Skip to main content

Posts

Showing posts from April, 2012

అళియ అరాళీయము--- ౭

దృశ్యము ౭ (అత్తరు వ్యాపారి కుల్’సుంబీ టెంటు) ( తెల్లని తెర్ మీద ఒక టెంటు కనిపిస్తుంది) ( లైట్లు వెలగగానే  కుల్’సుంబీ నిండా బురఖాలో కూచొని ఉంటుంది. ఆమె కి ఎదురుగా రామరాజు కూర్చొని ఉంటాడు) రామరాజు:     కుల్’సుంబీ బేగం ! మీరు అత్తరు వ్యాపారి అని విన్నాను. ఎంతో ధనాన్ని వెచ్చించి నన్ను విడిపించారని తెలిసింది. కాని నామీద దేశ బహిష్కార శిక్ష పడింది. నేను మీకు ఏ విధంగా సహాయపడ గలను.? కుల్’సుంబీ:     మీరు నాకు సహాయపడడ మేమిటి  ఆర్యపుత్రా ! నేను బ్రతికేదే మీ కోసం ! ( అంటూ ముఖం పైన పరదా తీస్తుంది .ఆశ్చర్యం ఆమె అరాళ కుంతల) రామరాజు:     భద్రముఖీ ! నీవా, ఆశ్చర్యంగా ఉందా ? అరాళ కుంతల:     ఆర్యపుత్రా ! మిమ్ములను ఈ ఆపదలోకి  నెట్టినది నేనే కదా ! సుల్తాను మీ మాటలు విశ్వసించక పోతే మిమ్ములను  కాపాడు కొంటానని మాట ఇచ్చాను, మరచిపోయారా ? రామరాజు:     లేదు ప్రియా ! కాని నన్నెలా కాపాడగలవు ? రేపు సూర్యోదయమునకు ఇంక చాల తక్కువ వ్యవధి ఉంది. అరాళ కుంతల:     ఆ వ్యవధి చాలు ఆర్యపుత్రా ! మీరు అత్తరు వ్యాపారి, ‘రహమతుల్లాగా’ అవతారమెత్తాలి ! సూది గడ్డం , కోర మీసాలు, కుచ్చు టోపీ పెట్టుకొని షరాబు వేషం వేయండి. నేను మీ నవోఢ అయిన

అళియ అరాళీయము -- ౬

దృశ్యం ౬ ( గోల్కొండ కోట లోని రాచబాట) ( తెల్లని తెర మీద  పురవీధిని ప్రదర్శించాలి) ( రామరాజు ఉదాశీనంగా అడుగులు వేస్తూ ఉంటాడు. నలుగురు సిపాయిలు చేత ఆయిధాలతో అతని వెనకగా వస్తారు. అతని మీద నల్లని ముసుగు వేసి కప్పి, అతనిని క్రింద పడవేసి, గుండేల పైన బల్లేలు గురి పెడతారు వారిలో ఇద్దరు) ( తక్కిన ఇద్దరు ఒక తాడుతో ఆ ముసుగుతోనే అతనిని బంధించి ఈడ్చుకొంటూ వెళ్తారు) ( లైట్లు ఆరిపోతాయి) దృశ్యం ౭ ( రహీంఖాన్ ఇంట్లోని చెరసాల) ( తెల్ల తెర పైన చెరసాలని చూపించాలి) (రామరాజు బందీగా ఉంటాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉంటాయి. నోట గుడ్డ కుక్కబడి ఉంటుంది. కళ్లకి గంతలు కట్టి ఉంటాయి) (ప్రవేశం ఇద్దరు కొజ్జాలు) ౧.కొజ్జా     అక్కాయా ! కాపలా దారులు ఇద్దరూ మంచి  పోటుగాళ్లలా ఉన్నారు. నాకైతే మనసయి పోయిందనుకో ! ౨..కొజ్జా     మనసు పారేసుకోకే చెల్లాయా ! పని మీద వచ్చి  ఇలాంటి వాటికి పడిపోతే , ఫలితం దక్కదే ‘బేవార్సు పింజా ’! ౧.కొజ్జా     బేవార్సు పింజ అంటే ఏంటే అక్కాయా ? ౨.కొజ్జా     కరుకు కాయ కాదు, పండు కాయా కాదు, ఏ మాత్రం ఎదగని ముదర పింజనే,‘ బేవార్సు పింజ’ అంటారే  చెల్లాయా ! ౧.కొజ్జా     అక్కాయా ! నేను అన్నానని అనుకోకు,

అళియ అరాళీయము--౫

దృశ్యము 5 ( సుల్తాన్ కులీ దర్బారు) ( తెల్లని తెరలో దర్బారు ఛాయారూపాన్ని కనిపిస్తుంది) (లైట్లు రాగానే సుల్తాను కులీ ఎత్తైన ఆసనం మీద కూర్చొని కనిపిస్తాడు. వెనక ఇద్దరు సేవకులు వింజామరలు వీస్తూ ఉంటారు. సుల్తానుకి ఎడమ వైపు రహీంఖాన్ నిల్చొని ఉంటాడు. సుల్తాను కుడివైపు ప్రవేశ ద్వారం మీద అందరి చూపులు ఉంటాయి) సుల్తాన్:     రహీంఖాన్ ! ఈ రామరాజు హింకా రాలేదేమి ? రహీంఖాన్:     వస్తూనే ఉంటాడు జహాపనాహ్ ! గుస్తాకీ మాఫ్ జహాపనాహ్ ! మీరు ఆ కాఫిర్’ని చాల ఎక్కువగా నమ్మారు. సుల్తాన్:     నీకీ అలా అన్పించిందా ? రహీంఖాన్:     అవును హుజూర్ ! సుల్తాన్:     దుష్మన్;కీ  కోట అప్పగించి వచ్చినందుకు అలా అన్పించిందా ? రహీంఖాన్:     జహాపనాహ్ ! రామరాజు ఎలాంటి ప్రతిఘాటన చెయ్యలేదు. తననీ, తన సైనికులనీ, కోట వదిలి పారిపోయి రక్షించుకొన్నాడు. హిది లడాయికి భయపడడం కాదంటారా హుజూర్ ? సుల్తాన్:     రహీంఖాన్ నువ్వు తప్పుగా సోచాయిస్తున్నావ్ ! కోటలో సంపదని సైనికుల సహాయంతో తెచ్చి, ఖజానాకి చేర్చాడు కదా ? రహీంఖాన్:     నిజమే జహాపనాహ్ ! సంపదా తెచ్చాడు మంచిదే ! కాని ప్రజల మాట హేమిటి ? దుష్మన్  సిపాయిలు మన ప్రజల ధన, మాన ప్రాణాలను దోచుకొని

అళియ అరాళీయము--౪

దృశ్యము 4 ( రాయచూరు దుర్గం లోని దుర్గాధీశుని మహలు) ( తెల్లని తెర వెనక మహలు ఛాయా రూపం కనిపిస్తుంది ) (లైట్లు వెలగగానే  రామరాజు , అరాళ కుంతల కనిపిస్తారు): రామరాజు:     భద్రముఖీ ! నీ నాట్య ప్రదర్శన జరిగే వరకు నీవు లకుమాంబ శిష్యురాలవని చెప్పనే లేదే !? అరాళ కుంతల:     నా నాట్యంలో ఏదైనా కౌశలం కనిపిస్తే అది లకుమాంబ శిక్షణ వలనేనని తెలుసుకోండి. ఇంకా ఆమె దగ్గర నేర్వ వలసినది చాలా ఉంది. నేను ఇంత త్వరగా రంగ  ప్రవేశం చేయడం , ఆమెకి ఇష్టం లేదు. రామరాజు:     అటులనా, అయిన అంత త్వరపడనేల ? అరాళ కుంతల:     మీ దర్శన భాగ్యం కోసమే ! ముందుగా కాలికి గజ్జె కట్టవలసి వచ్చింది. తీరా వచ్చి చూస్తే  మీరు సామాన్యులు కారు, దుర్గాధీశులని తెలిసింది. ( ముఖం ముడుచుకొంటుంది) రామరాజు:     అలిగి, ముఖాన్ని మలినం చేయకు భద్రముఖీ ! నేను నిజాన్ని దాచడాం నేరమే ! దానిని వింటే నీవెక్కడ నాకు దూరమవుతావో నన్న సందేహం వలన అలా ప్రవర్తించాను.ఇంతకీ నన్ను కలిసేందుకు అంత తొందరపాటేల సఖీ ? అరాళ కుంతల:     కారణం శృంగారం కాదు, అత్యంత గంభీరమైన రాజకీయం ఆర్యపుత్రా ! రామరాజు:     రాజకీయ కారణమా ? అరాళ కుంతల:     అవును, నిన్నటి దినం, మీరు శంఖ నాదం విని

అళియ అరాళీయము--౩

దృశ్యము 3 ( రాయచూరు దుర్గంలోని ఏకాంత నర్తన శాల ) ( తెల్లని తెర మీద నాట్యశాలని తలపించేలాంటి ఛాయారూపం కనిపిస్తుంది ) ( నర్తన శాలలో కూర్చొని నలుగురు పౌరులు కబుర్లు చెప్పుకొంటూ ఉంటారు ) 1 . పౌరుడు             ఈ రోజు ఈ నర్తన శాలలో లకుమాంబ కొత్త శిష్యురాలు   గజ్జె కట్టి చేసిన దృశ్యం అద్భుతంగా ఉంది కదూ ? 2 . పౌరుడు             ఆ నర్తకి పేరు అరాళ కుంతల అట ! రూపం పేరు అన్నీ ప్రబంధ నాయికలాగ ఉన్నాయనుకో ! 3 . పౌరుడు             శకుంతలగా , రతీ దేవిగా , పార్వతిగా , మోహినిగా , కుమారి అరాళ కుంతల రంగంలో ప్రవేశించి చేసిన నృత్యం మైమరిపించిందనుకో ! 4 . పౌరుడు             శకుంతలగా ఆమె కాళిదాసు శకుంతలనే మరిపించిందయ్యా ! అడవిలో విచ్చలవిడిగా ప్రకాశించే వెన్నెల లాంటి తేజస్సు , ముగ్ధ మనసుతో దుష్యంతుని లాంటి రాజశేఖరుణ్ని వశం చేసుకొన్న హావ భావ విలాసం , ఆహా , శకుంతల దిగి వచ్చిందనుకో ! 1 . పౌరుడు             రతీ దేవిగా , అరాళ కుంతల రంగ ప్రవేశం చేసినప్పుడు , నాలో

అళియ అరాళీయము--౨

దృశ్యము 2 ( తెల్లతెర వెనుక లైటు వెలుగులో ఒక దుర్గం కనిపిస్తుంది ) ( రాయచూరు దుర్గానికి బహి:  ప్రాంగణం ) ( రంగ స్థలం మీద లైట్లు వెలిగేసరికి నాయికా నాయకులిద్దరూ ఉంటారు ) రామరాజు:     భద్రముఖీ ! అరాళ కుంతలా ! నీ ముంగురులు నిజంగానే తుమ్మెద రెక్కలు ! నీకీ పేరుని శైశవం లోనే ఊహించి పెట్టిన నీ తల్లి తండ్రులు ధన్యులు ! ( అంటూ ఆమె నుదుటి మీద ముంగురులని సవరిస్తాడు) అరాళ కుంతల:     ఆర్యపుత్రా ! నా తండ్రి గొప్ప సాహిత్యాభిమాని ! నంది తిమ్మన మహాకవి వ్రాసిన ,‘ పారిజాతాపహరణం’  అనే ప్రబంధం లోని ఒక ప్రముఖ సన్నివేశంలో,  కథానాయిక  ‘సత్యభామా దేవిని’ వేడుకొంటూ నాయకుడైన శ్రీ కృష్ణుడు పలికిన మాటలని పద్యంగా విని, ఆ పేరుని , నా పేరుగా పెట్టారు. రామరాజు:     అటులనా దేవీ ! ఆ పద్యము బహు రసవత్తరమైనది ! నా కది కంఠోపాఠమే సుమా ! అరాళ కుంతల:     విశ్వసించమంటారా ? (కొంటెగా) రామరాజు:     అవిశ్వాసమునకు తావెక్కడిది చెలీ , అవధరింపుము.     “నను భవదీయ దాసుని , మనంబున నెయ్యపు గిన్క,     బూని దాచిన యది నాకు మన్ననయె, చెల్వగు నీ పదపల్లవంబు,మ     త్కనుకులకాగ్ర కంటక వితానము దాకిన నొచ్చునంచునంచు నే,     ననియెద ,నల

అళియ అరాళీయము--1 (సరాగ - ఉగాది పత్రికలో బహుమతి పొందిన చారిత్రిక నాటకము )

( శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి ఇతివృత్తానికి , ఒకింత శృంగారము, ఒకింత ఉత్కంఠ కలగలిపి రూపొందించిన నాటకము) ప్రధాన పాత్రలు  ( ప్రవేశ క్రమాన్ని అనుసరించి ) 1. సుల్తాన్  కులీ  (గోల్కొండ నవాబు.) 2రామరాజు    (కథా నాయకుడు)3. రహీంఖాన్    (సుల్తాన్ కులీ సిపాయి సలార్.) 4. అరాళ కుంతల (కథా నాయిక.) 5. అప్పాజీ (విజయనగర మహామంత్రి.) 6. శ్రీ కృష్ణ దేవ రాయలు(విజయనగర ప్రభువు). ఇంకా భటులు, సిపాయిలు, పౌరులు, సేవకులు, కొజ్జాలు వగైరా అవసరాన్ని, అవకాశాన్ని బట్టి. హామీ (స్వల్పమైన చారిత్రికాంశానికి కల్పనని జోడించి వ్రాసిన నాటకం ఇది. ఇది వరకు ఎక్కడా ప్రస్తావించబడ లేదని నా అంచనా ! కథనం, నాటకీకరణ, పూర్తిగా మౌళికం. దేనికీ  అనుసరణ గాని , అనువాదం గాని కాదు.   ఎ. శ్రీధర్) ( రంగస్థల అలంకరణ—రంగస్థలానికి కుడి ఎడమ వైపు రెండు ప్రవేశ ద్వారాలు ఉండాలి. మధ్యప్రవేశ ద్వారం ఉండకూడదు. దృశ్యాన్ని తెల్లని తెర పైన  ఛాయా రూప ప్రదర్శన ద్వారా, లేక చిత్రీకరించిన తెరలు మార్చడం ద్వారా చూపించేందుకు ప్రయత్నించాలి నేను తెల్లని తెరపైన ఛాయారూపాలను ప్రతిపాదిస్తున్నాను.) ( దుస్తులు, పాత్రల అలంకరణ—ఆ నాటి చారిత్రిక నేపథ్యానికి తగినట్లు యథోచితంగా చేస