పది రోజులు తరువాత ఒక రోజు సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో ఒక కుర్రాడు నన్ను ఆపి, ఒక ఉత్తరాన్ని చేతికిచ్చి, పరుగు తీసాడు. ఆశ్చర్యంతో ఉత్తరాన్ని చూసుకొన్నాను, నా పేరే ఉంది దాని మీద! కుతూహలంతో ప్రక్కనే ఉన్న మైదానం మీదకి వెళ్లి, లైటుస్తంభాన్ని ఆనుకొని ఉత్తరం తెరచాను. ‘ ఎలా వ్రాయమంటావు తమ్ముడూ! ఈ ఉత్తరాన్ని, ఏమని వ్రాయాలి ? ఏదో ఒక దౌర్భాగ్యపు సంవత్సరం అది ! మధ్య తరగతి గ్రామం లాంటి ,‘ డొంకిన వలసలో’ ఆడపిల్లనై ,తల్లిని మ్రింగి పుట్టాను నేను. అయినా నా వ్యధాపూరిత బాల్య జీవితాన్ని గురించి వేరే చెప్పడం దేనికి ? ఎంత వర్ణించినా అది నీ ఊహా శక్తికి క్రిందుగానే ఉంటుంది ! ఒకానొక పూర్ణిమా శరత్తులో, నా ఇరవై ఒకటవ ఏట, ఇల్లు విడిచి పరుగెత్తాను నేను ! ఒక కన్నెపిల్ల ఇల్లు విడిచి పోవడానికి కారణాలేముంటాయి గనుక ! సవతి తల్లి రాపిడి, తండ్రి ఏరికోరి తెచ్చిన ముసలి వరుడు, ఉబికే ఆశలు, ఉద్రేకాన్ని తీర్చలేని పేదరికం, --- వీటిలో ఏ ఒక్కటైనా చాలు. కాని నా దౌర్భాగ్య స్థితి ఏమని చెప్పమంటావ్ ? ఇవన్నీ కలిపి చుట్టుముట్టాయి నన్ను. పరిస్థితుల ఒత్తిడి నా మీద ఎంత తీవ్రంగా పని చేసిందంటే, రైల్వే స్టేషన్ వైపు నడిచాను నేను. ‘ రాయపూరు