఫోను మ్రోగింది. యాదవ్ దానిని తీసి మాట్లాడాడు. “ హలో, భూషణం సార్ ! మీరా ? రండి బేస్’మెంట్  లోపలికి వచ్చేయండి, మీ కళ్లకి విందు చేసే దృశ్యాన్ని చూడగలరు.” అని ఫోను కట్టేసాడు.

మరి కాసేపటికి  ఒక రహస్య ద్వారం తెరచుకొంది. ద్వారం లోంచి  భూషణం లోపలికి ప్రవేశించాడు. అతనితో పాటు  ఒక, ‘నర కంకాళం’ కూడా లోపలికి  ప్రవేశించింది ! ఆ ఆశ్చర్యకరమూ, భయానకమూ అయిన  దృశ్యం , శరణ్యకి  తప్ప వేరెవరికీ కనబడ లేదు !

ఆ కంకాళాన్ని చూసిన  శరణ్య  కళ్లు ఆనందంతో, జ్యోతుల్లా మెరిసాయి, “ మహాత్మా ! మణికంఠ సిధ్ధా ! ఈ దుర్మార్గుల  చెరనుంచి, నన్ను కాపాడండి,” అంది బిగ్గరగా.

ఆమె ఎవరితో మాట్లాడుతోందో  తెలియక వాళ్లు చుట్టుప్రక్కల అయోమయంగా  చూసారు.

“ఎవరితోనే మాట్లాడుతున్నావు ? నీ యమ్మ మొగుడితోనా ?” యాదవ్ గర్జించాడు.

“ నా తండ్రి  పేరెత్తడానికి కూడా నీకు  అర్హత లేదురా పంది వెధవా ! నా తండ్రికి  మిత్రుడైన ‘ మణికంఠ సిధ్ధుడు’ నన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చారు. ఇక నీ ఆట కట్టు !” అంది శరణ్య.

 అక్కడున్న నన్కీ యాదవ్, భూషణం, మరో ముగ్గురు గుండాలు చుట్టు పరికించి చూసారు, వాళ్లకి ఎవరూ కనిపించ లేదు !!


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద