Skip to main content

కొరకంచులో ఇనప మేకు ----23

‘అలాంటివారు ఎవరో  అర్జున్’కి అంతు పట్టలేదు. పేరు చెప్పలేదంటే బహుశా టైగరుకి  ఇష్టం లేదు’ అనుకొన్నాడు అర్జున్..

“ చెప్పు, ఇంకేం  సమస్యలు ఉన్నాయి ?”

“ మెటీరియల్, లేబర్  రెండూ  మేనేజ్  చేయగలిగితే, మనకీ టెండరు కలిసి వచ్చినట్లే సార్ !” అన్నాడు అర్జున్ ఉత్సాహంగా.

కారు కలెక్టరు ఆఫీస్’కి  చేరుకొంది.

ఠానే  మున్సిపల్ కార్పొరేషన్  డ్రైనేజి కంటాక్టు  టైగర్’కే దక్కింది. తన మర్యాద  దక్కినందుకు, అతను చాలా సంతోషించాడు.

వెంటనే రంగారావుకి కబురు పంపాడు, సబ్ కంట్రాక్టు ఇవ్వడానికి. రంగారావు  వచ్చి వినయంగా  నిలబడ్డాడు.

“ రంగారావ్ ! డ్రైనేజి  పనుల పూర్తి భాద్యత  నీకే ఇస్తాను. మెటీరియల్,క్వాలిటీ చెకింగులు నావి. నా కంట్రాక్టు  విలువ ఎంతో నీకు తెలుసు కదా, దానిని దృష్టిలో పెట్టుకొని  నీ రేటు చెప్పు,”

రంగారావు  చేతులు కట్టుకొనే చెప్పాడు. “ సర్ ! రెండు రోజులలో ఏ విషయమూ  చెప్తాను,” అని అన్నాడు.

“ఎందుకని ? ఎవరితో సంప్రదించాలి ? నీది ‘వన్ మేన్ కంపెనీ’ కదా ?” అని అడిగాడు, టైగరు, అడిగీ అడగగానే  ఒప్పుకొంటాడని అనుకొన్న మనిషి నానుస్తున్నాడంటే, ఏదో కారణం ఉండే ఉంటుంది’ అనుకొంటూ .

తన జవాబు అతనికి నచ్చలేదని. రంగారావుకి అర్థం అయింది. “ నా  కంపెనీ  వ్యవహారాలలో  ఏకాభిప్రాయము, ఏకాంగీకారమే అయినా , ఈ డ్రైనేజి రిపేరు విషయంలో, క్రిందటి మాన్’సూన్ సీజన్లో  తేడా వచ్చి, లేబర్’కి  అపార నష్టం వచ్చింది సర్ ! అందుకని వాళ్లతో  మాట్లాడి గాని  ఏ విషయమూ చెప్పలేను.” అన్నాడు

“ విషయమేమిటో సూటిగా చెప్పు రంగారావు, అనవసరమైన ఆలస్యాలు నాకు నచ్చవు.”

“సర్!తిలక్ స్ట్రీటు దగ్గర  ఒక చెట్టు మొదలు  వినాయకుని ఆకారంగా మారి, దానికి గుడి కట్టించడం  తెలిసిందేకదా?’’

"అవును,  ఆ గుడికీ, దీనికీ  ఏం సంబంధం ?”

“ చాలా  ఉంది సర్ ! క్రిందటి సారి, మీరు టెండరు తీసుకొని , దానిని ‘ దున్నపోతు శీను గారి’ చేత చేయించారు  కదా, అప్పుడే  లేబర్తో  తేడా  వచ్చింది. ”

“ శీను ఏం చేసాడు ?”

“ డ్రైనేజీ  పైపులని, దగ్గరి దారి అని చెప్పి, వినాయకుని గుడి క్రింద  నుంచి  త్రవ్వించారు . బైపాస్ దారి ఉన్నా దానిని రిపేరు చేస్తే అదనపు ఖర్చు వస్తుందని అలా చేసారు.”

“ నిజమే ! అయితే ---”

“ గుడి క్రింద నుంచి  డ్రైనేజి పైపులేమిటని  లేబర్లు వాదించినా, అతను విన లేదు. ఫలితంగా, వినాయకునికి ఆగ్రహం వచ్చి, అతను దుర్మరణం చెందారు, ఆ పనికి అంగీకరించిన ఇద్దరు లేబర్లు కూడా చచ్చిపోయారు..”

టైగరుకి  విషయం అర్థమయింది. “ సరే ! ఇప్పుడేం చెయ్యాలంటావ్ ?”

“గుడి క్రింద నుంచి పైపులని  తీసేసి, బైపాసు డ్రైనేజీని తిరిగి  సర్వీసులోకి తేవాలి. అప్పుడు గాని లేబర్లు ఈ పని చేయడానికి ఒప్పుకోరు.”

“అలా చేస్తే తడిసి మోపెడు అవుతుంది .”

“ అందుకే  మీ పనిని మీరు చేసుకోండి సార్ ! మీకు లేబర్లు దొరకడం కూడా కష్టమవుతుంది.”

‘టైగరు అరిచినంత  పని చేసాడు.“అంటే  ఏమిటి నీ ఉద్దేశం , నన్ను బ్లాక్ మైల్’చేస్తున్నావా ?”

“ లేదు సర్ ! సమస్య  పూర్వాపరాలు చెప్పాను, ఎవరు కంట్రాక్టు దక్కించుకొన్నా, పని చేసేది, ఆ లేబర్లే  సర్ ! వాళ్ల  నమ్మకాల  మీద  దెబ్బకొట్టి, పని జరగాలని అనుకోవడం తప్పు సార్ !”

“ లేబర్ నీ చేతిలో ఉండబట్టి  అలా మాట్లాడుతున్నావ్  రంగారావ్ ! దున్నపోతు శీను  బ్రతికే  ఉంటే, లేబర్లని  ఆంద్రా నుంచి తెచ్చి ఉండేవాడు, ఆ అలుసు తీసుకొని నన్ను నొక్కిపెడతున్నావ్ ! సరే, నీ రూటులోనే మాట్లాడు, సబ్ కంట్రాక్టు ఎంతకి  కావాలి ?”

‘మీరు ఎంతకి తీసుకొన్నారో మొత్తం అంతా  ఇచ్చినా నేనీ పని చేయించలేను సర్ ! ’ రంగారావు కూడా ధైర్యంగానే జవాబు చెప్పాడు.

టైగరుకి తల తీసేసినట్లైంది ! కాసేపు ఊరుకొని తాపీగా అడిగాడు“రంగారావ్ ! నువ్వు టెండరు వేసావు కదూ ?” అని.

“ వేసాను సర్ ! మీరు వేసిన దానికన్నా, పన్నెండు లక్షలు ఎక్కువకి వేసాను. మీ టెండరు తరువాత , తక్కువ టెండరు నాదే సర్ ! నేను  కారణాలు కూడా  వ్రాసాను.”

“ అంటే నా పని చెయ్యనంటావు, అంతేనా ?”

రంగారావు మాట్లాడ  లేదు. మౌనంగా తల ఊపాడు. అంతే కాదు, వెళ్తానంటూ వెను తిరిగాడు.

దున్నపోతు శీను లేకపోవడం  వల్ల  కలిగిన  నష్టం మొదటి సారి అనుభవం  లోకి వచ్చింది.  తరువాత పని మెటిరియల్  సప్లై ! అది ఎంత సజావుగా ఉందో చూడడానికి, అర్జున్ని తీసుకొని, ‘ నవీ ముంబాయి’ సమీపంలోని ఒక  సప్లయర్ దగ్గరకి వెళ్లాడు.

అక్కడ కూడా అతనికి చుక్క ఎదురయింది ! బాబూరావు గోరే చని పోవడం వల్ల  అక్కడి పరిస్థితి కూడా చేయి దాటిపోయింది ! తమ  దుకాణం  మూసేసామని, మిగిలిన సామాను ఆక్షన్లో అమ్మేసామని,  చెప్పాడు  అక్కడి మేనేజరు. దాన్తో తమిళ టైగరు ఆర్ముగన్  పిళ్లై  కోపం తారాస్థాయికి  చేరుకొంది.

దీనికంతటికీ కారణమైన, ‘ శరణ్య’ పని పట్టాలని అనుకొన్నాడు.“ అర్జున్ ! వెంటనే కలెక్టరు ఆఫీసుకి  వెళ్లి, మనం ఈ పని చేయలేమని  చెప్పు.” అన్నాడు.

‘అర్జున్ అర్థం కానట్లు టైగరు ముఖం వంక  చూసాడు. “ అదేంటది సార్ ! అలా చేస్తే  మన మర్యాద  ఏమవుతుంది ?  వాళ్లు మనకి డిపాజిట్ మనీ ఇవ్వరు, పైపెఛ్ఛు మన  కంపెనీని ‘బ్లాక్  లిస్టు’లోకి చేరుస్తారు” అన్నాడు.

“ ఏమవుతే అది అవుతుంది. ప్రస్తుత పరిస్థితిలో మనమీ పని చెయ్యలేము. అంత  కన్న  ముఖ్య మయిన పని  ఇంకొకటి  ఉంది. ”

“ ఏమిటది సార్ ?”

“ నా కుడి భుజాల లాంటి, స్నేహితులు, దున్నపోతు శీను, బాబూరావు గోరేలని  తీవ్రమైన దుర్మరణానికి గురి చేసి, ఎడమ భుజాల లాంటి స్నేహితులు, నన్కీ యాదవ్, భూషణ్ సర్ లని, పోలీసులకి  పట్టించి, దీనికంతటికీ మూల కారణమైన శరణ్యని  రూపు మాపడం !” అన్నాడు టైగరు.

అర్జున్’కి అర్థం కాలేదు. అయినా అడగడం మంచిది కాదనుకొని , టైగరు  చెప్పిన పని చేయడానికి, మౌనంగా బయలుదేరాడు.

కలెక్టరు ఆఫీసుకి బయలుదేరిన అర్జున్, దారిలోనే తన నిర్ణయాన్నిమార్చుకొన్నాడు.‘కేవలం ఏవేవో పాత పగలని ఙ్ఞాపకం చేసుకొని, నేనీ పని చెయ్యలేను’, అని దొరికిన ఆఫర్’ని,తిరస్కరించడం వల్ల ఎన్నినష్టాలున్నాయో  అతనికి తెలుసు. అవదు అనడానికి అంత తొందర ఎందుకు ! రెండు రోజులు ఆగి, ఈ లోగా ఇంకేదైనా దారి దొరుకుతుందేమో అని ఆలోచించి, తన కారుని రూటు మార్చి , ‘రంగా    రావు’ ఆఫీసుకి  తీసుకొని వెళ్లమని ఆదేశించాడు.

రంగారావు , అర్జున్’ని  సాదరంగా ఆహ్వానించాడు.

ముందుగా అర్జునే సంభాషణ  మొదలు పెట్టాడు. “రంగారావు గారూ!టైగరుకి  కుడి ఎడమ భుజాల లాంటి, నలుగురు వ్యక్తులలో ఇద్దరు దుర్మరణం చెందారు, మరో ఇద్దరు పోలీసులకి పట్టు బడ్డారు.అందువల్ల అతనిప్పుడు చాల  డిప్రెషన్లో ఉన్నాడు ! ఈ ప్రోజెక్టు పని చేసేలా లేడు, పది శాతం వాటాదారుడిగా నాకు ఈ పని నుండి, వెనకడుగు వేయడం ఇష్టం లేదు. --- ” అని రంగారావు వంక సాభిప్రాయంగా చూసాడు.

“ చెప్పండి అర్జున్ ! మీ మనసులో మాట నిశ్శంకోచంగా చెప్పండి.” అన్నాడు రంగారావు.

“మాకు బదులుగా మీరు ఈ పని టేకప్ చెయ్యండి. మీకు మాకు మధ్య ఉన్న తేడా పన్నెండు లక్షల మీకు నేను  ఇస్తాను. టైగర్’కి మాత్రం ఈ విషయం  తెలియజెయ్య వద్దు. అంతా  పూర్తి అయ్యాక, తెలిసినా ఇబ్బంది లేదు.”

“తేడా పన్నెండు లక్షలు ఇచ్చేస్తే సరిపోతుందని ఎలా అనుకొంటున్నారు  అర్జున్? పది శాతం లాభం  మీకే దక్కుతుంది కదా ?”

“ ఆ లాభం కూడా మీరే ఉంచుకోండి. నాకు కంపెనీ బ్లాక్ లిస్టు అవడం ఇష్టం లేదు.” ఆవేశంతో అన్నాడు అర్జున్.

రంగారావు కాసేపు ఆగి, అర్జున్ కళ్లల్లోకి నిశితంగా చూస్తూ, నెమ్మదిగా అడిగాడు, “ మిస్టర్  అర్జున్ మీరు పిళ్లై కంపెనీలో పది శాతం వాటాదారుణ్నని చెప్పారు. మీ  చెక్  పవరు ఎంత ?’’ అని.

“ ఏభై లక్షలు, ఎందుకలా అడిగారు ?”

“ఆ ఏభై లక్షలు నా కంపెనీలో పెట్టుబడి పెట్టండి. పని నేను పూర్తి చేస్తాను, లాభలలో  చెరసగం వాటా పంచుకొందాం.”

అర్జున్ ఆలోచనలో పడ్డాడు,‘టైగరుకి తెలియకుండా ఏభై లక్షలు  రంగారావుకి  ధార పొయ్యాలి, పని పూర్తయ్యేవరకు విషయాన్ని రహస్యంగా కాపాడుకోవాలి, రిస్కు తీసుకోవచ్చా !’ అని.

రంగారావు  తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “మిస్టర్ అర్జున్ ! బిజినెస్సులో  ఇలాంటివి మామూలే ! ఎంత కాలం  టైగర్ చేతి కింద, పది శాతం వాటాతో వెట్టి చాకిరీ చేస్తారు? టైగర్ వెనకడుగు వెయ్యమని మీకు ఎలాగూ చెప్పారుగా ! అలాగే కానివ్వండి, కార్పరేషన్ నుంచి అతని కంపెనీని బ్లాక్ లిస్టు చేసి, డిపాజిట్టు తీసేసుకొన్నట్లు  ఒక ఉత్తరం సృష్టించి పంపిణీ  చేసేద్దాం !

దాంతో ఈ విషయంలో అతను పట్టించుకోడు. మీరు రహస్యంగా మాతో డీల్ చేసుకోండి. అంతా అయ్యాక ఏభై శాతం లాభంతో  అతణ్ని సర్’ప్రైజ్ చెయ్యండి. లేదా మీరే ఉంఛుకోండి, అది మీ ఇష్టం.”

రంగారావు ప్రపోజల్ అర్జున్’కి నచ్చింది. ఉత్తుత్తినే తిరస్కరించే బదులు కొంత పెట్టుబడి పెట్టి, కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి కాపాడడం మంచిది. కంపెనీ పేరూ నిలబడుతుంది, లాభంలో వాటా వస్తుంది. ఏభై లక్షలు తన పర్సెనల్ ఖర్చు క్రింద వ్రాసుకొని , ‘లోన్’ తీసుకొంటే సరి !

“రంగారావు గారూ ! డీల్ అయినట్లే ! నేను రేపే మీ అకౌంటులో 50 లక్షలు ట్రాన్స్’ఫర్ చేస్తాను..కాని---”

“ రంగారావు  అర్జున్’తో చేయి కలుపుతూ అన్నాడు, “ మీ సందేహం నాకు అర్థమయింది, ఈ పని పూర్తి  చేసే సామర్ఠ్యం  నాకు ఉందో లేదో ఋజువు చేసుకోవాల్సిన అవసరం నాకు ఉంది. మీరు మీం కారుని వెనక్కి పంపి, నాతో నా గిడ్డంగి చూడడానికి రండి. అది చూస్తే మీకే తెలుస్తుంది.” అన్నాడు.

అర్జున్ వెంటనే బయటికి వెళ్లి, కారుని పంపించేసి, తిరిగి లోపలికి వచ్చాడు.

రంగారావు అతణ్నిఆ ఆఫీసులోని  బేస్’మెంటుకి తీసుకెళ్లాడు. అక్కడికి  చేరుకొన్నాక, ఒక అలమారా లోంచి, రైన్ కోటు, గంబూట్లు, గ్లవ్సు రెండు సెట్లు తీసాడు. ఒక సెట్టుని తాను ధరిస్తూ, అర్జున్తో  మరొకటి తొడుక్కోమని ఇచ్చాడు. అర్జున్ ఆశ్చర్యంతో చూసి, “ ఇవన్నీ ఎందుకు , మనం వెళ్తున్నది మీ గొడౌన్ చూడడానికి కదా ?.” అని అడిగాడు.

“నా గిడ్డంగి  భూమి మీద లేదు అర్జున్ ! భూగర్భంలో ఉంది.” అంటూ కుతూహలంతో  తనని అనుసరించి వస్తున్న అర్జున్’ని  అక్కడున్న మేన్’హోల్ మూత తెరచి, సొరంగ మార్గం లోకి  తీసుకొని వెళ్లాడు.ఆ సొరంగం  వాళ్లని ఒక డ్రైనేజీ పైపులాంటి పైపు గుండా తీసుకెళ్ల సాగింది.

ఆ పైపు లైనులో వెంటిలేటర్లు, కాంతినిచ్చే దీపాలు ఉన్నాయి. అవన్నీ సోలార్  విద్యుత్తుతో నడుస్తున్నాయని తెలిసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. పైపు లైను చివరకి వచ్చేసరికి  అక్కడ కొన్ని మానవ నిర్మిత మార్గాలు, సహజ గుహలు, కనిపించాయి.

వాటిలోని నాలుగు గుహలలో , సిమెంటు బస్తాలు, ఇసుక బస్తాలు, చిన్న కంకర రాళ్ల గుట్టలు, పారలు, పనిముట్లు ,చిన్న చిన్న ట్రాలీలు  కనిపించాయి. అర్జున్ వాటిని చూసి చాలా ఆశ్చర్య పోయాడు. ‘భూ గర్భంలో సహజ సిధ్ధంగా ఏర్పడి ఉన్న ఆ గుహలకి రంగారావు ,కార్పొరేషనుకి గాని, ఇంకెవరికైనా గాని పన్నులు , అద్దెలు చెల్లించనవసరం లేదు. కాపలాలు పెట్టనక్కర లేదు.

ఆ సరుకుని నేరుగా  డ్రైనేజీ రిపేరు చేసే చోటికి చిన్న చిన్న ట్రాలీల ద్వారా చేర్చ వచ్చు. వాటి రవాణాకి లారీలు, వాహనాలు నడపనక్కరలేదు. ట్రక్కులు, ట్రాఫిక్ జాంలు ఏవీ అతనిని ఇబ్బంది పెట్టవు !’ అనుకొన్నాడు.

రంగారావు,  అర్జున్లు  మరొక  మేన్’హోల్ ద్వారా, బయటికి వచ్చారు.బయటికి వచ్చాక అర్జున్ అక్కడున్న పరిసరాలని చూసి  ఆశ్చర్యపోయాడు. కేవలం. ఇరవై నిమిషాలు  నడిచి ఉంటారేమో, భూగర్భంలో ! కాని ఇరవై కిలోమీటర్ల  దూరం వచ్చారు !

“రంగారావు గారూ ! మీ నెట్’వర్క్ చూసాక నాకున్న అనుమానాలు తీరాయి. ఇంత సాదనా సంపత్తి మరొకరికి సాధ్యం కాదు.,’ అన్నాడు అర్జున్.

“మీ కొక రహస్యం చెప్పనా ? ఈ భూగర్భ గుహల విషయం నాకు చెప్పి, ఈ విదంగా చెయ్యమని  సలహా ఇంకవరో  కాదు, ఆమె ఒక వర్దమాన సినిమా తార పేరు ‘శరణ్య’. అన్నాడు రంగారావు.


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద