మహారాజ ద్రప్సుడు , జరామాత ఆదేశాన్ని శిరసావహించి మహావీర కర్ణుని, భైరవాలయంలో సంధించడానికి సమ్మతించాడు. ఆ రోజు మంగళవారం, భైరవ దుర్గం దీపమాలికలతో అలంకరింపబడి కలకల లాడుతోంది ! నిండు చంద్రుడు తారాగణంతో ఆకాశ వీధిలో ప్రకాశిస్తున్నాడు. భైరవ దుర్గ ముఖద్వారం పైనున్న శాలలో మంగళ తూర్యారావం వీనుల విందు చేస్తోంది. కోట చుట్టూ ఆశ్విక దళం అప్రమత్తతతో కాపలా కాస్తోంది. భైరవాలయ గోపురం దీపమాలికలతో దేదీప్యమానంగా ఉంది ! రెండు మదపుటేనుగులు కోట సింహ ద్వారానికి రెండు వైపులా నిలబడి ఉన్నాయి. భేరీ కాహళ ధ్వనులు మిన్నుముట్టాయి, కారణం ? మహారాజాధిరాజ రాజ పరమేశ్వర ద్రప్స భట్టారకుల వారు సింధూరారుణ కాంతి గల అశ్వరాజంపై, కోటకు వేంచేస్తున్నాడు ! మహారాజును పరివేష్టించి రెండు వందల మంది రౌతులు వస్తున్నారు. కోట సింహద్వారం తలుపులు బాహాటంగా తెరువబడ్డాయి. మహారాజ ద్రప్సుడు లోనికి ప్రవేశించాడు.అంగరక్షక దళం కూడ లోపలికి ప్రవేశించింది. కొంత సేపటికి ఒక నల్లని గుర్రం బాణంవలె దూసుకొని వస్తూంది. తిరుగ భేరీ కాహళ ధ్వనులు చెలరేగాయి ! అతిరథ శ్రేష్ఠుడైన వృషాకపి కోటలోనికి చొచ్చుకొని వెళ్లాడు. భైరవ దుర్గ సింహద్వారపు తలుపులు మూయబడ్డాయి ! “ మహావీ