Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---22

 శరణ్య ఏదో నాటకం ఆడుతోందనీ, తనని మాటల్లో పెట్టి, కాలయాపన చేస్తోందనీ, అనుకొన్నారు వాళ్లు. వెంటనే ఆమె నోటికి టేపు తగిలించారు. అంతే !


‘ నిప్పు రవ్వల లాంటి  ఒక జ్యోతి’ శరణ్య  చుట్టూ వెలిగింది !

ఆ జ్యోతి ప్రకాశాన్ని చూడలేక , వాళ్లందరూ కళ్లు మూసుకొన్నారు.

ఆ క్షణం లోనే మణికంఠ సిధ్ధుని కంకాళం శరణ్య చుట్టూ రక్షాకవచంలాగ  బిగుసుకొని పోయింది ! అందమైన  చిలక లాంటి ఆడపిల్లని, ఒక భయానక అస్థి పంజరంలో పెట్టి  బంధించినట్లు ఉందా దృశ్యం !

వర్ణించడానికి అలవి కాని దృశ్యం !

మానవ కంకాళం  మధ్య, ముడుచుకొని కూర్చొన్న ముద్దుగుమ్మ  అపురూప దృశ్యం !

ఆమె బంధనాలు అన్నీ మాడి మసి అయిపోయాయి. ఆమె నోటికి అంటించిన టేపు నేల రాలి పోయింది. ఆ కంకాళం చేతులలో, ఆమె చేతులు, ఆ కంకాళం కాళ్లల్లో ఆమె కాళ్లు, ఆమె తల ఆ కంకాళం ఊపిరి తిత్తుల మధ్య, ఎవరో తొడుగు తొడిగినట్లు అమిరి పోయాయి !!

నన్కీ యాదవ్’తో ఉన్న ముగ్గురు  గుండాలూ ఆ దృశ్యాన్ని చూసి, మూర్ఛపోయి క్రింద పడ్డారు.

నన్కీ యాదవ్, భూషణం  చేతులనీ, భూషణం  నన్కీ యాదవ్ చేతులనీ, ఒకరిని మరొకరు పట్టుకొని ,చేష్ట లుడిగి పోయారు.

ఆ కంకాళం లేచి నిలబడింది, దానితో పాటే శరణ్య కూడా లేచి నిలబడింది. ఆ కంకాళం నడవ సాగింది, దానితో పాటే శరణ్య కూడా నడవ సాగింది. ఎవరూ ఏమీ చేయలేక పోయారు.

తెరచి ఉన్న ద్వారం గుండా  ఎలాంటి ప్రతిఘటన లేకుండా , ఆ కంకాళం  రక్షణలో శరణ్య బయటికి నడిచింది.

అప్పటికే  అక్కడ  వచ్చి, గుడి చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్న, పోలీసులు  సొరంగ ద్వారం గుండా బయటికి వచ్చిన శరణ్యని  చూసి ఆశ్చర్య పోయారు !

వాళ్ల కళ్లకి ఆ నర కంకాళం కనిపించ లేదు ! ఎందుకంటే అది వచ్చిన  పని అయిపోయింది ! అది ఎలా వచ్చిందో అలాగే మాయమయింది !

“ మేడం ! ఎలా బయట పడ్డారు మీరు ? మిమ్మల్ని కిడ్నాప్  చేసిన వారెవ్వరు ?”  అని అడిగాడు పోలీసు అధికారి.

“సర్ ! ఈ సొరంగంలో నన్ను దాచి హత్యా ప్రయత్నం  చేసారు, ఒక మహానుభావుని దయ వల్ల నేను తప్పించుకో గలిగాను ! ఆ సొరంగంలో బీహారీ బద్మాష్ నన్కీ యాదవ్ , పథిక్ హోటల్ యజమాని విభూతి భూషణ్ శర్మ, వాళ్లకి సహాయం చేసిన కిరాయి గుండాలు ఉన్నారు.

మీకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది. ఆ నన్కీ యాదవ్ ఇంకెవరో కాదు, భోపాల జైలు నుండి జీవిత కాలం శిక్ష తప్పించు కొని పారి పోయిన ‘సన్కీ దాదా’! వెంటనే వెళ్లి వాళ్లని అరెస్టు చెయ్యండి” అంది  శరణ్య.

పోలీసులు బూట్ల చప్పుడు చేసుకొంటూ  బేస్’మెంటు సొరంగం లోపలికి ప్రవేశించారు.

************

‘ పిళ్లై కంస్ట్రక్షన్సు’  సైటు ఆఫీసు ముందు,తెల్లని  అంబాసిడర్  కారు వచ్చి ఆగింది.

అందులోంచి  ఫుల్ సూటులో ఉన్న ఒక వ్యక్తి, బయటికి దిగాడు, చేతిలో  బ్రీఫ్’కేసుతో. పాటు. అతను ఆఫీసు  లోపలికి వెళ్తూ, గేటు దగ్గరే ఉన్న సెక్యూరిటీ  గార్డుని,  అడిగాడు, “ ఖాదిర్ !  టైగరు సార్ లోపల ఉన్నారా ?” అని.

“ ఉన్నారండి, మీ కోసమే ఎదురు చూస్తున్నారు.”

“ సరే ! మేమిద్దరం కలిసి ఇప్పుడే కలెక్టరు ఆఫీసుకి వెళ్లాలి. డ్రైవరుకి చెప్పి కారు రివర్సు  చేసి ఉంచమను.” అంటూ, అతను ఆపీసు లోపలికి  వెళ్లాడు.

ఆ గదిలో విశాలమైన  టేబిల్  వెనక, రివాల్వింగ్ కుర్చీలో, అసహనంతో ఇటూ, అటూ తిరుగుతున్నాడు  తమిళ్ టైగర్ ‘ ఆర్ముగన్ పిళ్లై’..ఆఫీసు లోకి వచ్చిన వ్యక్తిని చూసి,అడిగాడు.

“అర్జున్ ! ఈ సారి టెండరు సరిగా వేసావా?  మనకి  వస్తుందంటావా ?” అన్నాడు.

“ నా సాయశక్తులా ప్రయత్నించి , ప్రతీ చిన్న విషయాన్నీ  పరిశీలించి, టెండర్ వేసాను. ఈ సారి మనకే వస్తుంది  సార్ ! మరి కాసేపట్లో  తెలుస్తుంది కదా ! మీరు ధైర్యంగా ఉండండి. పదండి కలెక్టరు ఆఫీసుకి” అన్నాడు అర్జున్.

"ఊ సరే ! ” అంటూ పిళ్లై  కుర్చీలోంచి లేచాడు.

‘తమిళ్ టైగరుని ఎప్పుడూ  అలా  చూడలేదు. అతను పేరుకి  తగ్గట్లే  పులి.! మాటు వేసి  అవసర మైతే తన చాతుర్యాన్ని చూపించి సామ దాన, దండోపాయలతో, టెండర్లు సంపాదించే టైగరు అతను. కాని  గత మూడు నాలుగు నెలలలో రెండు టెండర్లు చేజారి పోయాయి.

ఈ రోజు జరుగుతున్నది చాలా ప్రతిష్టాత్మకమైన టెండర్ ! రాబోయే వర్షా కాలానికి  ముందుగానే  అండర్ గ్రౌండు డ్రైనేజి  వ్యవస్థని, సరిచేసి, అవసరమైతే నిర్మించి, వర్షాలు పడక ముందే, నీరు రోడ్ల పైకి చేరకుండా రోడ్లని కాపాడాలి!’

ఈ టెండరుని ఎలాగైనా దక్కించుకోవాలి, అందుకే  చాల స్వల్పమైన లాభాన్ని ఉంచుకొని టెండర్ని వేసాను,’ అనుకొన్నాడు  అర్జున్.

“ అర్జున్ , ఏమాలోచిస్తున్నావ్ ?”

నూటికి నూరు శాతం  టెండర్లు  దక్కించకొన్న ‘టైగర్ సర్’ ఈ సారి పది శాతం లాభంతో వెయ్యమని చెప్పాడు ! టెండరు దక్కించుకోవడం  తన ప్రతిష్టగా  భావించాడు  తప్ప.అది ఎంత కష్ట సాధ్యమో  తెలసినట్లు లేదు ! అయినా తెలియజేయడం  తన విది,’ అని భావించి, “ సర్ ! నేను ఇలా అంటున్నానని  మీరు మరొకలాగ  అనుకో వద్దు.”

“ ఫరవాలేదు, చెప్పు.అర్జున్ !”

“ టెండరు మనకి  రాక పోవడమే  మంచిదని నా  అభిప్రాయం !”

పిళ్లై అర్జున్ వంక  విస్తుపోతూ చూసాడు, ‘ ఆ మాట ఇంకెవరైనా అని ఉంటే చెంప పగలగొట్టే వాడే ! కాని అలా మాట్లాడింది అర్జున్, తన కంపెనీకి మూలస్తంభమైన  మనిషి ! ’ అందుకే ఓర్చుకొని  అన్నాడతను, “ ఎందుకలా  అనుకొంటున్నావు అర్జున్ ?” అని అడిగాడు.

“ లాభం చాలా తక్కువ సార్ , కేవలం పది శాతం ! అది ఎందుకూ సరిపోదు. డ్రైనేజీ రిపేర్లు లేకంటే పని ముగిస్తే ఫరవాలేదు, అవి  ఎక్కువగా ఉంటే, నష్టమే కదా సర్ ?”

అర్జున్, ఇవన్నీ నేను ఆలోచించలేదని  అనుకొన్నావా?”

‘ అంత ఆలోచన కూడా ఉందా?’ అని మనసులోనే అనుకొని“నా అభిప్రాయం అది కాదు సర్ !” అన్నాడు అర్జున్.

“ మనం ఈ పనిని చేస్తే ఖర్చులు ఎక్కువే  అవుతాయి, అందుకే  ‘ సబ్ కంట్రాక్టు’ ఇచ్చి, ఖర్చు తగ్గించ వచ్చు.”

“అంటే ?” అర్థం కాక చూసాడు అర్జున్.

“ ఈ డ్రైనేజి  కంట్రాక్టుని  దక్కించుకోవాలని చాలా కాలం నుంచి, ఎదురు చూస్తున్న మనిషి ఒకడున్నాడు. అతనెవరో నీకు తెలుసు.”

అవును సర్ ! రంగారావు , ఇండిపెండెంట్  సివిల్  కంసల్టెంటు ! వాడి క్రింద చాల మంది లేబర్ ఉన్నారు సార్ ! వాడి మాటకి ప్రాణమైనా  ఇస్తారు. నిజానికి  సివిల్  పనులకి  లేబర్లని సప్లయి  చేసేవాడు కూడా అతనే !”

“ సరిగానే చెప్పావ్, వాడికే  ఈ పనిని సబ్ కంట్రాక్టు  క్రింద ఇచ్చేస్తాను. మనకి లేబర్ ప్రోబ్లం  ఉండదు. మనం కేవలం క్వాలిటీ  సరిగా ఉందో లేదో  చెక్ చేసుకోవడమే !”

“ బ్రిలియంట్ అయిడియా సర్ ! ” అర్జున్  నిజంగానే టైగర్ వంక  మెచ్చుకోలుగా చూసాడు. అతని తెలివి తేటలకి ఆశ్చర్యపోయాడు. “ మరొక  ప్రోబ్లం  ఉంది సర్ !” అన్నాడు.

“ మెటిరియల్  విషయమేనా ?”

“ అవును.”

“ మెటిరియల్  చవకగా  దొరికే  చోట్లున్నాయి బ్లాక్ మైల్ చేసి, అవసరమైతే  ‘గన్’ చూపించి, వాటి సరఫరా  చేయించడానికి  మనుషులు నా  దగ్గర  ఉన్నారు.”

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద