కుబేరుని రాజధాని అయిన అలకాపురిలో రాకుమారుడు నలకుబేరుని మందిరం. ఆ మందిరంలోని శయన కక్ష్యం, అత్యంత సుందరం. ఆ కక్ష్యానికి నలుదిశలా నాలుగు ప్రధాన ద్వారాలు. ద్వారములు. ద్వారబంధములు, తలుపులు.సర్వమూ ,సువర్ణఖచితములు. సుమశోభిత అలంకారాలతో సుసజ్జితములు. గవాక్షములు సరేసరి! వృత్తాకారంలో అలంకరింపబడి, పూలదండలలా కన్పడుతున్నాయి. ఆ ప్రాసాద మధ్యంలో పెద్దపడవలాంటి పందిరిమంచం, వాటి పైన స్వర్ణకాంతులీనే పట్టు ఆవరణముల మధ్య మృదువైన హంసతూలికా తల్పము, దిండ్లు అమర్చబడి ఉన్నాయి. పారిజాత, సౌగంధికా పుష్పసౌరభాలు ఆ ప్రదేశాన్నంతా ఆవరించి మత్తు గొలుపుతున్నాయి. పర్యంకము పైన నలకుబేరుడు కూర్చొని ఉన్నాడు.ఇంద్రునితో, చంద్రునితో,మన్మధునితో సరి తూగే సుందర యువకుడతడు. సాక్షాత్తు రంభయే భార్యయైనను, అతడు నిత్యనూతన యక్షిణీ కాంతల పరిష్వంగమూ కోరువాడు. రాజ్యము అతనిది, యక్షులు అతని పరిపాలిత ప్రజలు. సుందరులైన యక్షిణీ కాంతలు కనుసన్నలలో మెలగువారు. అదుపాజ్ఞలు వర్తించని, సర్వస్వతంత్ర సుందర మధుకరుడయిన అతనికి, సౌందర్య సుమ నివాళులిచ్చే స్త్రీలకు